No PUCC, No Fuel: వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1 నుంచి దేశ రాజధాని ప్రాంతం (NCR) పరిధిలోని ఎనిమిది జిల్లాల్లో చెల్లుబాటు అయ్యే పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్ (PUCC) లేని వాహనాలకు పెట్రోల్, డీజిల్ పోయకూడదని యూపీ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. ‘నో PUCC, నో ఫ్యూయెల్’ నిబంధనను అమలు చేయనుంది. ఈ కొత్త రూల్ గౌతమ్ బుద్ధ నగర్, ఘజియాబాద్, హాపూర్, బులంద్ షహర్, మీరట్, ముజఫర్ నగర్, బాఘ్ పత్, షామ్లీ జిల్లాల్లో అమల్లోకి రానుంది. ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని నియంత్రించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రతి ఏడాది శీతాకాలంలో ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతం తీవ్రమైన కాలుష్య సమస్యను ఎదుర్కొంటోంది. వాహనాల నుంచి వెలువడే పొగప్రధాన కారణంగా భావిస్తున్నారు. అందుకే కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. ఈ నిబంధన అమలుకు ఆధునిక సాంకేతికతను ఉపయోగించనున్నారు. ఎన్‌సీఆర్ పరిధిలోని 1,041 పెట్రోల్ బంకుల్లో ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు.
వాహనం ఇంధనం కోసం బంకులోకి వచ్చినప్పుడు కెమెరా నంబర్ ప్లేట్ ను స్కాన్ చేస్తుంది. ఈ సమాచారం వాహన్ డేటా బేస్ తో చెక్ చేస్తుంది. వాహనానికి చెల్లుబాటు అయ్యే పీయూసీసీ ఉందా? లేదా? అనే విషయం వెంటనే గుర్తించబడుతుంది. సర్టిఫికేట్ గడువు ముగిసినా? లేకపోయినా? ఆ వాహనానికి ఫ్యూయెల్ పోయరు. దీంతో వాహన యజమానులు ఎప్పటికప్పుడు పొల్యూషన్ సర్టిఫికేట్ ను అప్ డేట్ చేయించుకోవాలి.
ఇదే సమయంలో పాత, అధిక కాలుష్యాన్ని విడుదల చేసే వాహనాలను దశలవారీగా తొలగించడంపై కూడా యూపీ ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. నయా సఫర్ కార్యక్రమం కింద పాత వాహనాల స్థానంలో BS-VI, CNG, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ఎన్‌సీఆర్ పరిధిలోని ఈ ఎనిమిది జిల్లాల్లో సుమారు 26 లక్షలకుపైగా కాలం చెల్లిన వాహనాలు గుర్తించబడ్డాయి. ఇప్పటికే వేల సంఖ్యలో వాహనాలను స్క్రాప్ చేయగా, మరికొన్ని వాహనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
స్వచ్ఛమైన రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయడంపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఘజియాబాద్, నోయిడా, గ్రేటర్ నోయిడా, మీరట్ నగరాల్లో భారీ సంఖ్యలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం 100 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తుండగా, భవిష్యత్తులో ఈ సంఖ్యను 975కు పెంచాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచేందుకు ఛార్జింగ్ స్టేషన్లు, బ్యాటరీ స్వాపింగ్ కేంద్రాల సంఖ్యను కూడా విస్తరించనుంది. ఈ చర్యలు విజయవంతమైతే ఎన్‌సీఆర్ ప్రాంతంలో వాయు కాలుష్య స్థాయిలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
Read Also: వాగన్ ఆర్ మాత్రమే కాదు.. భారత్‌లోకి రానున్న 5 ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్లు ఇవే!