Budget 2026: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన తొమ్మిదవ బడ్జెట్‌లో రవాణా రంగానికి పెద్దపీట వేశారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఏడు కొత్త హై-స్పీడ్ రైలు కారిడార్లను ప్రకటించడం ప్రయాణికులకు ఒక పెద్ద కానుకగా చెప్పవచ్చు. ఢిల్లీ-వారణాసి వంటి కీలక మార్గాలతో పాటు, తెలుగు రాష్ట్రాలను కలుపుతూ ప్రకటించిన హై-స్పీడ్ కారిడార్లు భవిష్యత్తులో ప్రయాణ వేగాన్ని సరికొత్త స్థాయికి తీసుకెళ్లనున్నాయి.
రైల్వే బడ్జెట్ 2026 కేవలం అంకెలతో కూడిన లెక్క మాత్రమే కాదు. ఇది దేశ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఒక దిక్సూచి. ఈ ఏడాది రైల్వే రంగానికి ప్రభుత్వం రూ. 2,55,445 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో రైల్వేలు ఎలా రూపాంతరం చెందబోతున్నాయో ఇప్పుడు చూద్దాం.
ఏడు సరికొత్త హై-స్పీడ్ కారిడార్లు:
ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఏడు కొత్త హై-స్పీడ్ రైలు కారిడార్లను ప్రకటించింది. వీటిలో మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రూట్లు ఉండటం విశేషం.
ముంబై – పుణే
పుణే – హైదరాబాద్
హైదరాబాద్ – బెంగళూరు
హైదరాబాద్ – చెన్నై
చెన్నై – బెంగళూరు
ఢిల్లీ – వారణాసి
వారణాసి – సిలిగురి
ఈ కారిడార్ల వల్ల నగరాల మధ్య దూరం తగ్గి, వ్యాపార, పర్యాటక రంగాలు విపరీతంగా అభివృద్ధి చెందుతాయి. ముఖ్యంగా హైదరాబాద్ నుండి చెన్నై, బెంగళూరు, పుణేలకు బుల్లెట్ రైలు వంటి వేగంతో వెళ్లే సౌకర్యం కలగబోతోంది.
కవచ్: భద్రతకు ప్రాధాన్యత
రైలు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం ‘కవచ్’ వ్యవస్థపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇది ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ. సిగ్నల్ జంపింగ్ వంటి మానవ తప్పిదాల వల్ల జరిగే ట్రైన్ యాక్సిడెంట్లను ఇది అడ్డుకుంటుంది. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన మార్గాల్లో ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి బడ్జెట్‌లో నిధులను పెంచారు. ప్రయాణికుల ప్రాణాలకు రక్షణ కల్పించడమే తమ ప్రథమ ప్రాధాన్యత అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
వందే భారత్ స్టేషన్ల ఆధునీకరణ:
అమృత్ భారత్ స్టేషన్లు: దేశవ్యాప్తంగా ఉన్న 1,337 రైల్వే స్టేషన్లను విమానాశ్రయాల తరహాలో ఆధునీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే దాదాపు 1,197 స్టేషన్లలో పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. త్వరలోనే సామాన్యుడికి కూడా ప్రపంచ స్థాయి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి.
వందే భారత్: మరిన్ని కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించడంతో పాటు, బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం రూ. 21,000 కోట్లు కేటాయించారు. ఇది దేశంలో వేగవంతమైన ప్రయాణానికి పునాది వేయనుంది.
Also Read: మున్సిపల్ ఎన్నికల అభ్యర్థులకు అంతుచిక్కని ఓటర్ల అంచనా.. డైలమాలో కీలక నేతలు..?
జలమార్గాలు:
వచ్చే ఐదేళ్లలో 20 కొత్త జలమార్గాలను ప్రారంభించనున్నారు. వారణాసి, పాట్నా నగరాల్లో ఓడల మరమ్మతు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. దీని వల్ల సరుకు రవాణా ఖర్చు తగ్గి, వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉంది. అలాగే పర్యాటకం కోసం ‘సీప్లేన్’ పథకాన్ని కూడా ప్రోత్సహిస్తున్నారు.
గతేడాదికి, ఇప్పటికి తేడా ఏంటి?
2024-25 బడ్జెట్‌లో రైల్వేకు రూ.2,55,393 కోట్లు కేటాయించగా.. ఈసారి దాన్ని స్వల్పంగా పెంచి ప్రాజెక్టుల అమలుపై ఎక్కువ ఫోకస్ పెట్టారు. గతంలో కేవలం ఇంధనం, సిమెంట్ కారిడార్ల మీద దృష్టి పెట్టగా.. ఇప్పుడు ప్రయాణ వేగం, భద్రత మీద ప్రభుత్వం మొగ్గు చూపారు. ఈ ఏడాది బడ్జెట్ సామాన్య ప్రయాణికుడికి భద్రతను, యువతకు ఉపాధిని ఇచ్చేలా రూపొందించారు. ఈ హై-స్పీడ్ కారిడార్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే రవాణా రంగం ప్రపంచ దేశాలతో పోటీ పడగలదు.