July 2026 Car Launches: భారత ఆటోమొబైల్ మార్కెట్ లో జూలై2026 కూడా సందడిగా మారబోతోంది. జూన్ లో పలు కొత్త కార్లు విడుదల కాగా, జూలైలో కూడా హ్యాచ్ బ్యాక్ ల నుంచి SUVల వరకు అదిరిపోయే మోడళ్లు మార్కెట్లోకి రానున్నాయి. వాటిలో టాప్ మోడల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
రెనాల్ట్ క్విడ్ ఫే స్‌లిఫ్ట్ జూలై 3న విడుదల కానుంది. ఈ కారులో కొత్త LED డే టైమ్ రన్నింగ్ లైట్లు, రీడిజైన్ చేసిన బంపర్లు, కొత్త టెయిల్ లైట్లు రానున్నాయి. అంతేకాదు, పెద్ద టచ్ స్క్రీన్, కొత్త డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, ఆరు ఎయిర్ బ్యాగ్ లు లాంటి ఫీచర్లు కూడా వచ్చే అవకాశముంది. ప్రస్తుతం ఉన్న 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ నే కొనసాగించే అవకాశం ఉంది.
నిస్సాన్ టెక్టన్ జూలై 9న లాంచ్ కానుంది. ఇది రెనాల్ట్ డస్టర్ ఆధారంగా రూపొందించిన SUV. LED హెడ్ లైట్లు, కొత్త అల్లాయ్ వీల్స్, ఆధునిక డిజైన్ తో ఈ మోడల్ రానుంది. ఇందులో 1.0 లీటర్, 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఎంపికలు ఉండనున్నాయి. ధర కూడా డస్టర్ కు దగ్గరగా ఉండొచ్చని అంచనా.
JSW MG కొత్త SUV జూలై 16న విడుదలయ్యే అవకాశం ఉంది. ఇది అంతర్జాతీయ మార్కెట్లో అమ్ముడవుతున్న వులింగ్ స్టార్ లైట్ 560 ఆధారంగా రూపొందిన మోడల్ గా భావిస్తున్నారు. ఏడు సీట్లతో పాటు పెద్ద టచ్ స్క్రీన్, డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే, పనోరమిక్ సన్ రూఫ్ లాంటి ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి. హైబ్రిడ్, పూర్తి ఎలక్ట్రిక్ వెర్షన్ లో ఏది భారత మార్కెట్‌కు వస్తుందో కంపెనీ ఇంకా వెల్లడించలేదు.
మారుతి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ జూలై 23న మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ SUVలో కొత్త బంపర్లు, కొత్త అల్లాయ్ వీల్స్, పెద్ద ఇన్ఫోటైన్ మెంట్ స్క్రీన్ లాంటి ఛేంజెస్ తో రానుంది. ముఖ్యంగా తొలిసారి టర్బో పెట్రోల్ ఇంజన్ ను అందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. .
స్కోడా కోడియాక్ RS కూడా జూలైలోనే విడుదల కానుంది. ధర ప్రకటించకముందే తొలి 50 యూనిట్లు అమ్ముడవడం విశేషం. ఇందులో 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 265 హెచ్‌పీ పవర్, ఆల్ వీల్ డ్రైవ్ వ్యవస్థ ఉంటాయి. కేవలం 6.3 సెకన్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే సామర్థ్యం ఈ SUV ప్రత్యేకత.
హోండా ZR-V హైబ్రిడ్ SUV కూడా జూలైలో భారత మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. LED లైట్లు, డిజిటల్ డిస్ ప్లే, బోస్ సౌండ్ సిస్టమ్ లాంటి ప్రీమియం ఫీచర్లతో పాటు 2.0 లీటర్ హైబ్రిడ్ ఇంజన్ ఇందులో ఉంటుంది. ఈ కారు మంచి మైలేజ్ తో పాటు మెరుగైన పనితీరును అందించనుంది.
అటు 2026 టయోటా హిలక్స్ అప్ డేటెడ్ వెర్షన్ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. కొత్త డిజైన్, డ్యూయల్ డిజిటల్ స్క్రీన్లు, వెంటిలేటెడ్ సీట్లు, 48V మైల్డ్ హైబ్రిడ్ డీజిల్ ఇంజన్ లాంటి మార్పులు ఇందులో ఉండనున్నాయి.
Read Also: మార్కెట్ లోకి సియెర్రా EV ఎంట్రీ.. ధర, రేంజ్, ఫీచర్లు సహా పలు 10 క్రేజీ డీటైల్స్ మీకోసం..