Union Budget 2026: కేంద్ర బడ్జెట్ – 2026 ప్రసంగం సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటు వేదికగా కీలక ప్రకటన చేశారు. ఖనిజ వనరులు అధికంగా ఉన్న ఏపీ వంటి రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తామని వెల్లడించారు. అరుదైన ఖనిజాల (రేర్ ఎర్త్ మినరల్) కోసం ఏపీతో పాటు తమిళనాడు, కేరళ, ఒడిశా రాష్ట్రాలలో ఖనిజాల కోసం ప్రత్యేక కారిడార్ ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. ‘అరుదైన భూమి శాశ్వత అయస్కాంతాల పథకం (scheme for rare earth permanent magnets) 2025 నవంబర్ లో ప్రారంభించాం. మైనింగ్, ప్రాసెసింగ్, పరిశోధన, తయారీని ప్రోత్సహించడం కోసం ఖనిజ సంపన్న రాష్ట్రాలుగా పిలవబడుతున్న ఒడిశా, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడుకు కేంద్రం అండగా ఉంటుందని తెలియజేస్తున్నా’ అని ఆదివారం బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి అన్నారు.
అరుదైన భూమి (Rare earths) అనేది 17 ఖనిజ మూలకాల సమూహం. దీనిని మనం నిత్యం ఉపయోగించే స్మార్ట్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ కార్ల నుంచి ఫైటర్ జెట్స్ తయారీ వరకూ ప్రతి దానిలోనూ వినియోగిస్తుంటారు. చైనా ప్రస్తుతం ఈ రేర్ ఎర్త్స్ విషయంలో ప్రపంచంపై అజమాయిషి చెలాయిస్తోంది. ప్రపంచ గనుల ఉత్పత్తిలో 60 శాతం, శుద్ధి చేసిన ఖనిజాలు (Refined production), రేర్ ఎర్త్ మాగ్నెట్ (Rare earth magnet)లో 90 శాతం వాటాను డ్రాగన్ కలిగి ఉంది.
ఫలితంగా అరుదైన ఖనిజ సంపద కోసం భారత్ సహా ప్రపంచ దేశాలు చైనాపై ఆధారపడుతూ వస్తున్నాయి. దీని నుంచి బయటపడేందుకు.. ఖనిజ సంపదను కలిగిన రాష్ట్రాలుగా పేరున్న ఆంధ్రప్రదేశ్ సహా తమిళనాడు, కేరళ, ఒడిశా నుంచి అరుదైన మినరల్స్ ను దేశ అవసరాలకు సమకూర్చుకోవాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా 2026-27 కేంద్ర బడ్జెట్ లక్ష్యాల్లో ఒకటిగా దీనిని చేర్చింది. దేశీయ అవసరాలు పోగా.. విదేశాలకు సైతం ఈ ఖనిజ సంపదను ఎగుమతి చేసి.. చైనాకు చెక్ పెట్టాలని కేంద్రం భావిస్తున్నట్లు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.