EV Home Charging: భారత్ లో ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలు భారీగా పెరుగుతోంది. చాలామంది ఈవీల పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు.. పర్యావరణానికి మేలు జరుగుతుందనే కారణంతో EVల వైపు మొగ్గు పెరుగుతోంది. అయితే, కారు కొనేముందు బ్యాటరీ రేంజ్, ధర, ఫీచర్లను మాత్రమే చూడటం సరిపోదు. ఇంట్లో ఆ కారును ఛార్జ్ చేసుకునే సదుపాయం ఉందా? మీ ఇంటి పవర్ కనెక్షన్ ఆ భారాన్ని మోయగలదా? అనే విషయాలను కూడా ముందుగానే తెలుసుకోవాలి.
సాధారణంగా చాలా ఇళ్లకు 3 నుంచి 4 కిలోవాట్ల వరకు విద్యుత్ లోడ్ మంజూరై ఉంటుంది. అయితే EV ఛార్జర్ కు కారు, ఛార్జర్ సామర్థ్యాన్ని బట్టి అదనంగా 7.5 కిలోవాట్లు లేదా అంతకంటే ఎక్కువ విద్యుత్ అవసరం అవుతుంది. కొన్ని హైస్పీడ్ ఛార్జర్లు 22 కిలోవాట్ల వరకు కూడా విద్యుత్‌ను వినియోగించే అవకాశం ఉంది. అంటే ఇంట్లో ఫ్రిజ్, ఏసీ, వాటర్ హీటర్ లాంటి పరికరాలు పనిచేస్తున్న సమయంలోనే కారు ఛార్జింగ్ చేస్తే.. మొత్తం విద్యుత్ భారం పెరిగిపోతుంది. అందుకే ముందుగా మీ విద్యుత్ కనెక్షన్‌కు ఎంత లోడ్ ఉందో చెక్ చేసుకోవాలి.
సొంత ఇంట్లో EV ఛార్జర్ ఏర్పాటు చేయడం కొంత సులభంగా ఉండొచ్చు. కానీ, అపార్ట్ మెంట్ లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఒక్క ఫ్లాట్‌కు సంబంధించిన విద్యుత్ కనెక్షన్‌తో పాటు.. మొత్తం భవనం విద్యుత్ వ్యవస్థను కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఒక అపార్ట్ మెంట్‌లో పదుల సంఖ్యలో కుటుంబాలు ఉంటాయి. అందులో చాలామంది ఒకేసారి EVలను రాత్రిపూట ఛార్జ్ చేస్తే.. భవనం మొత్తం విద్యుత్ వినియోగం ఒక్కసారిగా పెరుగుతుంది. దీంతో ట్రాన్స్ ఫార్మర్, వైరింగ్, ఇతర విద్యుత్ పరికరాలపై అదనపు భారం పడే అవకాశం ఉంటుంది.
ఇక్కడే EV కొనుగోలుదారులకు ఊహించని ఖర్చులు ఎదురయ్యే అవకాశం ఉంది. అవసరాన్ని బట్టి అదనపు వైరింగ్, ప్రత్యేక మీటర్, కొత్త సర్క్యూట్, లోడ్ పెంపు వంటి పనులు చేయాల్సి రావచ్చు. కొన్ని సందర్భాల్లో సొసైటీ అనుమతి కూడా తప్పనిసరి కావచ్చు. అందుకే కారు బుక్ చేసే ముందే అపార్ట్‌మెంట్ సొసైటీ మాట్లాడటం మంచిది. బిల్డింగ్ ట్రాన్స్ ఫార్మర్‌కు అదనపు EV ఛార్జింగ్ లోడ్‌ను భరించే సామర్థ్యం ఉందో లేదో తెలుసుకోవాలి.
పవర్ లోడ్ సరిపోతుందని నిర్ధారించుకున్న తర్వాతే ఛార్జర్ ఏర్పాటు చేయాలి. సరైన వైరింగ్, MCB, RCCB వంటి భద్రతా పరికరాలు ఉండాలి. ఛార్జర్ ను నిపుణుడితోనే ఇన్‌స్టాల్ చేయించాలి. తాత్కాలిక ఎక్స్ టెన్షన్ వైర్లు, నాసిరకం కనెక్షన్లను ఉపయోగించడం మంచిది కాదు. సో, EV కొనాలనుకుంటే కారు ధర, రేంజ్ మాత్రమే కాకుండా.. మీ ఇంటి పవర్ లోడ్, పార్కింగ్, ఛార్జింగ్ సదుపాయం, సొసైటీ అనుమతులు కూడా ముందుగానే చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం.
Read Also: టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?