సాక్షి టీవీ చర్చలో ఏపీ రాజధాని అమరావతిపై జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన అసభ్య వ్యాఖ్యల ప్రభావం వైసీపీపై స్పష్టంగా కనపడుతోంది. ఈ వ్యాఖ్యలతో వైసీపీ చిక్కుల్లోపడింది. వైసీపీ నేతలు గతంలో అమరావతిపై తీవ్ర ఆరోపణలు చేయడం, అమరావతి రైతుల్ని అవమానించడం, అక్కడ జరుగుతున్న ఉద్యమాలను పెయిడ్ ఉద్యమాలుగా చిత్రీకరించడం తెలిసిందే. ఇప్పుడు అదే పార్టీకి చెందిన సాక్షి టీవీలో అమరావతిపై అసభ్య వ్యాఖ్యల దుమారం సంచలనంగా మారింది. అప్పట్లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అమరావతిపై ఆరోపణలు చేసినా దానివల్ల వారికి నష్టం కలగలేదు. కానీ ఇప్పుడు వైసీపీ ప్రతిపక్షంలో ఉంది. అందులోనూ ఈసారి సెక్స్ వర్కర్ల రాజధాని అంటూ చాలా దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఆ మాటలు వినపడుతున్నా కనీసం చర్చ నిర్వహిస్తున్న జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు వారించలేదు సరికదా, రెచ్చగొట్టేట్టుగా వెటకారంగా మాట్లాడారు. దీంతో ఈ పాపం అంతా వైసీపీ ఖాతాలో పడింది. సాక్షి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.
చేతులు కాలాక..
అమరావతి వ్యవహారంలో చేతులు కాలాక సాక్షి ఆకులు పట్టుకోడానికి ప్రయత్నాలు చేసింది. ముఖ్యంగా కొమ్మినేని అరెస్ట్ తర్వాత వైసీపీ మరింత ఘాటుగా స్పందిస్తోంది. అన్యాయంగా జర్నిలిస్ట్ లను అరెస్ట్ చేస్తున్నారని, 70 ఏళ్ల పెద్ద మనిషిని జైలులో పెట్టారని అంటున్నారు వైసీపీ నేతలు. స్వయంగా జగన్ కూడా తన టైమ్ లైన్ లో కొమ్మినేని గురించి ట్వీట్లు వేయడం విశేషం. ఇక సజ్జల ఊరుకుంటారా..? ఆయన ఓ సుదీర్ఘ ప్రెస్ మీట్ పెట్టారు. కానీ దానివల్ల వైసీపీకి లాభం లేకపోగా మరింత నష్టం జరగడం విశేషం. రాజధానిపై అనుచిత వ్యాఖ్యల తర్వాత అమరావతి మహిళలు కొమ్మినేని, కృష్ణంరాజుల ఫొటోలను చెప్పులతో కొట్టారు. అది సజ్జలకు నచ్చలేదు. వారు పిశాచులా, రాక్షసులా, లేక సంకరజాతా..? అంటూ వంకరగా మాట్లాడారు. దీంతో ఈ వ్యవహారం మళ్లీ రచ్చగా మారింది. వివాదాన్ని చల్లబరచుదామని వచ్చిన సజ్జల అనుకోకుండా కాస్త పెట్రోల్ చల్లారు. దీంతో ఇది మరింత హాట్ టాపిక్ గా మారింది. సజ్జల వ్యాఖ్యల్ని మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేస్తూ విమర్శలు మొదలు పెట్టారు.
క్షమాపణ చెప్పొచ్చు కదా..?
అమరావతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారు, ఆ చర్చను ప్రసారం చేసిన సాక్షి టీవీ యాజమాన్యం, వైసీపీ నేతలు క్షమాపణ చెప్పాల్సిందేనని అమరావతి మహిళలు డిమాండ్ చేస్తున్నారు. అయితే క్షమాపణ చెప్పకుండా వైసీపీ ఈ విషయాన్ని సాగదీస్తోంది. జగన్ కూడా పదే పదే టీడీపీని టార్గెట్ చేయాలనుకుంటున్నారు కానీ, ఈ క్రమంలో తెలియకుండానే అమరావతి ప్రాంత ప్రజలకు బద్ధ శత్రువుగా మారుతున్న విషయం మాత్రం గ్రహించలేకపోయారు. అదే సమయంలో మహిళాలోకం కూడా వైసీపీని అసహ్యించుకుంటోంది. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని వైసీపీ వెనకేసుకు రావడం వారికి నచ్చలేదు.
రోజా కూడానా..?
రోజా ఒక మహిళ, ఆ తర్వాతే ఆమె వైసీపీ నాయకురాలు. అయితే రాష్ట్రంలో మహిళలపై ఓ జర్నలిస్ట్ చేసిన అనుచిత వ్యాఖ్యల్ని రోజా సమర్థిస్తున్నట్టుగా మాట్లాడటం ఇక్కడ మరీ దారుణం. పైగా కొమ్మినేని అలాంటి వారు కాదని, ఆయన చర్చలు అర్థవంతంగా ఉంటాయని రోజా సర్టిఫికెట్ ఇస్తున్నారు. సాక్షి టీవీలో జరిగే డిబేట్ లో కొమ్మినేని కూటమి ప్రభుత్వంపై ఎలాంటి కామెంట్లు చేస్తారో అందరికీ తెలుసు. మరిక్కడ రోజా ఎవరిని కవర్ చేయాలనుకుంటున్నారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే, రోజా ఆ వ్యాఖ్యల్ని కనీసం ఖండించకపోవడమేంటి అనే ప్రశ్నలు వినపడుతున్నాయి. మొత్తానికి వైసీపీ ఈ ఎపిసోడ్ లో దారుణంగా విమర్శలు మూటగట్టుకుంది. కవర్ చేసుకోడానికి ప్రయత్నించి మరింత అభాసుపాలవుతోంది.