Tyre Codes Explained: చాలా మంది కారు, బైక్ టైర్లను కొనుగోలు చేసే సమయంలో బ్రాండ్, ధర, మైలేజ్ మాత్రమే చూస్తారు. కానీ, టైరు సైడ్ వాల్ మీద ఉండే సంఖ్యలను పెద్దగా పట్టించుకోరు. అంతేకాదు, ఆ అక్షరాల అసలు అర్థం చాలా మందికి తెలియదు. నిజానికి ఆ చిన్న కోడ్స్ లో టైరు సామర్థ్యం, భద్రత, స్పీడ్ లిమిట్, బరువు మోసే శక్తి లాంటి కీలకమైన సమాచారం ఉంటుంది. ఆ కోడ్స్ ను అర్థం చేసుకుంటే సరైన టైర్లను ఎంచుకోవడం మాత్రమే కాకుండా, డ్రైవింగ్ సమయంలో మరింత భద్రతను పొందే అవకాశం ఉంటుంది.
టైరు మీద కనిపించే గుర్తులకు అర్థం ఏంటి?
సాధారణంగా ప్రతి టైర్ పై 195/55 R16 87V లాంటి కోడ్స్ కనిపిస్తుంది. ఇవి కేవలం సంఖ్యలు మాత్రమే కాదు. ఇందులోని ప్రతి అక్షరం, ప్రతి సంఖ్యకు ప్రత్యేక అర్థం ఉంటుంది. మొదట కనిపించే సంఖ్య టైరు వెడల్పును సూచిస్తుంది. ఉదాహరణకు 195 అంటే ఆ టైరు వెడల్పు 195 మిల్లీమీటర్లు అని అర్థం. వెడల్పైన టైర్లు రోడ్డుపై మంచి గ్రిప్ ఇస్తాయి. అందుకే స్పోర్ట్స్ కార్లు, పెర్ఫార్మెన్స్ వాహనాల్లో ఎక్కువ వెడల్పు ఉన్న టైర్లను ఉపయోగిస్తారు.
ఆ తర్వాత ఉన్న 55 అనే సంఖ్యను యాస్పెక్ట్ రేషియో అంటారు. ఇది టైరు ఎత్తు ఎంత ఉందో తెలియజేస్తుంది. తక్కువ యాస్పెక్ట్ రేషియో ఉన్న టైర్లు స్పోర్టీ లుక్ ఇవ్వడమే కాకుండా, హ్యాండ్లింగ్ కూడా మెరుగుపరుస్తాయి. ఎక్కువ ఎత్తు ఉన్న టైర్లు సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభవాన్ని ఇస్తాయి. అందులోని R అనే అక్షరం టైరు నిర్మాణ రకాన్ని సూచిస్తుంది. R అంటే రేడియల్ టైర్. ప్రస్తుతం మార్కెట్లో ఎక్కువగా ఉపయోగిస్తున్న టైర్లు ఇవే. ఇవి ఎక్కువ మన్నిక, మెరుగైన సౌకర్యం అందిస్తాయి. కొన్ని పాత వాహనాల్లో B, D లాంటి గుర్తులు కూడా ఉండేవి. అవి బయాస్, డయాగనల్ టైర్లను సూచిస్తాయి.
ఇక ఆ తర్వాత వచ్చే 16 అనేది రిమ్ సైజ్. అంటే ఆ టైరు 16 అంగుళాల వీల్ రిమ్‌కు సరిపోతుందని అర్థం. టైరు, రిమ్ సైజ్ సరిపోకపోతే డ్రైవింగ్ లో సమస్యలు వస్తాయి. అందుకే మేకర్స్ సూచించిన సైజ్ నే వాడటం మంచిది. 87 అనే సంఖ్య లోడ్ ఇండెక్స్ ను సూచిస్తుంది. అంటే ఒక్క టైరు ఎంత బరువును మోయగలదో తెలియజేస్తుంది. ఎగ్జాంఫుల్ 87 ఇండెక్స్ ఉన్న టైరు సుమారు 545 కిలోల వరకు బరువును మోస్తుంది. కుటుంబంతో ప్రయాణాలు చేసే వారు, ఎక్కువ సామాను తీసుకెళ్లేవారు దీనిని కచ్చితంగా తెలుసుకోవాలి. చివరిగా వచ్చే V లాంటి అక్షరాన్ని స్పీడ్ రేటింగ్ అంటారు. ఇది చాలా ముఖ్యమైనది. టైరు ఎంత గరిష్ట వేగాన్ని తట్టుకోగలదో తెలియజేస్తుంది.
S రేటింగ్ టైరు గంటకు 180 కి.మీ వరకు తట్టుకుంటుంది. H రేటింగ్ టైర్ గంటకు 210 కి.మీ వరకు తట్టుకుంటుంది. V రేటింగ్ గంటకు 240 కి.మీ వరకు తట్టుకుంటుంది. అంటే మీరు టైరు మీద ఉన్న గరిష్ట వేగంలో వెళ్లాలని కాదు. ఆ టైరు ఆ స్థాయి వేగాన్ని సురక్షితంగా హ్యాండిల్ చేయగలదని అర్థం.
Read Also: ఎండలో పార్క్ చేసినా కారు చల్లగా ఉండాలా? ఈ సింపుల్ ట్రిప్స్ ట్రై చేయండి!