ఆడబిడ్డ నిధి పథకం గురించి మంత్రి అచ్చెన్నాయుడు ప్రసంగంలో కొంత భాగాన్ని తీసుకుని వైసీపీ వైరల్ చేస్తోంది. ఆ పథకం అమలు చేయాలంటే ఆంధ్రాని అమ్మేయాలని ఆయన చేసిన వ్యాఖ్యల్ని హైలైట్ చేస్తున్నారు వైసీపీ నేతలు. అయితే ప్రస్తుతం అలాంటి పరిస్థితి ఉన్నా కూడా ఆ పథకం అమలు విషయంలో సీఎం చంద్రబాబు రాజీ పడటం లేదని చెప్పడం అక్కడ అచ్చెన్న ఉద్దేశం. అయితే ఈ పథకం విషయంలో వైసీపీ రాద్ధాంతం ఆ పార్టీకే రివర్స్ లో తగులుతోంది. హామీలు అమలు చేయలేకపోవడం వల్ల టీడీపీపై కేసులు పెట్టాలంటున్నారు వైసీపీ నేతలు. మరి నవరత్నాల్లో ముఖ్యమైన రెండు రత్నాల్ని ఎగరగొట్టిన జగన్ పై కూడా ప్రజలు కేసులు పెట్టాల్సిందేనా అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. సంపూర్ణ మద్యపాన నిషేధం, సీపీఎస్ రద్దు హామీలకు మంగళం పాడిన జగన్ ని ఏం చేయాలని నిలదీస్తున్నారు.
అసలేంటి ఈ పథకం..
సూపర్ సిక్స్ హామీల్లో ఆడబిడ్డ నిధి చాలా కీలకమైనది. పెన్షన్ల పెంపు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి పథకాలు ఇప్పటికే అమలులోకి వచ్చాయి. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత రవాణా, అన్నదాతా సుఖీభవ వంటి పథకాలు త్వరలో పట్టాలెక్కబోతున్నాయి. ఇప్పటి వరకు కూటమి ప్రస్తావించని హామీ ఆడబిడ్డ నిధి. ప్రతి మహిళ ఖాతాలో నెలకు రూ.1500 వేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. అయితే దీనికి భారీగా నిధులు కావాలి. అదే సమయంలో అర్హులు, అనర్హుల జాబితా తయారు చేయడం కూడా కత్తిమీద సామే అని చెప్పాలి. అందుకే ప్రభుత్వం వేచి చూస్తోంది. ఈ హామీ అమలు చేయకపోతే ప్రజలు తమని నమ్మరు అని టీడీపీకి కూడా తెలుసు. అందుకే కష్టమైనా, కాస్త ఆలస్యమైనా ఈ పథకం అమలు చేయడం గ్యారెంటీ. ఈలోగా వైసీపీ సెల్ఫ్ గోల్స్ వేసుకోవడం ఇక్కడ విశేషం.
చంద్రబాబు మార్క్ మోసానికి మరోసారి ఆడబిడ్డలు బలి
అధికారంలోకి రాగానే నెలకి రూ.1,500 చొప్పున 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకి అకౌంట్లో వేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు
ఇప్పుడు ఆ డబ్బులు అందరికీ ఇవ్వాలంటే ఆంధ్రాని అమ్మాలంటూ మంత్రి అచ్చెన్నాయుడు వెటకారం
మరి… pic.twitter.com/JuH3O4USvJ
— YSR Congress Party (@YSRCParty) July 22, 2025
తల్లికి వందనం విషయంలో కూడా..
ఆమధ్య తల్లికి వందనం విషయంలో కూడా ఇలాగే వైసీపీ రాద్ధాంతం చేసి నవ్వులపాలైందని అంటున్నారు టీడీపీ నేతలు. మీకు 15వేలు మీకు 15వేలు అంటూ వైసీపీ నేతలే ఈ పథకానికి ఎక్కువ ప్రచారం చేసి పెట్టారు. తాజాగా ఆడబిడ్డ నిధి విషయంలో కూడా ఇదే జరుగుతున్నట్టు అనిపిస్తోంది. వైసీపీ తీవ్ర విమర్శలు వారికే రివర్స్ అవుతున్నాయి. ఈ పథకం ఆలస్యమైనా, అమలైతే చాలు.. వైసీపీకి మరింత నష్టం జరుగుతుంది. ఈ క్రమంలో వైసీపీ హామీలు, అమలు అంటూ రాద్ధాంతం చేయడం ఆ పార్టీకి మరింత నష్టంగా మారే అవకాశంల ఉంది. ఎందుకంటే జగన్ తన హయాంలో కీలకమైన మద్యపాన నిషేధం హామీని అస్సలు అమలు చేయలేదు. ఆ విషయంలో ఎప్పుడు ప్రశ్నించినా మద్యపాన నియంత్రణ అంటూ సన్నాయి నొక్కులు నొక్కేవారు నేతలు. చివరకు వారే మద్యం స్కామ్ లో చిక్కుకుని ఊచలు లెక్కబెడుతున్నారు. ఈ కేసులో జగన్ కూడా జైలుకి వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు.
హామీల అమలులో తమ సత్తా 100 శాతం అని వైసీపీ చెప్పుకోలేని పరిస్థితి. రెండు కీలకమైన హామీలు అటకెక్కించిన వైసీపీకి, ఆడబిడ్డ నిధి పథకం అమలుని విమర్శించే హక్కు లేదంటున్నారు టీడీపీ నేతలు. ఈ పథకం కచ్చితంగా అమలులోకి వస్తుందని ధీమాగాా చెబుతున్నారు.