Renault Duster Adventure Edition: భారత మార్కెట్లో రెనాల్ట్ తన పాపులర్ ఎస్‌యూవీ డస్టర్ కు మరో స్పెషల్ ఎడిషన్‌ను పరిచయం చేసింది. డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్ పేరుతో మార్కెట్ లోకి విడుదల చేసింది. ఈ మోడల్ ప్రారంభ ధర రూ.12.99 లక్షలుగా నిర్ణయించింది. గతంలో విడుదలైన ఐకానిక్ ఎడిషన్ తర్వాత డస్టర్ కు వస్తున్న రెండో స్పెషల్ ఎడిషన్ ఇదే. అడ్వెంచర్ ప్రియులను ఆకట్టుకునేలా ఈ ఎడిషన్ ను తయారు చేసింది.
డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్ లో ప్రధాన ఆకర్షణ స్పెషల్ డీకాల్. లేహ్ ప్రాంతంలోని భూభాగాన్ని గుర్తు చేసే టోపోగ్రాఫిక్ మ్యాప్ డిజైన్ తో పాటు 34.27 N, 77.60 E భౌగోళిక అక్షాంశాలను ఇందులో పొందుపరిచారు. ఈ డీకాల్ వెనుక భాగంలో ఉండగా, అదే డిజైన్ ను ముందు డోర్లపై ఉన్న ప్లేక్ లపై కూడా ఉపయోగించారు. ఈ ఎడిషన్ కు ప్రత్యేకమైన ఫ్లోర్ మ్యాట్లను కూడా అందిస్తున్నారు.
డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్ మూడు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. టర్బో TCe 100 MT ధర రూ.12.99 లక్షలు, టర్బో TCe 160 MT ధర రూ. రూ.13.99 లక్షలు, టర్బో TCe 160 DCT ధర రూ.15.39 లక్షలుగా ఫిక్స్ చేసింది. ఇవన్నీ ఎక్స్ షోరూమ్ ధరలు. ఆన్ రోడ్ ధరలు మరికాస్త పెరిగే అవకాశం ఉంది.
ఈ స్పెషల్ ఎడిషన్, డస్టర్ ఎవల్యూషన్ ట్రిమ్ ఆధారంగా రూపొందించబడింది. ఇందులో 10.1 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, 7 అంగుళాల డిజిటల్ TFT డ్రైవర్ డిస్ ప్లే, వైర్ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, 17 అంగుళాల అల్లాయ్ వీల్స్, పూర్తి LED లైటింగ్, ఆరు ఎయిర్ బ్యాగ్ లు లాంటి ఫీచర్లు ఉన్నాయి. అంతేకాదు, హయ్యర్ వేరియంట్ అయిన టెక్నో ట్రిమ్ లో ఉండే కొన్ని ప్రీమియం ఫీచర్లను కూడా ఇందులో అందించారు. వాటిలో పనోరమిక్ సన్ రూఫ్, పవర్డ్ టెయిల్ గేట్, డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ లాంటి సౌకర్యాలు ఉన్నాయి. దీంతో ఈ వేరియంట్ మరింతగా ఆకట్టుకుంటుంది.
డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్ లో సాధారణ డస్టర్ లో లభించే అదే ఇంజిన్ ఆప్షన్లు కొనసాగుతున్నాయి. మొదటి ఇంజిన్ 1.0 లీటర్ మూడు సిలిండర్ల టర్బో పెట్రోల్ యూనిట్. ఇది 100 హెచ్‌పీ పవర్, 160 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. రెండోది 1.3 లీటర్ నాలుగు సిలిండర్ల టర్బో పెట్రోల్ ఇంజిన్. ఇది 163 హెచ్‌పీ పవర్, 280 ఎన్ఎం టార్క్ అందిస్తుంది. ఈ ఇంజిన్‌కు 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్స్ ఉన్నాయి.
డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్‌లో పెద్దగా యాంత్రిక మార్పులు లేకపోయినా, ప్రత్యేక డిజైన్, అదనపు కాస్మెటిక్ హైలైట్స్, మెరుగైన ఫీచర్లతో ఇది ప్రత్యేక గుర్తింపు పొందుతోంది. అడ్వెంచర్ థీమ్ ను ఇష్టపడే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని రెనాల్ట్ ఈ ఎడిషన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది.
Read Also: ఎంజీ To టాటా.. రూ. 10 లక్షల లోపు బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!