East Godavari District: అమెరికాకు వెళ్లిన భారతీయులు అక్కడ ఏదో విధంగా మృత్యువాత పడుతూనే ఉన్నారు. ప్రమాదాల్లో కొందరు, జలపాతాల్లో పడి మరికొందరు మృతి చెందుతున్న ఘటన క్రమంలో పెరుగుతున్నాయి. తాజాగా తూర్పుగోదావరికి చెందిన ఓ టెక్కీ, అర్థాంతరం ఈ లోకాన్ని విడిచిపెట్టిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం దుళ్ల గ్రామానికి చెందిన కంటిపూడి శ్రీనివాస్ కొడుకు కేశవ్ చౌదరి. ఆయన వయస్సు 27 ఏళ్లు. కంటిపూడి శ్రీనివాస్ టీడీపీ నేత కూడా. అమెరికా వెళ్లిన ఆయన కొడుకు కేశవ్, ఎంఎస్ పూర్తి చేశాడు. చదువు అక్కడే ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. అక్కడ జరిగిన ఓ ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు.
శనివారం సాయంత్రం ఫ్రెండ్స్‌తో కలిసి జలపాతం సందర్శనకు వెళ్లాడు. ఆ సమయంలో ఏం జరిగిందో తెలీదు. నీటిలో పడిపోవడంతో ఈ లోకాన్ని విడిచిపెట్టాడు కేశవ్. ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందిన విషయం కుటుంబసభ్యులకు కేశవ్ ఫ్రెండ్స్ చెప్పారు. కేశవ్ లేడన్న విషయం తెలియగానే తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. తల్లిదండ్రులతోపాటు బంధువులు జీర్ణించుకోలేక పోతున్నారు.
ఈ విషయం తెలియగానే ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి రంగంలోకి దిగారు. కేశవ్ మృతదేహాన్ని స్వగ్రామానికి రప్పించేందుకు చర్యలు మొదలుపెట్టారు. ఈ విషయాన్ని మంత్రి లోకేశ్ దృష్టికి ఎమ్మెల్యే తీసుకెళ్లారు. దీంతో అక్కడ లోకేష్ టీమ్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు. ఉన్నత చదువులు పూర్తి చేసి జీవితంలో స్థిరపడతాడని భావించారు తల్లిదండ్రులు. అనుకోకుండా జరిగిన ఘటనతో దుళ్ల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ALSO READ: ప్రజల కోసం ఓపెనవుతున్న ప్యాలెస్‌లు.. ఓ వైపు జగన్ ‘రుషికొండ’, మరోవైపు కేజ్రీవాల్ ‘శీష్‌మహల్’