Dhee Murali:టాలెంట్ ఉండాలి కానీ ప్రతిభను నిరూపించుకోవడానికి ఎన్నో వేదికలు ఇప్పుడు సిద్ధంగా ఉన్నాయి.. ముఖ్యంగా ఢీ, జబర్దస్త్ ఇలా ఎన్నో ప్రోగ్రామ్స్ ప్రతిభ ఉన్న వారిని ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ.. ఎంతో మందికి మంచి జీవితాన్ని ప్రసాదిస్తున్నాయని చెప్పవచ్చు.. ఈ క్రమంలోనే చిరంజీవి స్టెప్పుతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చేసారు ఢీ ఫేమ్ మురళి బాబాయ్ (Dhee fame Murali). వయసులో పెద్దవారైనప్పటికీ తన డాన్సు మూమెంట్స్ తో అందరిని ఆశ్చర్యపరిచారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi ) డాన్స్ స్టెప్పును రీ స్టెప్ చేసి చిరంజీవిని తలపించారు మురళి. తాజాగా ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చెప్పడమే కాకుండా తనకు ఢీ లో అవకాశం ఎలా వచ్చింది అనే విషయాన్ని కూడా చెప్పుకొచ్చారు.
ఢీ లో అవకాశం ఎలా వచ్చిందంటే?
ఇంటర్వ్యూలో భాగంగా మురళి మాట్లాడుతూ.. తిరుపతిలోని మున్సిపల్ పార్క్ లో ప్రతి ఆదివారం డాన్సర్స్ పర్ఫామెన్స్ ఇస్తారు. నాని, నవీన్ అనే ఇద్దరు డాన్సర్స్ ఒక ఆదివారం ఒకరు.. మరొక ఆదివారం ఇంకొకరు డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటారు. అయితే ఒక ఆదివారం నేను సరదాగా పార్కుకి వెళ్తే ..అక్కడ ఒక డాన్స్ గ్రూపు వారు ఎవరైనా వచ్చి డాన్స్ వేయండి అని అడిగితే నేను వెళ్ళాను. అప్పుడు చాలామంది వయసులో పెద్దవారని కాస్త చులకనగా చూసారు.. ఏం పాట వేస్తావని అడగ్గా.. చిరంజీవి ముఠామేస్త్రి పాట పెట్టమని అడిగాను.. నేను వేసిన సిగ్నేచర్ స్టెప్పుకి అక్కడ వారంతా స్టన్ అయిపోయారు. వెంటనే ఆ గ్రూప్ డాన్సర్ నేను పర్ఫామెన్స్ ఇస్తూ ఉండగా దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియో అభి మాస్టర్, సంతోష్ మాస్టర్ ల వరకు చేరడంతో వెంటనే వాళ్ళు నాకు వీడియో కాల్ చేసి మరీ నన్ను ఢీ షోకి తీసుకెళ్లిపోయారు. ముఖ్యంగా ఢీ స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడమే కాకుండా మొదటి పర్ఫామెన్స్ తోనే 92 మార్పులు సాధించి విజయం అందుకోవడం నాకు మరింత ఆనందాన్ని కలిగించింది. నా జీవితంలో ఇంత గొప్ప సక్సెస్ అభి మాస్టర్, సంతోష్ మాస్టర్ వల్లే సాధ్యమైంది” అంటూ తన సంతోషాన్ని చెప్పుకొచ్చారు.
వారి మరణంతో దిక్కుతోచని స్థితి..
తన జీవితంలో ఏర్పడ్డ విషాద గాధల గురించి కూడా ఆయన మాట్లాడుతూ.. “చిత్తూరు సంతపేట మంగ సముద్రం మా ఊరు. అమ్మ, అమ్మమ్మ మార్కెట్లో కూరగాయలు అమ్ముకునేవారు. నేను అక్కడే చదువుకున్నాను. వివాహం తర్వాత ఒక కొడుకు, కూతురు పుట్టారు. అయితే భార్య నీటి కుంటలో పడి చనిపోయింది. ఆమె చనిపోయిన మూడు నెలలకే అమ్మ కూడా చనిపోవడంతో దిక్కుతోచని పరిస్థితుల్లోకి వెళ్లిపోయాను. నా పరిస్థితి అప్పుడు అస్తవ్యస్తమైపోయింది. ఆ తర్వాత అన్నింటిని దిగమింగుకొని మళ్ళీ నేనే వ్యాపారం చేయడం మొదలుపెట్టాను. కరోనా సమయంలో పరిస్థితి మరింత దారుణంగా మారింది. ప్రస్తుతం పాప డిగ్రీ పూర్తి చేసి సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు, కొడుకు ఇంటర్ పూర్తి చేశారు. డిగ్రీల చేరాక ఆక్సిడెంట్ అవ్వడంతో కాలేజ్ మాన్పించి ఇంటిపట్టునే ఉంచాము. ఇప్పుడు ఏసీ మెకానిక్గా పనిచేస్తున్నారు.. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురయ్యాయి. ఇప్పుడు అన్నింటినీ ఎదుర్కొని చిరంజీవి గారి స్టెప్పుతో భారీ పాపులారిటీ సొంతం చేసుకొని.. అభి మాస్టర్ , సంతోష్ మాస్టర్ వల్ల ఈ స్టేజ్ లో ఉన్నాను” అంటూ ఎమోషనల్ కామెంట్లు చేశారు మురళి.
ALSO READ: Bigg Boss AgniPariksha Promo 2: అగ్ని పరీక్ష ప్రోమో 2 రిలీజ్.. జానపద కళలకు ప్రాణం పోస్తారా?
.