TTD Admissions: తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల, శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాలలో 2025–26 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులను టీటీడీ విద్యాశాఖ ఆహ్వానిస్తోంది. ఈ మేరకు మే 15వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది.
దరఖాస్తు ఫారం పూర్తి స్థాయిలో ఇంగ్లీషులో ఉండేలా రూపొందించబడింది. అయితే విద్యార్థులకు అవగాహన కోసం స్టూడెంట్ మాన్యువల్, కళాశాలల ప్రాస్పెక్టస్‌ను తెలుగు మరియు ఆంగ్ల భాషల్లో అందుబాటులో ఉంచారు. వీటిని చదివి, దరఖాస్తు ప్రక్రియను సులభంగా అర్థం చేసుకోవచ్చు.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు విధానం ఇలా..
admission.tirumala.org అనే వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసిన వెంటనే Student Manual in English, Student Manual in Telugu అనే రెండు బాక్స్‌లు కనిపిస్తాయి. విద్యార్థులు తమకు కావలసిన భాషను ఎంచుకొని మాన్యువల్‌ను పూర్తిగా చదవాలి. ఆ తరువాత ఇంటర్ కోర్సుకు అనుగుణంగా జూనియర్ కళాశాలను ఎంచుకుని దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించవచ్చు.
క్లిక్ చేసిన వెంటనే స్క్రీన్ పై English, Telugu అనే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. అక్కడ నుంచి ఎంపిక చేసుకున్న వెంటనే, టీటీడీకి చెందిన కళాశాలల్లోని గ్రూపులు, సీట్ల లభ్యత, అర్హత ప్రమాణాలు, రిజర్వేషన్ల విధానం వంటి వివరాలు చూపబడతాయి.
దరఖాస్తు పూర్తి అనంతరం
దరఖాస్తు గడువు ముగిశాక, విద్యార్థుల ప్రతిభ, రిజర్వేషన్ ఆధారంగా తాత్కాలికంగా సీట్లు కేటాయించి, ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం పంపిస్తారు. సీటు పొందిన విద్యార్థులు తమ ధృవీకరణ పత్రాలను ఆన్లైన్‌లో అప్‌లోడ్ చేయాలి. అందులో ఎటువంటి పొరపాట్లు ఉంటే, లేదా సిస్టమ్‌లోని వివరాలతో తేడా ఉంటే, దరఖాస్తు ఆటోమేటిక్‌గా రద్దవుతుంది. సరిగా సమాచారం ఇవ్వకపోతే విద్యార్థులు సీటు కోల్పోతారు.
ఈ కారణంగా విద్యార్థులు స్టూడెంట్ మాన్యువల్‌ను, కళాశాల ప్రాస్పెక్టస్‌ను పూర్తిగా చదివి, అప్లికేషన్‌ను జాగ్రత్తగా నింపాలని టీటీడీ స్పష్టం చేసింది. ఒకసారి అప్లికేషన్ సమర్పించిన తర్వాత దానిలో ఎలాంటి సవరణలకు అవకాశం ఉండదు.
Also Read: Smart Saving Tips: ఒక్క ‘టీ’ డబ్బుతో.. ‘లక్షలు’ మీ చేతిలో.. అదిరిపోయే స్కీమ్!
హెల్ప్‌లైన్ సదుపాయం
విద్యార్థులు దరఖాస్తు సమయంలో సాంకేతిక సమస్యలు, కోర్సుల ఎంపిక, వసతి గృహం తదితర అంశాల్లో సందేహాలు ఉంటే, admission.tirumala.org వెబ్‌సైట్‌లోని హెల్ప్ లైన్ నంబర్లు అనే బాక్స్ ద్వారా సంబంధిత అధ్యాపకుల ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు.