Tirumala – Alipiri: తిరుమలకు శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల రక్షణే ధ్యేయంగా టీటీడీ ఈ నిర్ణయం తీసుకోవడంతో భక్తుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పవచ్చు. అయితే తిరుమలకు వచ్చే భక్తులు పలు సూచనలు పాటించాలని టీటీడీ కోరింది.
తిరుమల శ్రీవారి దర్శనానికి వేలాది మంది భక్తులు నిత్యం అలిపిరి కాలినడక మార్గాన్ని ఎంచుకుంటున్నారు. స్వామివారి పాదసేవలో నిమగ్నమయ్యే ఈ మార్గం ఇటీవల వన్యమృగాల, ముఖ్యంగా చిరుతపులుల కదలికలతో భద్రతాపరంగా ప్రశ్నార్థకం అయింది. ఇటీవలి రోజులలో భక్తుల మధ్య ఆందోళన పెరిగిన నేపథ్యంలో, టీటీడీ కీలక సమీక్షా సమావేశాన్ని తాజాగా గోకులంలో నిర్వహించింది.
ఈ సమీక్షలో టీటీడీ ఈవో జే. శ్యామల రావు వర్చువల్‌గా, అదనపు ఈవో వెంకయ్య చౌదరి ప్రత్యక్షంగా పాల్గొన్నారు. అటవీ శాఖ, రెవెన్యూ, ఆరోగ్య, విజిలెన్స్, పంచాయతీ రాజ్, అటవీ విభాగాల అధికారులతో కలిసి భద్రతా చర్యలు, జాగ్రత్తలు, తదితర అంశాలపై చర్చ జరిగింది.
భద్రతకు మరింత బలమైన ఏర్పాట్లు
అలిపిరి మెట్ల మార్గంలో భక్తుల రద్దీ అధికంగా ఉండే సమయంలో అదనపు సిబ్బందిని మోహరించనున్నారు. రాత్రి, తెల్లవారుజామున సమయాల్లో భద్రత పెంచే విధంగా స్పెషల్ టాస్క్ టీమ్‌లు ఏర్పాటు చేస్తారు. ఏడవ మైలు నుండి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వరకు సుమారు 2.5 కిలోమీటర్ల దూరం అత్యంత శ్రద్ధతో పర్యవేక్షించబడుతుంది. ఇక నుంచి ఆరోగ్య శాఖతో సమన్వయం ద్వారా చెత్తను ఎప్పటికప్పుడు తొలగించే చర్యలు తీసుకుంటారు. చిరుతల ఆకర్షణకు దారితీసే ఆహార దుర్వాసన నివారణపై ప్రత్యేక చర్యలు చేపడతారు.
సాంకేతిక పరిజ్ఞానంతో చిరుతలపై పట్టు
చిరుతల కదలికలను గుర్తించేందుకు కెమెరా ట్రాపులు, బయో ఫెన్సింగ్‌లు, నెట్ గన్స్, హై ఫ్లాష్ టార్చులు, స్మార్ట్ స్టిక్స్, పెప్పర్ స్ప్రేలు వంటి ఆధునిక రక్షణ పరికరాలను విస్తృతంగా వినియోగించనున్నారు. ఇది వన్యమృగాల కదలికలను ముందుగానే గుర్తించి, ప్రమాదాలను నివారించేందుకు దోహదపడుతుంది. అలిపిరి మార్గాన్ని చిరుత రహిత ప్రాంతంగా మార్చేందుకు లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఇందుకు వైల్డ్ లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సాంకేతిక సలహాలు అందిస్తోంది.
జాయింట్ డ్రైవ్, సమన్వయ చర్యలు
టీటీడీ అటవీ విభాగం, రెవెన్యూ, పంచాయతీరాజ్, విజిలెన్స్, ఆరోగ్య శాఖల సమన్వయంతో నెలనెలా మానవ – వన్యప్రాణి ఘర్షణల నివారణకు జాయింట్ డ్రైవ్ నిర్వహిస్తారు. ఇందుకు ప్రత్యేక సమీక్షా సమావేశాలు నిర్వహించి చర్యల పురోగతిని పరిశీలిస్తారు. అంతేగాక, పాదయాత్రలో పాల్గొనే భక్తులకు నిబంధనలు, జాగ్రత్తలు, అప్రమత్తత అంశాలపై అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
Also Read: Railway Offer: రైల్వే బంపర్ ఆఫర్.. ఇలా చేస్తే రూ. 5 లక్షలు మీకే..
దుకాణదారులకు నిబంధనలు, చట్టపరమైన సూచనలు
అలిపిరి మెట్ల మార్గంలో ఆహార పదార్థాలు విక్రయించే దుకాణదారులకు నిబంధనలు విధిస్తూ, నిషేధిత పదార్థాల అమ్మకంపై ఆంక్షలు విధిస్తున్నారు. చిరుతలకు ఆకర్షణ కలిగించే పదార్థాలపై పూర్తిగా నిషేధం అమలులో ఉంటుంది. ప్రతి వ్యాపారిని ఈ విషయంపై అవగాహన కల్పించే సమావేశాలు కూడా జరుగనున్నాయి.
భక్తులకు సూచనలు
భక్తులు అలిపిరి మార్గం ఎంచుకుంటున్నట్లయితే.. ప్రాతఃకాలంలో లేదా ప్రదర్శిత భద్రతా సమయాల్లోనే ప్రయాణం చేయాలి. జంతువులను ఆకర్షించే ఆహార పదార్థాలను తీసుకెళ్లరాదు. అధికారుల సూచనలు పాటించాలి. అపరిచిత ప్రాంతాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. పిల్లల భద్రతపై తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలి.
భద్రతకు ప్రాధాన్యత
తిరుమల పాదయాత్ర భక్తుల శ్రద్ధ, నమ్మకానికి ప్రతీక. ఈ పవిత్ర యాత్రలో భద్రత మరింత బలపడేందుకు టీటీడీ తగిన చర్యలు తీసుకుంటోంది. భక్తులు జాగ్రత్తగా, భద్రంగా ఈ మార్గంలో సాగేందుకు అధికారుల సమీక్ష, సాంకేతిక ఏర్పాట్లు కొత్త ఆశావాహక దిశగా నడిపిస్తున్నాయి.