TTD Help Line: తిరుమల దేవస్థాన దర్శనం అంటే ఎన్నో కోరికలు, ఎన్నో ఆశల మధ్య జరిగే ఓ భక్తి ప్రయాణం. చాలా మంది భక్తులు ముందుగానే టికెట్లు బుక్ చేసుకుని, గదులు రిజర్వ్ చేసుకుని స్వామివారి దర్శనానికి సన్నద్ధమవుతారు. ఈ ఆన్‌లైన్ యుగంలో భక్తుల సంఖ్యతో పాటు, ఆన్‌లైన్ లావాదేవీలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. కానీ ఇలాంటి వేగవంతమైన వ్యవస్థల్లో చిన్న చిన్న సమస్యలు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా బుకింగ్ సమయంలో డబ్బు డెబిట్ అయి టికెట్ కన్ఫర్మ్ కాకపోవడం, గది దొరకకపోవడం వంటి సమస్యలు చాలా మందిని ఇబ్బంది పెడుతున్నాయి.
ఆదివారాలు, పండగ రోజులల్లో, లేదా సెలవు రోజుల్లో బుక్ చేయాలంటే కొంచెం ఆలస్యం అయినా టికెట్లు దొరకవు. కానీ ఆ సమయానికి డబ్బు అకౌంట్ నుంచి కట్ అవుతుంది. దాంతో ఆ డబ్బు తిరిగి వస్తుందా? ఎవరికైనా ఫిర్యాదు చేయాలా? అని చాలా మంది భక్తులు అయోమయంలో పడిపోతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో తిరుమల తిరుపతి దేవస్థానములు (TTD) భక్తుల కోసం ముందే ఓ స్పష్టమైన వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. దీనితో టీటీడీ అందిస్తున్న సేవలపై శ్రీవారి భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సమస్య ఎలా? పరిష్కారం ఎలా?
ఒకవేళ మీరు ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేస్తూ డబ్బు చెల్లించారని, కానీ సర్వర్ లోపం వల్ల లేదా కనెక్షన్ ఫెయిల్యూర్ వల్ల కన్ఫర్మేషన్ రాలేదని అనుకుందాం. అటువంటి సందర్భాల్లో చాలా సందర్భాల్లో ఆ డబ్బు 3 నుండి 7 పని రోజులలో మీ అకౌంట్‌కి తిరిగి వస్తుంది. కానీ అప్పటికీ రాకపోతే మీరు తగిన అధికారుల్ని సంప్రదించాల్సి ఉంటుంది.
ఈ విషయంపై దేవస్థానం స్పష్టంగా ఒక వివరణ ఇచ్చింది. దాని ప్రకారం, మీరు ఏమైనా డబ్బును చెల్లించి టికెట్ కన్ఫర్మ్ కాలేదా, లేదా గది బుకింగ్ కాలేదా, అయితే మీరు మొదటగా 7 పని రోజుల వరకు వేచి ఉండాలి. ఎందుకంటే బ్యాంకుల మధ్య ట్రాన్సాక్షన్లలో కొన్ని ఆలస్యాలు జరుగుతుంటాయి. అయితే ఆ సమయంలో కూడా మీరు కన్ఫర్మేషన్ మెయిల్, రసీదు లాంటివి లభించకపోతే, నెక్స్ట్ స్టెప్‌గా మీరు TTD అధికారులతో సంప్రదించవచ్చు.
TTD ప్రత్యేకంగా ఇందుకోసం ఒక టోల్ ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. 24 గంటలూ పని చేసే ఈ నంబర్ ద్వారా మీరు ఎప్పుడైనా కాల్ చేసి మీ సమస్య వివరించవచ్చు. ఈ టోల్ ఫ్రీ నంబర్ 155257. ఈ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఎలాంటి సమస్య అయినా, సరైన మార్గదర్శనం ఇస్తారు.
అంతేకాకుండా, డబ్బు రాకపోయిన లేదా తిరిగి క్రెడిట్ కాకుండా ఆలస్యం జరుగుతున్నా అనుమానం ఉంటే, నేరుగా refundservices@tirumala.org అనే మెయిల్ ఐడీకి మెయిల్ చేయవచ్చు. మెయిల్‌లో మీరు ట్రాన్సాక్షన్ వివరాలు, డేట్, సమయం, బ్యాంక్ పేరు, ట్రాన్సాక్షన్ ఐడి వంటి వివరాలు స్పష్టంగా ఇవ్వాలి. దీని ద్వారా అధికారులు మీ అంశాన్ని త్వరగా గుర్తించి పరిష్కరించగలుగుతారు.
ఇంకా ఒక ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్‌ను కూడా TTD అందిస్తోంది. అది 0877-2264590. ఇది తిరుమలకు శ్రీవారి భక్తుల పాలిట ఒక వరంగా చెప్పవచ్చు. ఉదయం నుండి సాయంత్రం వరకు పని చేసే ఈ నంబర్ ద్వారా మీరు సంబంధిత అధికారులను చేరుకోవచ్చు.
ఈ విధంగా, మీరు టెన్షన్ పడకుండా, తగిన సమాచారం ఉన్నట్లయితే సమస్యను చాలా ఈజీగా పరిష్కరించుకోవచ్చు. ఇక్కడే అసలు విషయం.. TTD భక్తుల సౌకర్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఎవరి డబ్బూ వృథా కాకూడదనే నమ్మకంతో వీటిని అమలు చేస్తోంది.
ఇవన్నీ తెలిసిన తర్వాత ఇకపై తిరుమల ఆన్‌లైన్ బుకింగ్‌లో ఏ చిన్న సమస్య వచ్చినా భయపడాల్సిన పని లేదు. మీరు చెల్లించిన ప్రతి రూపాయి విలువైనదని TTD నమ్ముతుంది. అందుకే ఇలా ముందస్తుగా తగిన పరిష్కారాలను సిద్ధం చేసింది. భక్తులందరికీ ఈ సమాచారం తెలిసి ఉంటే, ఇక ఆన్‌లైన్ బుకింగ్ వల్ల కలిగే అసౌకర్యాలు ఉండవు. మీ డబ్బు ఆన్లైన్ సమస్య ద్వారా కట్ అయినా, టీటీడీ తీసుకున్న ప్రత్యేక చర్యతో మీ డబ్బు చెంతకు చేరడం ఖాయం.