TVK Vijay: తమిళనాడులోని కరూర్‌లోశనివారం రాత్రి టీవీకే అధినేత, సినీ హీరో విజయ్ ర్యాలీలో ఘోర విషాదం చోటుచేసుకుంది. తొక్కిసలాట జరిగి 40 మంది మృతి చెందారు. తొక్కిసలాట ఘటనపై తమిళనాడు డీఎంకే ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అయితే ఎఫ్ఐఆర్ లో టీవీకే అధినేత విజయ్ పేరు ఉంటుందని అందరూ భావించారు. కానీ ఈ విషయంలో స్టాలిన్ ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరిస్తోంది.
తమిళగ వెట్రీ కజగం(టీవీకే)కి చెందిన పలు నేతలు, కార్యకర్తలపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ లో హీరో విజయ్ పేరును పేర్కొనలేదు. డీఎంకే రాజకీయ వ్యూహంలో భాగంగానే విజయ్ పేరును ఎఫ్ఐఆర్ చేర్చలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తొక్కిసలాట ఘటనకు సంబంధించి విజయ్‌పై తక్షణ చర్యలు, అరెస్టు, విచారణ, ఎఫ్‌ఐఆర్‌లో ప్రస్తావించడం చేస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాలని డీఎంకే భావిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. విజయ్ పై చర్యలు తీసుకుంటే ప్రజల్లో సానుభూతి వచ్చే అవకాశం ఉందని, అందుకే డీఎంకే ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకుండా ఈ ఘటనపై వ్యూహాత్మకంగా వ్యవహరించిందని ప్రచారం జరుగుతోంది.
తొక్కిసలాట కారణాలపై విచారణకు రిటైర్డ్ హైకోర్టు జడ్జి జస్టిస్ అరుణా జగదీశన్ నేతృత్వంలో ఒక మహిళా కమిషన్‌ను ఏర్పాటు చేసింది తమిళనాడు ప్రభుత్వం. మద్రాసు హైకోర్టు ఈ ఘటనపై విచారణ చేపట్టనుండడంతో.. ప్రభుత్వం ఏదైనా తొందరపాటు చర్య తీసుకుంటే కోర్టు నుంచి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఈ విధంగా వ్యవహరించినట్లు ఓ న్యాయవాది తెలిపారు.
తొక్కిసలాట ఘటనపై సీబీఐ దర్యాప్తు చేయాలని, ఈ ఘటనలో కుట్ర దాగి ఉందని టీవీకే హైకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో తొందరపాటుగా ఏదైనా నిర్ణయం తీసుకుంటే డీఎంకేపై వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.
శనివారం రాత్రి పోలీసులు టీవీకే కరూర్ జిల్లా కార్యదర్శి వీపీ మథియజగన్ పై కేసు నమోదు చేశారు. ర్యాలీ జరిగిన ప్రాంతంలో నిబంధనలను ఉల్లంఘించారని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. ఆదివారం ఈ కేసులో టీవీకే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనంద్, జాయింట్ జనరల్ సెక్రటరీ సీటీఆర్ నిర్మల్ కుమార్ పేర్లను చేర్చారు. అయితే ఎఫ్‌ఐఆర్‌లో విజయ్ పేరు మాత్రమే లేదు. అతని సన్నిహితుడు, జనరల్ సెక్రటరీ ఆధవ్ అర్జున పేరు ఎఫ్ఐఆర్ లేకపోవడం గమనార్హం.
వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవల టీవీకే పార్టీ స్థాపించిన హీరో విజయ్.. యాక్టివ్ గా ప్రచారాలు నిర్వహిస్తు్న్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. శనివారం కరూర్ లో విజయ్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 40 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారు.
ఈ ఘటనపై డీఎంకే ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. ఆదివారం తెల్లవారుజామున సీఎం ఎంకే స్టాలిన్ కరూర్ వెళ్లి బాధితులను పరామర్శించారు. అక్కడ విజయ్‌ను అరెస్టు చేస్తారా? అని విలేకరులు అడిగిన ప్రశ్నలకు, రాజకీయ ఉద్దేశాలపై తాను సమాధానం ఇవ్వనని స్టాలిన్ బదులిచ్చారు. జస్టిస్ జగదీశన్ విచారణ అనంతరం చర్యలు ఉంటాయని తేల్చి చెప్పారు.
Also Read: Chennai News: కరూర్ తొక్కిసలాట ఘటన.. రంగంలోకి జస్టిస్ అరుణ జగదీశన్, ఇంతకీ ఎవరామె?
డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ సైతం ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అందరి నాయకులకు ప్రచారం చేసే హక్కు ఉందని, పార్టీలు ప్రచార సమయాల్లో ప్రజల భద్రతపై దృష్టి పెట్టాలని కోరారు. ఆ బాధ్యత నిర్వాహకులు, స్థానిక నేతలదేనని ఆయన అన్నారు.
ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు స్టాలిన్ చాలా సార్లు ఆలోచిస్తారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. విజయ్ ను అరెస్టు చేసినా, ఇతర చర్యలు తీసుకున్నా అది బూమరాంగ్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. అయితే తొక్కిసలాటపై టీవీకే నేతలు స్పందించడంలేదు.