WhatsApp Security Alert: వాట్సప్ వాడుతున్న కోట్లాది మంది యూజర్లకు కేంద్ర ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ సంస్థ CERT-In కీలక హెచ్చరిక జారీ చేసింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్, మ్యాక్ డెస్క్‌టాప్‌లలో పనిచేసే వాట్సప్ యాప్‌లలో కొన్ని భద్రతా లోపాలను గుర్తించింది. వీటి ద్వారా హ్యాకర్లు యూజర్ల ఫోన్‌లోకి చొరబడటమే కాకుండా.. వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా వాట్సప్, వాట్సప్ బిజినెస్ వాడేవారు ఈ హెచ్చరికను నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే తమ యాప్‌లను అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది.
నవంబర్ 26న CIVN-2026-0576 పేరుతో CERT-In ఈ హెచ్చరికను విడుదల చేసింది. వాట్సప్‌లో గుర్తించిన లోపాలను హై రిస్క్‌గా పేర్కొంది. SQL ఇంజెక్షన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్‌లో సమస్యలు, బయట నుంచి వచ్చే యాడ్ రిప్లై లింక్‌లను సరిగ్గా చెక్ చేయకపోవడం వంటి కారణాలతో ఈ సమస్యలు తలెత్తినట్లు తెలిపింది. వీటిని ఉపయోగించుకుని హ్యాకర్లు ప్రత్యేకంగా తయారు చేసిన మెసేజ్ లేదా లింక్ పంపి దాడి చేసే అవకాశం ఉంది.
ఈ లోపాలను హ్యాకర్లు ఉపయోగించుకుంటే ఫోన్‌లోని వాట్సప్ ఫైల్స్‌ను తొలగించవచ్చు. వ్యక్తిగత సమాచారాన్ని తెలుసుకోవచ్చు. యాప్‌లోని భద్రతా పరిమితులను దాటుకుని డేటాలో మార్పులు చేసే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా కొన్ని ప్రత్యేక మెసేజ్‌లు, లింక్‌ల ద్వారా యూజర్ల ఐపీ అడ్రస్ వివరాలు తెలుసుకునే ప్రమాదం ఉందని మెటా వెల్లడించింది. అయితే ఒక లోపాన్ని ఎవరైనా ఇప్పటికే దుర్వినియోగం చేసినట్లు ఆధారాలు లేవని సంస్థ తెలిపింది.
CERT-In తెలిపిన వివరాల ప్రకారం.. ఆండ్రాయిడ్‌లో వాట్సప్ 2.26.35.74 కంటే పాత వెర్షన్లు, బిజినెస్ యాప్ 2.26.23.70 కంటే పాత వెర్షన్లు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ఐఫోన్‌లో వాట్సప్ 2.26.24.72, బిజినెస్ 2.26.23.72 కంటే పాత వెర్షన్లు, మ్యాక్ డెస్క్‌టాప్‌లో 2.26.23.72 కంటే పాత వెర్షన్లపై ప్రభావం ఉండొచ్చు.
ఈ సమస్యల నుంచి బయటపడాలంటే గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లోకి వెళ్లి వాట్సప్‌కు కొత్త అప్‌డేట్ ఉందో లేదో చూడండి. ఉంటే వెంటనే ఇన్‌స్టాల్ చేయండి. వాట్సప్ బిజినెస్ వాడేవారు కూడా ఇదే విధంగా అప్‌డేట్ చేసుకోవాలి. మ్యాక్ యూజర్లు డెస్క్‌టాప్ యాప్‌ను కొత్త వెర్షన్‌కు మార్చుకోవాలి. తెలియని వ్యక్తులు పంపే అనుమానాస్పద లింక్‌లు, మెసేజ్‌లను ఓపెన్ చేయకుండా జాగ్రత్తపడాలి.
Also Read: ఐఫోన్ డేటా ఆండ్రాయిడ్‌లోకి మార్చడం ఇంత ఈజీనా? కేబుల్‌తో పనిలేకుండా సేఫ్‌గా ట్రాన్స్‌ఫర్ చేయండిలా!