ఏపీ రాజధాని అమరావతిపై ఇటీవల వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన కొంప ముంచాయా? జగన్ ఆయన్ను పిలిపించి మరీ వార్నింగ్ ఇచ్చారా? సజ్జలపై జగన్ కోప్పడ్డారన్న మాటలు అసలు నిజమేనా? వైసీపీ అనుకూల సోషల్ మీడియాలో ఈ ప్రచారం జరుగుతోంది. మరోవైపు సజ్జల అమరావతి వ్యాఖ్యలకు వైసీపీ సొంత మీడియా సాక్షి అస్సలు ప్రాధాన్యత ఇవ్వకపోవడం కూడా ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. అంటే సజ్జల వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం, పార్టీపరమైనవి కావు అని సాక్షి తేల్చేసింది. అదే నిజమైతే జగన్ వార్నింగ్ వార్తలు కూడా నిజమనే నమ్మాలి. అదే జరిగితే మరి పార్టీలో సజ్జల భవిష్యత్ ఏంటి? కీలకమైన సమయంలో పార్టీని ఇరుకునపెట్టేలా మాట్లాడిన ఆయన్ను జగన్ క్షమిస్తారా? తిరిగి ఆ స్థాయి ప్రయారిటీ ఇస్తారా?
వైసీపీ కేరాఫ్ సజ్జల..
పార్టీ అధికారంలో ఉండగా అందరూ ఆయన్ను సకల శాఖల మంత్రిగా అభివర్ణించారు. సజ్జల మాటే జగన్ మాటగా, సజ్జాల నిర్ణయమే పార్టీ నిర్ణయంగా అప్పట్లో చెల్లుబాటయింది. ఎన్నికల ఫలితాలు తేడా కొట్టిన తర్వాత ఒక్కొక్కరే ఆయన్ను టార్గెట్ చేశారు. విజయసాయిరెడ్డి కూడా సజ్జలపై కోటరీ ముద్రవేసి బయటకు వెళ్లిపోయారు. అయితే అనూహ్యంగా జగన్ మాత్రం సజ్జలకే మద్దతిచ్చారు. సజ్జలపై వ్యతిరేకంగా మాట్లాడేవాళ్లంతా క్రమక్రమంగా సైలెంట్ అయ్యారు. కొన్నాళ్లు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న సజ్జల తిరిగి కీలకంగా మారారు. జగన్ లేకపోతే పార్టీ ఆఫీస్ లో కార్యక్రమాలు నిర్వహించే అధికారం ఉన్న ఏకైక వ్యక్తిగా ఆయన పార్టీలో చలామణి అవుతున్నారు. కానీ ఈ ప్రయారిటీని ఒక్క మాట మార్చేసింది. వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తే జగన్ అమరావతి నుంచే పాలన చేస్తారంటూ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు సజ్జల. దీంతో టీడీపీ ట్రోలింగ్ మొదలు పెట్టింది. అమరావతిపై జగన్ తిరిగి యూ టర్న్ తీసుకున్నారంది. గతంలో మూడు రాజధానులు అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలుకు సజ్జల వ్యాఖ్యల్ని కౌంటర్ గా రెడీ చేసి వీడియోలను వైరల్ చేసింది. ఒకరకంగా ఇది వైసీపీ నేతల్ని ఇరుకున పెట్టే పరిస్థితేనని చెప్పాలి.
జగన్ రియాక్షన్ నిజమేనా?
కాలం కలసిరాక సజ్జల ఆధిపత్యాన్ని ఒప్పుకుంటున్నారు కానీ, పార్టీలో చాలామందికి ఆయనతో పొసగడం లేదనేది వాస్తవం. పార్టీకోసం పనిచేస్తున్న సోషల్ మీడియా విభాగాల్లో కూడా కొందరు సజ్జల ప్రయారిటీ తగ్గించాలనుకుంటున్నారు. తాజాగా అమరావతిపై సజ్జల చేసిన వ్యాఖ్యలు వారికి అనుకూలంగా దొరికాయి. ఇంకేముంది జగన్, సజ్జలను పిలిపించి చీవాట్లు పెట్టారని కథలల్లారు. సజ్జలను వ్యతిరేకించే వారికి ఈ వార్తలు మరింత సంతోషాన్నిస్తున్నాయి. ఇవన్నీ ఊహాగానాలే అని కొట్టిపారేయలేం. ఎందుకంటే జగన్ ని అత్యంత ఇబ్బంది పెట్టిన విషయాల్లో రాజధాని అంశం ఒకటి. మూడు రాజధానుల నిర్ణయానికి కౌన్సిల్ ఆమోదముద్ర వేయకపోవడంతో అప్పట్లో ఆయన అహం దెబ్బతిన్నది. ఏకంగా కౌన్సిల్ ని క్యాన్సిల్ చేయాలని చూశారు. ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. ఆ తర్వాత అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకోవాలనుకోవడం, కోర్టు చీవాట్లు పెట్టడం, చివరకు కోర్టులో రైతులు గెలవడం.. ఇలా అమరావతి అనే అంశం జగన్ ని బాగా చికాకు పెట్టింది. దీంతో ఆయన రాజధాని పేరెత్తితేనే ఉలిక్కిపడుతున్నారు. మూడురాజధానులు అనే సాహసం కూడా చేయట్లేదు. ఇలాంటి దశలో సజ్జల అమరావతి ఏకైక రాజధాని అనడం సంచలనంగా మారింది. ఒకవేళ జగన్ నిర్ణయం కూడా ఇదే అనుకున్నా.. ఆ మాట సజ్జల నోటివెంట అసందర్భంగా రావడం మాత్రం విశేషమే. ఆ మాటే ఇప్పుడు వైసీపీని మళ్లీ ఇరుకున పెట్టింది. సజ్జలపై జగన్ ఆగ్రహానికి కారణం అయింది.