Telangana BJP: స్వేఛ్చ బ్యూరో: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాషాయ పార్టీ సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్తోంది. బీఫామ్ ల కేటాయింపు నుంచి క్షేత్రస్థాయి ప్రచారం వరకు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ కమలనాథులు దూకుడు పెంచారు. ఈ ఎన్నికల్లో పాత, కొత్త నేతల మధ్య పంచాయితీకి చెక్ పెట్టడంపై రాష్ట్ర నాయకత్వం దృష్టిసారించినట్లు తెలుస్తోంది. పాత, కొత్త వర్గాల మధ్య సమన్వయం కోసం ప్రయత్నాలు చేపడుతున్నట్లు సమాచారం. అందుకే మున్సిపల్ ఎన్నికల్లో బీఫామ్ ల కేటాయింపుపై ఒక నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. పాత, కొత్త నేతల మధ్య ఆధిపత్య పోరును కట్టడి చేయడంలో భాగంగా 60:40 రేషియో విధానాన్ని రాష్ట్ర నాయకత్వం అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక కోసం బీజేపీ రాష్ట్ర నాయకత్వం 60:40 నిష్పత్తిని ప్రాతిపదికగా తీసుకుంది. పార్టీ కోసం మొదటి నుంచి పనిచేస్తున్న పాత నేతలకు గౌరవం ఇస్తూనే, కొత్తగా చేరిన నేతల బలాన్ని వాడుకోవాలని నిర్ణయించింది. పార్టీ సిద్ధాంతాలను నమ్ముకుని ఉన్న సీనియర్లు, పాత కార్యకర్తలకు 60 శాతం మందికి బీఫామ్ అందజేయాలని రాష్ట్ర నాయకత్వం నిర్ణయించినట్లు సమాచారం. అలాగే ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన గెలుపు గుర్రాలకు 40 శాతం మేర అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. పాత, కొత్త నేతల మధ్య విభేదాలు తలెత్తకుండా రాష్ట్ర నాయకత్వం పకడ్బందీ చర్యలు చేపడుతోంది. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల ఇన్ చార్జీలు, జిల్లాల ఇన్ చార్జీలతో రాంచందర్ రావు కీలక సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో వ్యూహాల అమలు, బీఫామ్ ల అందజేత అంశంపై వారికి దిశానిర్దేశం చేసినట్లు చెబుతున్నారు. ఈ సమావేశం అనంతరం అర్హులైన అభ్యర్థులకు బీఫారాలు అందజేయాలని వారికి అప్పగించారు. ప్రతి మున్సిపాలిటీకి ఒక రాష్ట్ర స్థాయి నేతను ఇన్ చార్జీగా నియమించి, క్షేత్రస్థాయిలో సమన్వయం చేసే బాధ్యతను అప్పగించినట్లు తెలుస్తోంది.
Also Read: Municipal Elections: త్వరలో తొర్రూరును దత్తత తీసుకుంటా: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేకతను ఓట్లుగా మలుచుకునేందుకు కాషాయ పార్టీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగా సోమవారం కాంగ్రెస్ వైఫల్యాలపై చార్జ్ షీట్ ను రిలీజ్ చేయనున్నట్లు వినికిడి. మధ్యాహ్నం 12 గంటలకు ఛార్జ్ షీట్ రిలీజ్ చేసే అవకాశాలున్నాయి. ఛార్జ్ షీట్ తో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను కార్నర్ చేయాలని కమల దళం భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఆ వైఫల్యాల చిట్టాను రూపొందించినట్లు తెలుస్తోంది. రెండేళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నించేలా దీన్ని రూపొందించినట్లు సమాచారం. అందులో ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలు, ఇతర హామీల అమలులో వైఫల్యాలను ఎండగట్టేలా చార్జ్ షీట్ ను సిద్ధం చేసినట్లు సమాచారం. తెలంగాణలో ఈనెల 11న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగనుండగా, ఫిబ్రవరి 13న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ తీసుకున్న నిర్ణయాలు పార్టీ విజయావకాశాలను ఏ మేరకు ప్రభావితం చేస్తాయో వేచి చూడాలి.
Also Read: Union Budget-2026: నిర్మలా సీతారామన్ బడ్జెట్.. దశాబ్దాల సంప్రదాయానికి చెక్, పార్ట్-బీపై ఫోకస్