Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టుకు దివంగత నేత వైఎస్సార్ వెలుగైతే.. చంద్రబాబు చీకటని కాంగ్రెస్ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. వెలిగొండపై చంద్రబాబువి కొండంత అబద్ధాలని ఎద్దేవా చేశారు. వెలిగొండ 82 శాతం పనులు వైఎస్సార్ హయాంలోనే పూర్తైనట్లు ఆమె పేర్కొన్నారు. కేవలం 10 శాతం పనులు చేసి సంకల్పం, సాకారం అని చంద్రబాబు డబ్బా కొట్టడం ఈ శతాబ్దపు అతి పెద్ద జోక్ అని సెటైర్లు వేశారు.
అయితే ప్రారంభమైన 3 దశాబ్దాలకు వెలిగొండ మెుదటి దశ పనులు పూర్తి కావడం శుభసూచికమేనని షర్మిల అన్నారు. తీవ్రమైన కరువులో చిక్కుకొని ఉన్న ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు ఇకమీదటైన సాగు, త్రాగు నీరు మెరుగ్గా అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం జరిగిన నేపథ్యంలో మహానేత వైఎస్సార్ ప్రతీ ఒక్కరూ గుర్తుచేసుకోవాల్సిందేనని షర్మిల అన్నారు. వెలిగొండ ప్రజాస్వప్నంపై వైఎస్సార్ చెరగని ముద్ర వేశారని కొనియాడారు.
కాగితాల నుంచి క్షేత్రస్థాయికి.. కాలువల నుంచి సొరంగాల వరకు సింహభాగం పనులు వైఎస్సార్ పాలనలోనే జరిగినట్లు షర్మిల గుర్తుచేశారు. 4 న్నర లక్షల ఎకరాలకు సాగునీరు, 23 లక్షల మంది ప్రజలకు త్రాగునీరు నేడు అందుతుందంటే.. నాడు అపర భగీరథుడు రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞ ఫలితమేనన్నారు. వెలిగొండపై చంద్రబాబువి కొండంత అబద్ధాలని విమర్శించారు. ‘కట్టిన కష్టం వైఎస్సార్ ది.. రాజకీయ ప్రచారం చంద్రబాబు గారిది’ అంటూ విమర్శలు చేశారు.
ఆనాడు 1996 మార్చి 5 న చంద్రబాబు వేసింది కేవలం రాయి మాత్రమేనన్న షర్మిల.. అనుమతులు లేకుండా, నిధులు ఇవ్వకుండా, అడ్వైజరీ కమిటీల పేరుతో 9 ఏళ్లు కాలయాపన చేశారని ఆరోపించారు. వెలిగొండకు ప్రాజెక్టుకు శిలాఫలకం తప్పా తట్టెడు మట్టి ఎత్తింది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయి నుంచి కరువు సీమకు జలవసంతం వరకూ వెనుక ఉన్నది వైఎస్సారేనని షర్మిల పేర్కొన్నారు. 2004లో అధికారంలో వచ్చిన వెంటనే వెలిగొండ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించారని తెలిపారు.
Also Read: ఖరీదైన టీవీ ఇప్పుడు తక్కువ ధరలో..ఈ సూపర్ డీల్ మిస్ కావద్దు!
చిన్న ప్రాజెక్టుగా ఉన్న వెలిగొండను భారీ ప్రాజెక్టుగా వైఎస్సార్ తీర్చిదిద్దారని షర్మిల తెలిపారు. అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీ తరపున పలు ప్రశ్నలను సైతం చంద్రబాబుకు షర్మిల సంధించారు. తానే శంకుస్థాపన చేసి, తానే పూర్తి చేశానని గొప్పలు చెప్పుకొనే ముందు ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. వెలిగొండ ప్రాజెక్ట్ కష్టం, చెమట దివంగత ముఖ్యమంత్రి YSR ది అయితే.. 10 శాతం పనులు చేసి క్రెడిట్ తమదే అంటూ చెప్పుకోవడానికి సిగ్గుపడాలని అన్నారు. వెలిగొండకు నిజంగా వైఎస్సార్ వెలుగైతే.. చంద్రబాబు గారు చీకటి అంటూ ఘాటు విమర్శలు చేశారు. శంకుస్థాపన చేసిన సంకల్పం మీదే అయినా.. సాకారం చేసింది మాత్రం అప్పటి కాంగ్రెస్ సీఎం వైఎస్సార్ అని షర్మిల చెప్పుకొచ్చారు.
Also Read: సెప్టెంబర్ నెలలో థియేటర్లలో విడుదల కాబోతున్న చిత్రాలు.. ఆ 3 డోంట్ మిస్!