Chhattisgarh: మావోయిస్టులకు కోలుకోని దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా ఛత్తీస్‌ఘడ్‌లో భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో దాదాపు 20 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం భద్రతా బలగాలకు- మావోలకు కాల్పులు జరుగుతున్నాయి.
ఛత్తీస్‌ఘడ్‌లో బుధవారం ఉదయం జరిగిన భారీ ఎన్‌కౌంటర్ లో 20 మంది మావోయిస్టులు మరణించారు. నారాయణపూర్ జిల్లాలోని మాడ్ ప్రాంతంలో ఉదయం ఐదు గంటల నుంచి భద్రతా దళాలు-మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఇప్పటికీ అవి కొనసాగుతున్నాయి.
ఈ ఆపరేషన్‌లో బీజాపూర్, నారాయణపూర్, దంతెవాడ బలగాలు పాల్గొన్నాయి. ఈ ఘటనకు సంబంధించి ఛత్తీస్‌ఘడ్ ప్రభుత్వం నుంచి గానీ, భద్రతా బలగాల నుంచి అధికారిక సమాచారం రాలేదు. ఈ కాల్పుల్లో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. మావోయిస్టు అగ్రనేత నంబల్ల కేశవరావు అలియాస్ బసవరాజు మృతి చెందినట్టు సమాచారం.
మరోవైపు ఎదురు కాల్పులపై ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం విజయ్ శర్మ రియాక్ట్ అయ్యారు. నారాయణపూర్-బీజాపూర్ అడవుల్లో రెండు రోజులుగా కూంబింగ్ జరుగుతోందని అన్నారు. భద్రతా దళాలు 26 మందికి పైగా మావోయిస్టులను హత మార్చినట్టు సమాచారం ఉందన్నారు. ఈ సంఖ్య పెరిగే అవకాశముందని, కాకపోతే బలగాలు తిరిగి వచ్చిన తర్వాతే సరైన సమాచారం లభస్తుందన్నారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక జవాను మృతి చెందగా, మరొకరు గాయపడ్డారని వెల్లడించారు.
ALSO READ: హత్యలు చేసి మొసళ్లకు ఆహారంగా శవాలు, సైకో డాక్టర్ అరెస్ట్
మావోయిస్టులు ఏరి వేత లక్ష్యంగా ‘ఆపరేషన్ కాగర్’కు శ్రీకారం చుట్టాయి బలగాలు. ఈ ఏడాదిలో వందలాది మావోయిస్టులను మట్టుబెట్టాయి. అత్యధిక టెక్నాలజీతో ఏరివేత షురూ చేశాయి. డ్రోన్ల సాయంతో నక్సల్స్ కదలికలను తెలుసుకున్న బలాలు ఆప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. అబూజ్‌మఢ్ ప్రాంతంలో గాలింపు తీవ్రతరం చేశారు.
ఇటీవల తెలంగాణ-ఛత్తీసఘడ్ సరిహద్దులోని కర్రెగుట్ట ప్రాంతంలో 21 రోజుల పాటు ఆపరేషన్ జరిగింది. ఇందులో కనీసం 31 మంది మావోయిస్టులు మరణించినట్టు పోలీసులు అధికారికంగా తెలిపారు. భద్రతా దళాల చేతిలో హతమైన 31 మందిలో ఏరియా కమిటీ సభ్యులు, డివిజనల్ కమిటీ సభ్యులు, అగ్రశ్రేణి నేతలు ఉన్నారు.
కర్రెగుట్ట నుంచి దాదాపు 450కి పైగా IED లను స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేశాయి. అండర్ బారెల్ గ్రెనేడ్ లాంచర్, INSAS రైఫిల్స్, సెల్ఫ్ లోడింగ్ రైఫిల్స్, ఎయిర్ గన్లు సహా వందలాది ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి బలగాలు.