అప్పటి వరకు ఉన్న రాజకీయాలను కీలక మలుపు తిప్పందా ఘటన. ఎవరూ ఊహించలేదు కావొచ్చు.. ఆ తరువాత రాజకీయ పరిణామాలు ఎలా మారనున్నాయో…? సరిగ్గా ఆ అవకాశాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవడంలో కేసీఆర్ సక్సెసయ్యారు. అప్పటికే తనలో ఉన్న రాజకీయ అసంతృప్తి, పార్టీ తనకు ప్రయార్టీ ఇవ్వకపోవడంపై అసహనం.. తెలంగాణకు జరుగుతున్న అన్యాయం.. ఇవన్నీ కలిసి వచ్చాయి.
దీనికి బషీర్‌బాగ్ కాల్పుల ఉదంతం ఆజ్యం పోసింది. ఇదే కేంద్ర బిందువైంది. కీలకంగా మారింది. సరిగ్గా ఇరవై ఆరేళ్ల క్రితం జరిగిన విద్యుత్ చార్జీల పెంపుపై సీపీఎం, కాంగ్రెస్ చేపట్టిన చలో అసెంబ్లీ నిరసన రూపం తీవ్ర హింసాత్మకంగా మారి అప్పటి బాబు ప్రభుత్వానికి ఓ మచ్చను మిగిల్చింది.
బషీర్‌బాగ్ దాకా ర్యాలీగా వచ్చిన పార్టీ కార్యకర్తలు, ఆందోళన కారులను కంట్రోల్ చేయడం పోలీసుల తరం కాలేదు. లాఠీ చార్జి చేసినా పరిస్థితి కంట్రోల్‌కు రాలేదు. దీంతో కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ కాల్పుల్లో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. ఇది దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ విషాదకర ఉదంతంపై కేసీఆర్ స్పందించారు. టీడీపీ సభ్యత్వానికి, తన డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేశారు.
ఆ తరువాత ఆయన కొత్త పార్టీ పెట్టాలనే నిర్ణయానికి వచ్చారు. అందరి అభిప్రాయాలను తీసుకుని, చర్చించి ఏడాది తరువాత టీఆరెస్ పార్టీని ఏర్పాటు చేశారు కేసీఆర్. అప్పటి ఆ బషీర్ బాగ్ కాల్పుల ఉదంతం మొత్తం రాజకీయ గతినే మార్చిందని చెప్పాలి. టీఆరెస్ పార్టీకి ఆదిలో పెద్దగా మద్దతు లభించలేదు. పార్టీ నిర్మాణం, సంస్థాగత బలోపేతంలో ఎన్నో ఎదురుదెబ్బలను తిన్నది. అవమానాలను ఎదుర్కొన్నది.
పడిన ప్రతిసారి కొంత గ్యాప్ తీసుకుని మళ్లీ ఉద్యమానికి ఊరిపిలూది పార్టీని నిలబెట్టేందుకు కేసీఆర్ చేసిన చర్యలు చాలా సందర్బాల్లో సక్సెసవుతూ వచ్చాయి. రాజీనామాల అస్త్రాలతో ఉప ఎన్నికలను ఉద్యమ వ్యూహంగా మార్చి పార్టీకి జవజీవాలందించిన కేసీఆర్ ఆనాటి నుంచి ఇప్పటి వరకు ఓడిన తరువాత కొంతకాలం అజ్ఞాతవాసిగా మారటం పరిపాటే.
పదండ్లు సీఎంగా చేసినా ఇప్పటికీ అదే పాత విధానాన్నే కొనసాగిస్తున్నారు. ఆయనది పక్కా ఎన్నికల వ్యూహమే. మధ్యలో బయటకు రాడు.. టైం వేస్ట్ చేసుకోడు.. ఇదే విధానం కేసీఆర్‌ది. అందుకే ఆ పాత జ్ఞాపకాలు యాది చేసుకోవడంతో పాటు.. మరో ఏడాది దాకా కేసీఆర్ బయటకు రాడనే విషయాన్ని కూడా బాహాటంగానే చెప్పుకుంటున్నారు గులాబీ శ్రేణులు.