TTD Board Meeting: భక్తుల సౌకర్యాలను మరింత విస్తృతం చేయడమే లక్ష్యంగా.. టీటీడీ ధర్మకర్తల మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన మంగళవారం తిరుమల అన్నమయ్య భవనంలో జరిగిన బోర్డు సమావేశంలో.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆమోదం లభించింది.
తిరుపతిలో భక్తుల సౌకర్యార్థం 20 ఎకరాల విస్తీర్ణంలో ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ నిర్మాణానికి.. ప్రణాళిక రూపొందించాలని బోర్డు నిర్ణయించింది. ఈ టౌన్‌షిప్ ద్వారా వసతి, పార్కింగ్, భోజన సదుపాయాలు, ఇతర సేవలు ఒకేచోట అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసం ప్లానింగ్ కన్సల్టెంట్, ఆర్కిటెక్ట్ నియామకానికి ఆమోదం తెలిపింది.
భక్తుల సంఖ్య దేశవ్యాప్తంగా పెరుగుతున్న నేపథ్యంలో, మహారాష్ట్ర రాజధాని ముంబైలోని బాంద్రా ప్రాంతంలో రూ.14.40 కోట్ల వ్యయంతో శ్రీవారి ఆలయం నిర్మించేందుకు కూడా బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
తిరుమలలో మౌలిక వసతుల అభివృద్ధితో పాటు ఆధ్యాత్మికతను ప్రతిబింబించే విధంగా రహదారులు, ప్రధాన కూడళ్లకు శ్రీవారి నామాలతో పేర్లు పెట్టేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కమిటీలో పండితులు, సాంస్కృతిక నిపుణులు సభ్యులుగా ఉండనున్నారు. వైష్ణవ పురాణాలు, ఆళ్వార్లు, అన్నమాచార్య కీర్తనల ఆధారంగా పేర్లను ఖరారు చేయనున్నారు.
టీటీడీ విద్యా సంస్థల అభివృద్ధికి పెద్దపీట వేసింది. టీటీడీ ఆధ్వర్యంలోని 31 విద్యా సంస్థల్లో డిజిటల్ క్లాస్‌రూములు, సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, సాఫ్ట్‌వేర్, అవసరమైన సిబ్బంది నియామకానికి బోర్డు ఆమోదం తెలిపింది. అలాగే శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో అత్యాధునిక వైద్య సదుపాయాల కల్పనకు అదనంగా రూ.48 కోట్లు మంజూరు చేసింది.
తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థినుల వసతి సమస్యను దృష్టిలో పెట్టుకొని, ప్రస్తుతం ఉన్న 2100 హాస్టల్ సీట్లకు అదనంగా మరో 270 సీట్లు పెంచాలని నిర్ణయించారు. అలాగే ఎస్వీ, ఎస్పీడబ్ల్యూ జూనియర్ కళాశాలల్లో డేస్కాలర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు కూడా ఆమోదం తెలిపారు.
ఆలయాల పరిరక్షణకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తిరుమలలోని పురాతన కట్టడాల సంరక్షణ కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని, అనుభవం ఉన్న అధికారులను నియమించాలని బోర్డు నిర్ణయించింది. అలాగే టీటీడీ ఆలయాలకు అవసరమైన ధ్వజస్తంభాలు, రథాల తయారీ కోసం పళమనేరు ప్రాంతంలో 100 ఎకరాల్లో దివ్య వృక్షాలు పెంచాలని నిర్ణయించారు.
టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో నాలుగు కేటగిరీలలో ఖాళీగా ఉన్న 60 పోస్టులను త్వరలో భర్తీ చేయాలని బోర్డు నిర్ణయించింది. ఇప్పటికే విడుదల చేసిన నోటిఫికేషన్‌ను ఆధారంగా చేసుకొని నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించింది. ఈ నిర్ణయంతో ఆలయాలు, వసతి సముదాయాలు, రహదారులు వంటి కీలక పనులు మరింత సమర్థంగా నిర్వహించేందుకు అవకాశం ఏర్పడనుంది.
తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రోడ్ల నిర్వహణ, మరమ్మతులు, వీధి దీపాల సంరక్షణ పనులు కొనసాగించాలని సమావేశంలో స్పష్టం చేశారు. భక్తులు, స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలు తలెత్తకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని అధికారులకు సూచించారు.
శ్రీవారి పోటు నిర్వహణను మరింత క్రమబద్ధంగా చేయాలనే ఉద్దేశంతో, నిబంధనల ప్రకారం 18 కొత్త పోటు సూపర్‌వైజర్ (పాచక) పోస్టుల ఏర్పాటు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదన పంపాలని నిర్ణయం తీసుకున్నారు.
ఆలయ సేవల్లో కీలకమైన యాదవ సేవలను బలోపేతం చేయడానికి ఒక ప్రధాన సన్నిధి యాదవతో పాటు మరో అదనపు సన్నిధి యాదవ పోస్టుల భర్తీకి ఆమోదం లభించింది.
తిరుమలతో పాటు కాలిబాట మార్గంలో ఉన్న పురాతన, చారిత్రక ప్రాముఖ్యత కలిగిన కట్టడాల పరిరక్షణ కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
విద్యార్థుల సంక్షేమంపై దృష్టి సారిస్తూ, రాష్ట్ర ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అమలులో ఉన్న మధ్యాహ్న భోజన పథకం తరహాలో టీటీడీ ఎస్వీ, ఎస్పీడబ్ల్యూ జూనియర్ కళాశాలల్లో డేస్కాలర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు ఆమోదం తెలిపారు.
అలాగే జగిత్యాల జిల్లా కొండగట్టులోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో.. భక్తుల వసతి సౌకర్యాల కోసం నివాస సముదాయం నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నారు.
టీటీడీ అనుబంధ ఆలయాల్లో పనిచేస్తున్న 62 మంది అర్చకులు, పరిచారకులు, పోటు వర్కర్లు, ప్రసాదం పంపిణీ సిబ్బందికి వేతనాలు గణనీయంగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అర్చకుల వేతనం రూ.25,000 నుంచి రూ.45,000కు, పరిచారకుల వేతనం రూ.23,140 నుంచి రూ.30,000కు, పోటు వర్కర్లు, ప్రసాదం డిస్ట్రిబ్యూటర్ల వేతనాలు కూడా రూ.30,000కు పెంచారు.
Also Read: భవానీపురం ఇళ్ల కూల్చివేతపై సీబీఐ దర్యాప్తు జరపించాలి.. వైఎస్ జగన్ డిమాండ్
ఈ సమావేశంలో టీటీడీ ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, పలువురు బోర్డు సభ్యులు, జెఈవో శ్రీ వి. వీరబ్రహ్మం పాల్గొన్నారు.