Tirumala News: తిరుమల శ్రీవారి ఆలయ దర్శనం కోసం.. దేశవ్యాప్తంగా భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ప్రతి నెలా భక్తుల సౌలభ్యం కోసం టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) దర్శన కోటా, ఆర్జిత సేవా టికెట్లు, వసతి గదుల బుకింగ్స్‌ను ముందుగానే.. ఆన్‌లైన్ ద్వారా విడుదల చేస్తుంది. డిసెంబర్ నెలకు సంబంధించిన దర్శన, సేవా టికెట్లు, గదుల కోటా విడుదలకు సంబంధించిన.. పూర్తి షెడ్యూల్‌ను టీటీడీ ప్రకటించింది.
ఆర్జిత సేవా టికెట్లు
డిసెంబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను.. సెప్టెంబర్ 18న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. ఇందులో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ వంటి ప్రసిద్ధ సేవలు ఉన్నాయి. ఈ టికెట్ల కోసం భక్తులు ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో నమోదు చేసుకోవాలి. నమోదు గడువు సెప్టెంబర్ 20 ఉదయం 10 గంటల వరకు ఉంటుంది.
అదే విధంగా అంగప్రదక్షిణ టోకెన్లు కూడా.. ఈసారి ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా కేటాయించబడతాయి. లక్కీడిప్‌లో టికెట్లు పొందిన వారు సెప్టెంబర్ 20 నుండి 22 మధ్యాహ్నం 12 గంటలలోపు చెల్లింపులు పూర్తి చేయాలి.
సేవా టికెట్ల రెండో విడత విడుదల
సెప్టెంబర్ 22న ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లను మళ్లీ విడుదల చేస్తారు. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా కోటా కూడా అందుబాటులోకి రానుంది. వర్చువల్ సేవలు ఎంచుకున్న భక్తులకు దర్శన స్లాట్లు కేటాయించబడతాయి.
శ్రీవాణి ట్రస్ట్ దర్శన కోటా
భక్తులలో ఎంతో ఆదరణ పొందుతున్న శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లను.. సెప్టెంబర్ 23న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ టికెట్లు సాధారణ దర్శన టికెట్లతో పోలిస్తే.. ప్రత్యేక ప్రాధాన్యత కలిగినవి.
వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా
వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న భక్తులకు.. ఉచిత దర్శన కోటా కేటాయించబడుతుంది. ఈ టోకెన్లు సెప్టెంబర్ 23న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. వీటి ద్వారా ప్రత్యేక క్యూలైన్ ద్వారా.. శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని సులభంగా దర్శించుకునే అవకాశం ఉంటుంది.
ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు
డిసెంబర్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను.. (₹300 టికెట్లు) సెప్టెంబర్ 24న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ టికెట్లు అత్యంత డిమాండ్‌లో ఉంటాయి. కాబట్టి భక్తులు ముందుగానే లాగిన్ అయి బుక్ చేసుకోవడం అవసరం.
తిరుమల, తిరుపతి గదుల కోటా
భక్తులకు వసతి సదుపాయాల కోసం తిరుమల, తిరుపతిలలో గదుల కోటాను సెప్టెంబర్ 24న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు. గదుల బుకింగ్ కూడా ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. గదులు తక్కువ సమయంలోనే బుక్ అయిపోతాయి కాబట్టి, భక్తులు సమయానికి సిద్ధంగా ఉండాలని టీటీడీ సూచిస్తోంది.
భక్తులకు సూచనలు
టికెట్లు, గదుల బుకింగ్స్ పూర్తిగా ఆన్‌లైన్‌లో మాత్రమే అందుబాటులో ఉంటాయి.
లక్కీడిప్‌లో టికెట్లు పొందిన వారు నిర్దిష్ట సమయానికి చెల్లింపులు చేయకపోతే, వాటి గడువు రద్దవుతుంది.
వృద్ధులు, దివ్యాంగుల కోటాకు సంబంధించిన టోకెన్లు.. కేవలం అర్హులైనవారికి మాత్రమే ఇవ్వబడతాయి.
అధిక డిమాండ్ కారణంగా టికెట్లు తక్షణమే బుక్ అయిపోవచ్చు. కాబట్టి భక్తులు ముందుగానే తమ TTD ఆన్‌లైన్ అకౌంట్‌లో లాగిన్ అవ్వాలి.
Also Read: కృష్ణానదిపై ఐకానిక్ కేబుల్ వంతెన.. చంద్రబాబు అదిరిపోయే ప్లాన్
డిసెంబర్ నెలలో తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకోవాలనుకునే భక్తులందరూ.. ఈ షెడ్యూల్‌ను గమనించి, సమయానికి టికెట్లు బుక్ చేసుకోవాలి. టీటీడీ ప్రతి నెలా ఆన్‌లైన్ కోటాను విడుదల చేయడం వల్ల.. దేశం నలుమూలల నుంచి భక్తులకు సమాన అవకాశం లభిస్తోంది.