Vizag News: మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మళ్లీ వార్తల్లోకి వచ్చేశారు. ఈసారి కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. పబ్లిసిటీ పిచ్చి వల్ల ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి పరువు తీశారని నిప్పులు చెరిగారు. ఆయన తక్షణమే కేంద్రమంత్రి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అమర్నాథ్ వ్యాఖ్యల వెనుక అసలు కారణమేంటి?
కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడిపై వైసీపీ ఆగ్రహం
చాన్నాళ్ల తర్వాత దర్శనమిచ్చారు వైసీపీ నేత, మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్. ఆ మధ్య విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుపై బలంగా నోరు విప్పారు. ఆ పార్టీ అధినేత జగన్, ఆ వ్యవహారాన్ని తనకు అనుకూలంగా మలచుకున్నారు. ఇప్పుడు విమానాల ఇష్యూని తనకు అనుకూలంగా మార్చకునే పనిలో పడ్డారు గుడివాడ అమర్నాథ్.
గడిచిన నాలుగైదు రోజులుగా ఇండిగో విమానాల వ్యవహారం దేశాన్ని ఓ కుదుపు కుదిపేస్తోంది. దీనివల్ల ట్రావెలర్లు చాలా ఇబ్బందిపడ్డారు.. పడుతున్నారు కూడా. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేసింది వైసీపీ. దేశం, ప్రపంచంలోనూ ఎప్పుడూ విమాన రంగంలో ఇలాంటి గడ్డు పరిస్థితులు రాలేదని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్.
తెలుగువారి పరువు తీశారు.. తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్
ఇండిగో విమానాల సమస్య వల్ల గడిచిన ఐదు రోజులుగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. విమానయాన రంగంలో వచ్చే మార్పులను ప్రైవేటు విమానయాన సంస్థలు అమలు చేయాలన్నారు. అమలు చేయని సంస్థలపై విమానయాన శాఖ చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైందన్నారు.
ప్రస్తుతం పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చేసిన వ్యాఖ్యలు చూస్తే.. తెలుగు వారు దేశం పరువు పోయిందని విమర్శించారు. ఈ శాఖ చూస్తున్న మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రయాణికులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
టీడీపీ అధికార ప్రతినిధులు సివిల్ ఏవియేషన్ సమస్యను లోకేష్ మానిటరింగ్ చేస్తున్నారని జాతీయ మీడియాలో చెప్పడం ఏంటని ప్రశ్నించారు. అసలు సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీకి- లోకేష్‌కి సంబంధం ఏంటని ప్రశ్నించారు. దేశంలోని ఓ రాష్ట్రానికి చెందిన మంత్రి మాత్రమేనని, ఆయన గురించి టీడీపీ ప్రతినిథులు ఆ విధంగా సిగ్గుగా అనిపించడం లేదా? వారికి కొంచెం కూడా సిగ్గు అనిపించలేదా?
ALSO READ: పరకామణి చోరీ కేసు.. నిందితుడు రవి కీలక వ్యాఖ్యలు
సివిల్ ఏవియేషన్ తీసుకొచ్చిన FDTL విధానాలు అమలు చేయడానికి ముందుగా ఆ శాఖ ఎస్సెస్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇండిగో సంస్థ ప్రతి రోజు 5 లక్షల మందిని గమ్యస్థానాలకు చేరుస్తోందన్నారు. విశాఖలో మొత్తం 12 ఫ్లైట్స్ రద్దు అయ్యాయని అన్నారు. విశాఖ నుండి హైదరాబాద్ వెళ్లాలంటే ప్రస్తుతం 26 వేలు నుండి 30 వేలు కొన్ని ఎయిర్‌లైన్స్ సంస్థలు డిమాండ్ చేస్తున్నట్లు వివరించారు.
కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు విశాఖ నుండి శ్రీకాకుళం వెళ్తూ భోగాపురం ఎయిర్‌పోర్టులో రెండు రీల్స్ చేసుకొని ఢిల్లీ వెళ్తున్నారని ఆరోపించారు. కేంద్ర క్యాబినెట్ మంత్రి అంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవితో సమానమని అన్నారు. ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు రీల్స్ చేయడం మానేసి తన శాఖపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.
సీఎం చంద్రబాబు,మంత్రి లోకేష్‌లను జాకీలు పెట్టి లేపడం మానేసి సొంత శాఖపై దృష్టి పెట్టాలన్నారు. 15 ఏళ్లలో ఎప్పుడు విమానం కూలిపోయిన సంఘటన ఇండియాలో లేదన్నారు. పబ్లిసిటీ పిచ్చి వల్ల దేశంలో, ప్రపంచవ్యాప్తంగా పరువు పోయేలాగా పరిస్థితి ఆయన తీసుకొచ్చారు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.