Tirumala Adulterated Ghee Case: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారం ఎంతవరకు వచ్చింది? రాజకీయ నేతల జోలికి సిట్ వెళ్లడం లేదా? తొలి రాజకీయ అరెస్టు మొదలైందా? ఈ కేసులో మరిన్ని అరెస్టులు తప్పవా? వైసీపీలో ఇదే టెన్షన్ మొదలైందా? రేపో మాపో కొందరు నేతలకు నోటీసులు రావడం ఖాయమా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారం
ఎట్టకేలకు తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారం రెండో అంకం మొదలైంది. ఇప్పటికే నెయ్యి సరఫరా చేసిన వ్యక్తులను అరెస్టు చేసింది సిట్. ఇప్పుడిప్పుడే రాజకీయ నేతల వైపు దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాజీ పీఏను అరెస్టు చేయడం వైసీపీలో కలకలం మొదలైంది.
తిరుమల కల్తీ నెయ్యి కేసులో టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ అప్పన్నను అరెస్టు చేసింది సిట్. ఆయన్ని అదుపులోకి తీసుకున్న సిట్ విచారించింది. సిట్ లేవనెత్తన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇవ్వలేదని సమాచారం. తనకు తెలీదు, మరిచిపోయాను, గుర్తు లేదు అన్న జవాబు మాత్రమే వచ్చిందట. బుధవారం నెల్లూరు కోర్టులో హాజరుపరిచింది సిట్. న్యాయస్థానం నిందితుడికి 14 రోజుల రిమాండ్ విదించింది.
ఇంతకీ అప్పన్న ఎవరు?
ఇంతకీ అప్పన్న ఎవరు? ఎక్కడివాడు? విజయనగరం జిల్లాకు చెందినవాడు అప్పన్న. 2014లో సుబ్బారెడ్డి ఎంపీగా గెలిచిన నుంచి 2024 వరకు ఆయన పీఏగా కొనసాగారు. సుబ్బారెడ్డి తరఫున చాలా విషయాల్లో ఆయనదే కీలక పాత్ర. కల్తీ నెయ్యి కేసులో మొట్ట మొదటి రాజకీయ అరెస్టు ఇదే. గతంలో సిట్ విచారణను తప్పు బడుతూ హైకోర్టుకు వెళ్లాడు అప్పన్న.
2014-24 ఎన్నికలు ముగిసేవరకు టీటీడీ మాజీ ఛైర్మన్ సుబ్బారెడ్డికి పీఏంగా వ్యవహారించాడు. ఢిల్లీలో వైవీ సుబ్బారెడ్డి వ్యవహారాలు ఆయన స్వయంగా చూసేవాడని తెలుస్తోంది. అంతేకాదు జగన్ పాలనలో ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ప్రొటోకాల్ ఓఎస్డీగా అప్పన్న బాధ్యతలు చేపట్టాడు. సామర్థ్యం లేని డెయిరీలకు కాంట్రాక్టు దక్కడంలో అప్పన్న కీలక పాత్ర పోషించినట్టు సిట్ అనుమానించింది.
ALSO READ: ధర్మాన-తమ్మినేని స్కెచ్.. జగన్ ఒప్పుకుంటాడా?
ఈ ఏడాది జూన్‌లో రెండురోజులపాటు ఆయన్ని తిరుపతిలో సిట్ విచారించింది. ఈ వ్యవహారంపై అప్పన్న హైకోర్టుకి వెళ్లడం, దర్యాప్తుపై స్టే విధించడం జరిగిపోయింది. సెప్టెంబరు చివరి వారంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో దర్యాప్తు మొదలైంది. రెండురోజులుగా అప్పన్నని సిట్ విచారించడం మొదలుపెట్టింది. చివరకు బుధవారంఅరెస్టు చేసి, నెల్లూరు కోర్టులో ప్రవేశపెట్టింది.
టీటీడీ ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి ఉన్నప్పుడు ఉత్తరాఖండ్‌కి చెందిన భోలేబాబా డెయిరీ నెయ్యి సరఫరా చేసింది. అయితే నెయ్యి నాణ్యత సరిగా లేదని గుర్తించి ఆ సంస్థను బ్లాక్‌లిస్టులో పెట్టింది టీటీడీ. ఆ తర్వాత తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ నెయ్యి సరఫరా కాంట్రాక్టు దక్కించుకుంది. ఈ డెయిరీకి భోలేబాబా సంస్థ నుంచి కల్తీ నెయ్యి వెళ్లేదని అధికారులు గుర్తించారు. దీంతో ఆనాటి పెద్దల పాత్రపై ఆరా తీయనుంది. వీలైతే రేపోమాపో వారికి నోటీసులు ఇచ్చి విచారించాలని సిట్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.