High Speed Rail India: ఆధునిక టెక్నాలజీ అంటే మనం వింటూ ఉంటాం, కానీ ఒక ట్రైన్ అమిత వేగంతో దూసుకెళ్లి, గంటలో 82 కిలోమీటర్లు పూర్తిచేస్తుందంటే నమ్మశక్యం కాకపోవచ్చు! అది కూడా ప్రతి స్టేషన్ దగ్గర ఆగుతూ, మరింత స్పష్టంగా చెప్పాలంటే మనం ఊహించలేని వేగంతో. ఆ ప్రయాణంలో ఏ ఒక్క లోపం లేదు, ఏ ఒక్క ఆలస్యం లేదు. మరి ఇది సాధ్యమైందా? అయినా.. ఎక్కడ జరిగింది? ఎలా సాధ్యమైంది? అసలు ట్రైన్ ఏదని అనుకుంటున్నారా? అయితే ఈ కథనం పూర్తిగా చదవండి.
అదొక బిజీ ఉండే మార్గం. అటు రహదారిపై వాహనాల రద్దీ, కేవలం 82 కిలోమీటర్ల దూరానికి గంటల సమయం పట్టే అవకాశం ఉన్న రహదారి. అందుకే స్థానిక ప్రజల, ప్రయాణీకుల అవసరాలను గుర్తుంచుకొని ఇండియన్ రైల్వే ఓ అద్భుతాన్ని సృష్టించింది. బిజీబిజీగా ఉండే ఆ రహదారి ఇక్కట్లకు రైల్వే పట్టాలతో ఎండ్ కార్డు వేసింది. అంతేకాదు స్పెషల్ కారిడార్ ఏర్పాటు చేసి, గంట కంటే తక్కువ సమయంలో 82 కిలోమీటర్ల దూరాన్ని ట్రైన్ అధిగమించేలా చర్యలు తీసుకుంది. తాజాగా నిర్వహించిన ట్రయల్ రన్ సక్సెస్ కావడంతో, ప్రయాణికులు, రైల్వే అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వేగమే లక్ష్యం..
ఇటీవల దేశం అంతా ముచ్చటగా చూసిన ఓ ప్రయోగంను ఇండియన్ రైల్వే సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసింది. ఢిల్లీ, ఘజియాబాద్, మీరట్ నగరాలను కలుపుతూ నిర్మాణంలో ఉన్న నమో భారత్ రైలు కారిడార్ లో, పూర్తిస్థాయి ట్రయల్ రన్ నిర్వహించబడింది. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే.. ఇది కేవలం సాధారణ ప్రయోగం కాదు.. ఇది దేశ రవాణా చరిత్రలో ఒక మైలురాయిలా నిలిచింది. ఒక్క గంటలో 82 కిలోమీటర్ల ప్రయాణం. అది కూడా ప్రతి స్టేషన్ దగ్గర ఆగుతూ, సమయాన్ని ఒక్క సెకనూ మించకుండా పూర్తిచేయడం అనేది ట్రయల్‌లో జరిగిన విశేషం.
సరాయ్ కలే ఖాన్ నుంచి మోదీపురం వరకు.. మెరుపు వేగం
ఈ ప్రయాణం ఢిల్లీ నగరంలోని సరాయ్ కలే ఖాన్ నుంచి మొదలై, మీరట్ సమీపంలోని మోదీపురం వరకూ సాగింది. మొత్తం దూరం 82 కిలోమీటర్లు. ఇందులో మీరట్ మెట్రో రైళ్లు కూడా పక్కన నడుస్తూ పరీక్షల్లో భాగమయ్యాయి. ఇంత వేగంగా రైలు నడవడం, ఇంకా ఎలాంటి అంతరాయం లేకుండా ఆపరేషన్ జరగడం ట్రయల్ విజయాన్ని చూపిస్తుంది.
గరిష్ఠ వేగం.. 160 కిలోమీటర్ల గంటకు!
ఈ ప్రయోగంలో నమో భారత్ రైలు 160 కి.మీ వేగంతో నడిచింది. ఇది భారతదేశంలో రవాణా రికార్డుల్లో ఒక నూతన అధ్యాయం. స్టేషన్లన్నింటిని కవర్ చేస్తూ, పబ్లిక్ రన్‌లా టైమింగ్ పాటిస్తూ ప్రయోగం జరిపారు.
ప్రపంచంలోనే మొదటి LTE ఆధారిత సిగ్నలింగ్ సిస్టమ్!
ఈ కారిడార్ లో ETCS Level-3 హైబ్రిడ్ సిగ్నలింగ్ సిస్టమ్ ను ఉపయోగించారు. ఇది LTE నెట్‌వర్క్ ఆధారంగా పనిచేస్తుంది. దీని ద్వారా ట్రైన్ల మధ్య సమన్వయం, వేగ నియంత్రణ చాలా సులువవుతుంది. మొదటిసారి ప్రపంచంలో ఇలాంటిది ఇక్కడే అమలు చేశారు. ఇందులో ప్లాట్‌ఫాం స్క్రీన్ డోర్లు కూడా ఉన్నాయి. ఇవి ప్రతి స్టేషన్‌లో రైలుకు సంబంధించిన భద్రతను పెంచుతాయి.
స్టేషన్ దగ్గర ఆగింది, కానీ టైమింగ్ మాత్రం అసలు ఆగలేదు!
ఇంత వేగంగా ట్రైన్ వెళ్లినా, ప్రతి స్టేషన్‌లో ఆగడంలో టైమ్‌లో జాప్యం జరగలేదు. ఇది NCRTC నిర్దేశించిన టైమింగ్‌కు ఖచ్చితంగా జరిగిపోయింది. పక్కనే మెట్రో గల ప్రయాణికులు కూడా ఆశ్చర్యపోయేలా ట్రయల్ రన్ ను రైలు పూర్తి చేసింది.
భవిష్యత్తులో దీని ప్రయోజనం ఏమిటి?
ఈ కారిడార్ ప్రారంభమైతే, రోజూ లక్షల మంది ప్రయాణికులకు దైనందిన ప్రయాణంలో సమయం, భద్రత, వేగం అన్నింటిలోనూ మేలు కలగనుంది. ఢిల్లీ, ఘజియాబాద్, మీరట్ మధ్య ఉద్యోగులకు, విద్యార్థులకు ఇది ఒక వరంగా మారనుంది. ఇక ట్రాఫిక్ సమస్య వీరికి బహుదూరమేనని చెప్పవచ్చు.
ఈ ట్రయల్ చూస్తే భవిష్యత్తు ఇండియన్ రైల్వే రవాణా వ్యవస్థ ఎలా ఉండబోతుందో అర్థమవుతుంది. ట్రైన్ అంటే నిదానంగా నడిచే రోజులు పోయాయి. ఇప్పుడు దేశానికి వేగం కూడా వచ్చేసింది.. ఇక కొద్దిరోజులు ఆగితే, ఒక్క గంటలో ఢిల్లీ నుంచి మీరట్ చేరే రోజులు మనవే అంటున్నారు ఈ ట్రయల్ రన్ చూసిన ఢిల్లీ వాసులు.