Big Stories

AP CMO : ఏపీ సీఎంవో సమీపంలో మహిళ ఆత్మహత్యాయత్నం..జగన్‌ అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని ఆవేదన

AP CMO : వెన్నెముక సమస్యతో బాధపడుతున్న తన కుమార్తెను కాపాడుకోవాలని ఆ అమ్మ ప్రయత్నిస్తున్నారు. తమ బాధను స్వయంగా సీఎంకు చెప్పుకోవాలని భావించారు. కానీ సీఎం అపాయింట్ మెంట్ దొరకలేదు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఈ ఘటన ఏపీ సీఎం వైఎస్ జగన్‌ కార్యాలయం సమీపంలో జరిగింది. కాకినాడకు చెందిన ఆరుద్ర అనే మహిళ సీఎంవో సమీపంలో బ్లేడుతో చేతి మణికట్టును కోసుకున్నారు. వెన్నెముక సమస్యతో అచేతన స్థితిలో ఉన్న తన కుమార్తె సాయిలక్ష్మిచంద్రను కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారామె. సీఎంవోలో ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమంలో అధికారులను కలిశారు. కుమార్తె చికిత్సకు అయ్యే ఖర్చు అంచనాలు ఇవ్వాలని సీఎంవో అధికారులు సూచించారని ఖర్చులో 20-30 శాతమే ఇస్తామని చెప్పారని ఆరుద్ర తెలిపారు. దీంతో ఆమె సీఎంను కలవాలనుకున్నారు. సీఎంను కలవాలంటే ఎమ్మెల్యేతో కలిసి రావాలని అధికారులు చెప్పారని ఆరుద్ర వివరించారు.

- Advertisement -

కాకినాడ గ్రామీణ మండలం రాయుడుపాలేనికి చెందిన రాజులపూడి ఆరుద్ర కుమార్తె సాయిలక్ష్మిచంద్రకు వెన్నెముకలో సమస్య తలెత్తింది. 3సార్లు శస్త్రచికిత్సలు చేయించారు. అయినా నయం కాలేదు. కుమార్తె వైద్యం కోసం అన్నవరంలోని ఇంటిని అమ్ముదామని ప్రయత్నిస్తే… మంత్రి దాడిశెట్టి రాజా గన్‌మెన్‌, మరో కానిస్టేబుల్ కలిసి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరుద్ర ఆరోపించారు. మంత్రి గన్‌మెన్‌, కానిస్టేబుల్‌పై గతంలోనూ అధికారులకు ఫిర్యాదు చేశానని తెలిపారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవర్నీ ఇల్లు కొననీయకుండా చేస్తున్నారని కంటతడి పెట్టారు. తన కుమార్తెను బతికించుకోవాలంటే రూ.2 కోట్ల ఖర్చు అవుతుందన్నారు. చికిత్సకు సాయం చేయక.. ఆస్తినీ అమ్ముకోనీయకపోతే ఎలా? అని ప్రశ్నించారు. మంత్రి గన్‌మెన్‌ దౌర్జన్యాలపై సీఎంవో అధికారులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. రూ.40 లక్షల ఇంటిని రూ.10 లక్షలకు తమకే విక్రయించాలని వేధిస్తున్నారని ఆరుద్ర ఆరోపించారు. ఈ విషయమై కాకినాడ స్పందనలో జేసీని కలిసి వినతిపత్రం ఇచ్చినట్లు చెప్పారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News