River Indie Record Sales: భారత ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్లో రివర్ మొబిలిటీ సత్తా చాటుతోంది. గత కొంతకాలంగా అమ్మకాల్లో దుమ్మురేపుతోంది. రివర్ ఇండి ఎలక్ట్రిక్ స్కూటర్ జూన్ 2026లో ఇప్పటి వరకు ఎన్నడూ లేని స్థాయిలో అమ్మకాలు సాధించింది. ఒక్క నెలలో 4,436 యూనిట్లు విక్రయించి కొత్త రికార్డు సృష్టించింది. ఇంతకుముందు మార్చి 2026లో నమోదైన 4,273 యూనిట్ల అమ్మకాల రికార్డును ఈసారి బ్రేక్ చేసింది.
రివర్ ఇండి స్కూటర్ ను కంపెనీ అక్టోబర్ 2023లో మార్కెట్లోకి తీసుకొచ్చింది. అప్పటి నుంచి జూన్ 2026 చివరి నాటికి మొత్తం 43,805 యూనిట్లు విక్రయించింది. నెలవారీ ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ సంస్థల జాబితాలో రివర్ మొబిలిటీ ఏడో స్థానానికి చేరుకుంది. ఈ ఏడాది ప్రారంభంలో కంపెనీ ఎనిమిదో స్థానంలో ఉండగా, ఇప్పుడు మరో మెట్టు ఎక్కింది.
ఈ ఏడాది రివర్ మొబిలిటీకి మరింత కలిసొచ్చింది. జనవరి నుంచి మార్చి వరకు తొలి త్రైమాసికంలో 9,607 స్కూటర్లు డెలివరీ చేసింది. ఆ తర్వాత ఏప్రిల్ నుంచి జూన్ వరకు రెండో త్రైమాసికంలో మరో 11,776 యూనిట్లు విక్రయించింది. మొత్తంగా 2026 తొలి ఆరు నెలల్లోనే 23,722 స్కూటర్లు అమ్ముడయ్యాయి. ఇది కంపెనీ ప్రారంభించినప్పటి నుంచి జరిగిన మొత్తం అమ్మకాలలో దాదాపు 54 శాతం కావడం విశేషం. ప్రస్తుత అమ్మకాల వేగాన్ని చూస్తే, ఈ ఏడాది రివర్ మొబిలిటీ తొలిసారిగా 50 వేల వార్షిక అమ్మకాల మార్కును దాటే అవకాశం కనిపిస్తోంది.
రివర్ ఇండి ధర ప్రస్తుతం రూ.1.55 లక్షలుగా ఉంది. ఈ ధరలో ఇది టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్, ఏథర్ రిజ్టా లాంటి ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్లకు పోటీగా నిలుస్తోంది. ఈ స్కూటర్‌లో ఫ్యాన్సీ ఫీచర్ల కంటే రోజువారీ వినియోగానికి అవసరమైన సౌకర్యాలపై కంపెనీ ఎక్కువ దృష్టి పెట్టింది. విశాలమైన సీటు, మంచి రైడింగ్ పొజిషన్‌తో పాటు 43 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ ఇందులో ప్రధాన ఆకర్షణగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం భారత మార్కెట్లో లభిస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఇంత పెద్ద స్టోరేజ్ సామర్థ్యం కలిగిన మోడళ్లు చాలా తక్కువగా ఉన్నాయి.
రివర్ మొబిలిటీ తన స్కూటర్లను కర్ణాటకలోని హోస్కోట్ తయారీ కేంద్రంలో ఉత్పత్తి చేస్తోంది. ఇదే ప్లాంట్‌లో రివర్ ఇండితో పాటు యమహా EC 06 మోడల్ ను కూడా తయారు చేస్తున్నారు. ఈ ప్లాంట్‌కు ఏడాదికి 1.20 లక్షల యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉంది. అమ్మకాలు పెరుగుతున్న నేపథ్యంలో కంపెనీ విస్తరణపై దృష్టి పెట్టింది. 2027 తొలి త్రైమాసికంలో రెండు కొత్త ఎలక్ట్రిక్ మోడళ్లను మార్కెట్లోకి తీసుకురావాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అలాగే పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని రెండో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసే అవకాశాలను కూడా పరిశీలిస్తోంది.
Read Also: కొత్త డిజైన్.. సరికొత్త టెక్నాలజీ.. ఏథర్ సూపర్ స్కూటర్ లాంచ్ డేట్ ఫిక్స్!