Weather Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఆనుకుని దక్షిణ కోస్తా, రాయలసీమ మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని కారణంగా ఆగ్నేయ బంగాళాఖాతం నుండి కర్ణాటక వర ఉపరితల ద్రోణి ఏర్పడింది.
వాతావరణంలో మార్పులు
నేటి నుంచి మూడురోజులపాటు ఆకాశం మేఘావృతమై ఉంటుంది. పలుచోట్లు తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. వర్షాలు పడే సమయంలో గంటకు 50 కిలోమీటర్లు వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.
మరోవైపు విశాఖలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. కుండపోతగా కురుస్తున్న వర్షానికి పలు ప్రాంతాల్లోని రోడ్లు జలమయం అయయ్యాయి. అలాగే విశాఖ ఎయిర్‌పోర్టు నీట మునిగింది. ఉరుములు మెరుపులతో వర్షం కురుస్తుండడంతో పిడుగులు ఎక్కడ పడుతాయోనని భయపడుతున్నారు ప్రజలు.
ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తేలిక పాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడనున్నాయి. గురువారం అంటే మే 22న పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణ, గుంటూరు, బాపట్ల, కర్నూలు, నంద్యాల, ప్రకాశం జిల్లాల్లో తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు
గాలి వానతోపాటు ఉరుముల సమయంలో పిడుగులు పడే అవకాశముంది. గాలులు ఉరుములు, మెరుపులు సమయంలో చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు దగ్గర ఉండరాదని హెచ్చరించారు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్. ఉమ్మడి అనంతపురం, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముంది. ఎమర్జెన్సీ కోసం టోల్ ఫ్రీ నెంబర్స్ 1070, 112, 18004250101 కు ఫోన్ చేయవచ్చని అధికారులు తెలిపారు.
చురుగ్గా నైరుతి రుతుపవనాలు
మరోవైపు నైరుతి రుతుపవనాలు జోరుగా కదులుతున్నాయి. మూడు నాలుగు రోజుల్లో కేరళలో ప్రవేశించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. మే 26 నాటికి రాయలసీమ మీదుగా ఏపీలో ప్రవేశిస్తాయని అంచనా వేస్తోంది. ప్రస్తుదం దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, లక్షద్వీవుల సమీపంలో నైరుతీ రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి.
ఏపీలో ఏర్పడిన అల్పపీడనం వల్ల సముద్ర మట్టానికి 3 కిలోమీటర్ల ఎత్తు వరకు మేఘాలు ఆవరించాయి. తెలంగాణలో వాతావరణం పలుమార్పులు చోటు చేసుకున్నాయి. ఉదయం వేళ హైదరాబాద్ తోపాటు మధ్య తెలంగాణలో జల్లులు మొదలు మోస్తరు వర్షం పడనుంది. 22 వరకు ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతుంది. బుధ, గురువారాల్లో తెలంగాణలో వర్షాలు పడే చాన్స్ ఉంది.