BigTV English

YCP Leaders: సైలెంట్ మోడ్‌లో వైసీపీ బ్యాచ్.. ఎందుకంటే?

YCP Leaders: సైలెంట్ మోడ్‌లో వైసీపీ బ్యాచ్.. ఎందుకంటే?

గత అయిదేళ్లలో అయిన దానికి కాని దానికి కయ్యానికి కాలుదువ్విన నేతలందరూ ఓటమి తర్వాత సైలెంట్ అయిపోయారు. అప్పట్లో వైసీపీ నేతల వెంట నడిచిన కేడర్ అంతా ఆ పరిస్థితిని జీర్ణించుకోలేక పోతుంది. అధికారం ఉన్నన్నాళ్లు ఎంజాయ్ చేసి.. ఇప్పుడు తమను గాలికి వదిలేసారని వైసీపీ శ్రేణులు నాయకులపై మండిపడుతున్నాయి. పాత కేసులు తిరగదోడుతుండటంతో పార్టీ వారు ఇబ్బందులు పడుతున్నా.. మాజీలంతా తమకెందుకులే అన్నట్లు వ్యవహరిస్తుండటంతో కేడర్ ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. దాంతో సోషల్ మీడియాలో తమ నేతల్నే వారు టార్గెట్ చేస్తుండటం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.

ఓవైపు విజయవాడ వరదలు, అక్కడ జరుగుతున్న సహాయక చర్యలపై వైసీపీ అధ్యక్షుడు జగన్ విమర్శల మీద విమర్శలు గుప్పిస్తున్నారు. బెజవాడకు రెండు సార్లు వచ్చి వెళ్లిన ఆయన ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. తర్వాత బెంగళూరు నుంచి సోషల్ మీడియాలో పెద్దపెద్ద పోస్టులు పెడుతూ విమర్శలు కొనసాగిస్తూనే ఉన్నారు.


జిల్లాలోని జగన్ పరివారం మాత్రం అసలు దేనిపై నోరు మెదపడం లేదు .. అధ్యక్షుడు చూసుకుంటారు. మాకెందుకులే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. వరదలు గత 60 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ముంచెత్తడంతో విజయవాడలోని కొన్ని ప్రాంతాలు నీట మునిగాయి. సమగ్ర సమాచారం లేకుండా అక్కడకు వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి బుడమేరు వరదపై అవగాహన లేకుండా మాట్లాడి అభాసుపాలయ్యారు.

వరద ప్రాంతాలకు అలా వచ్చి ఇలా వెళ్లిపోయిన మాజీ ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. గతంలో అధినేత చూసి రమ్మంటే కాల్చి వచ్చిన నేతలందరూ ఇప్పుడు వాటిపై స్పందించడమే మానేసారు. చంద్రబాబుపై ఎదురుదాడిలో ముందుండే జిల్లాకు చెందిన మాజీ మంత్రులు నారాయణస్వామి ,పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, బియ్యం మధుసూదన్ రెడ్డిలు అసలు రాష్ట్రంలో వరదలు వచ్చిన సంగతే తెలియనట్లు వ్యవహరిస్తున్నారు.

Also Read: ప్రకాశం బ్యారేజీ కూల్చేందుకు కుట్ర.. బోట్లు వదిలింది వైసీపీ వాళ్లే.. చంద్రబాబు

మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ దగ్దం అయినప్పటి నుంచి వైసీపీ లీడర్స్ ఎవరూ పొలిటికల్ స్క్రీన్‌పై కనిపించడంలేదు. ఆఖరికి జిల్లా పార్టీకి పెద్దదిక్కుగా పెత్తనం చేసిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి సైతం మౌనవ్రతం పాటిస్తున్నారు. పెద్దిరెడ్డిపై అవినీతి ఆరోపణల తీవ్రత రోజురోజుకి తీవ్రమవుతుందని  అయినా ఆయన స్పందించడం లేదు. మొన్నెప్పుడో ఆగస్టు 15న బయట కనిపించిన ఆయన తనపై వస్తున్న ఆరోపణలు అన్ని అసత్యాలన్నీ అబద్దాలని.. పరువు నష్టం దావా వేస్తానని  రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని విమర్శించారు.

బెజవాడ వరదలపై స్పందించాల్సిన ఆ జిల్లా నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ వారు ఎక్కడున్నారో ఎవరికీ తెలియడం లేదు. వరద ప్రాంతాలకు వెళ్లకుండా .. ఎప్పటిలానే ఫైర్ అయ్యారు మాజీ మంత్రి రోజా.. చంద్రబాబు, పవన్‌, లోకేశ్‌లపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. అయితే వారిపై రోజా చేసిన వ్యాఖ్యలు పార్టీకి మైనస్‌గా మారాయని వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి

పవన్‌కళ్యాణ్ ఏమయ్యారని ప్రశ్నిస్తూ.. లోకేష్ హైదరాబాదులో కాలక్షేపం చేస్తున్నారని రోజా వ్యాఖ్యానించారు. అయితే రోజా విడుదల చేసిన వీడియోకు వరదల్లో తిరుగుతున్న చంద్రబాబు, లోకేష్ వీడియోలను, సమీక్షల్లో పాల్గొంటున్న పవన్ కళ్యాణ్ వీడియోలను టాగ్ చేసి కూటమి కేడర్ వైరల్ చేస్తోంది. వైసీపీ వాళ్ళకి ఓటమి తర్వాత కళ్ళు కూడా కనిపించకుండా పోయాయని టీడీపీ, జనసేన శ్రేణులు సెటైర్లు విసురుతుండటంతో.. కౌంటర్ ఇవ్వలేక వైసీసీ సోషల్ మీడియా వింగ్ సతమతమవుతుందంట.

శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అయితే అప్పట్లో చంద్రబాబు, లోకేష్ తో పాటు పవన్ కళ్యాణ్ పై వ్యంగ్యాస్త్రాలు విసిరేవారు … చిత్రవిచిత్రమై పదజాలాన్ని వాడే వారు .. .అయితే ప్రస్తుతం అయన నియోజకవర్గంలో కేవలం వైఎస్ జయంతి, వర్ధంతి రోజు మాత్రమే కనిపించారు. ఎన్నికల ముందు ఆయన కోసం వాలంటీర్లు రాజీనామలు సైతం చేసి పనిచేసారు. కనీసం ఇప్పుడు వారి గురించి కూడా ఆయన మాట్లాడటం లేదు.

అధినేత జగన్‌కి నమ్మిన బంటునని చెప్పుకునే మధుసూదన్‌ రెడ్డి పూర్తిగా సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. నియోజకవర్గంలో 18 వేల ఎకరాలు పైగా కబ్జాకు గురయ్యాయని బీజేపీ రాష్ట నాయకుడు కోలా అనంద్ ఇప్పుడు మరికొత్త అంశాన్ని తెరమీదకు తీసుకువచ్చారు. దానికి తోడు రాజీవ్ నగర్ ఇళ్ల స్థలాలపై ఇప్పడు విచారణ ప్రారంభం అయింది. టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. అప్పట్లో గుడిలోను బడిలోను వీధుల్లోను హాడావుడి చేసిన బియ్యం మాత్రం ప్రస్తుతం నోరు విప్పడం లేదు .. మొత్తానికి ఉమ్మడి జిల్లాలో వైసీపీ నేతలు కేసుల భయమో? లేకపోతే ఎందుకొచ్చిన తలనొప్పిలే అనుకుంటారో? కాని .. అలా కానిచ్చేస్తున్నారు.

 

Related News

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Big Stories

×