Oppo New Foldable Phone: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో కొత్త ప్రయోగాలకు సిద్ధమవుతున్న ఒప్పో.. ఈసారి తమ ఫోన్లతో పాటు కెమెరా విభాగంలోనూ అడుగు పెట్టేలా కనిపిస్తోంది. కంపెనీ కొత్త ఫోల్డబుల్ ఫోన్, ప్రత్యేక డిస్‌ప్లే ఉన్న మరో ఫోన్, చేతిలో పట్టుకుని తీసుకెళ్లగల చిన్న గింబల్ కెమెరాపై పని చేస్తున్నట్లు లీకులు చెబుతున్నాయి. ఇవి నిజమైతే.. ఒప్పో ప్రీమియం ఉత్పత్తుల జాబితా మరింత పెరగనుంది. అయితే ఈ వివరాలపై కంపెనీ నుంచి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.
చైనాకు చెందిన టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఒప్పో కొత్తగా వెడల్పైన స్క్రీన్‌తో ఫోల్డబుల్ ఫోన్‌ను సిద్ధం చేస్తోంది. ఇందులో 2nm టెక్నాలజీతో తయారైన స్నాప్‌డ్రాగన్ ఫ్లాగ్‌షిప్ చిప్ ఉండొచ్చని సమాచారం. ఫోన్ తెరిచినప్పుడు కనిపించే లోపలి స్క్రీన్‌పై మడత గీత కనిపించకుండా చేసే డిస్‌ప్లేను కూడా కంపెనీ పరీక్షించినట్లు చెబుతున్నారు. ఇక కెమెరా విషయానికి వస్తే.. 200MP సెన్సార్‌తో పాటు గింబల్ తరహా ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉండొచ్చట. ఈ ఫోన్ తయారీ దాదాపు పూర్తయిందని లీక్ సూచించినా.. విడుదల తేదీ మాత్రం తెలియలేదు.
ఒప్పో మరో కొత్త ఫోన్‌పైనా పని చేస్తున్నట్లు అదే టిప్‌స్టర్ పేర్కొన్నారు. ఇందులో సాధారణ ఫోన్ల కంటే వెడల్పైన 16:9 డిస్‌ప్లే, చుట్టూ సన్నని బెజెల్స్ ఉండొచ్చని సమాచారం. ప్రాసెసర్‌గా మీడియాటెక్ డైమెన్సిటీ 9 సిరీస్‌కు చెందిన టాప్ చిప్‌ను వాడే అవకాశం ఉంది. వెనుకవైపు పెద్ద సెన్సార్‌తో కూడిన 200MP కెమెరా ఇవ్వొచ్చని అంచనా. ఈ ఫోన్ ఎప్పుడు వస్తుందనే విషయంలోనూ స్పష్టత లేదు.
Also Read: యాపిల్ బిగ్ ట్విస్ట్.. సెప్టెంబర్‌లో iPhone 18 రావట్లేదట, మరెప్పుడు లాంచ్ అవుతుందో తెలుసా?
ఫోన్లకు తోడు, జేబులో పెట్టుకుని తీసుకెళ్లగల గింబల్ కెమెరాను కూడా ఒప్పో తయారు చేస్తున్నట్లు లీక్ చెబుతోంది. ఇది 2026 చివరి నాటికి మార్కెట్లోకి రావచ్చని అంచనా. కెమెరా రిజల్యూషన్, బ్యాటరీ, డిజైన్ వంటి వివరాలు బయటకు రాలేదు. ఈ ఉత్పత్తి వస్తే.. డీజేఐ ఓస్మో పాకెట్ సిరీస్, ఇన్‌స్టా360 వంటి బ్రాండ్లకు ఒప్పో పోటీ ఇవ్వొచ్చు. అయితే ఇది అధికారికంగా ఖరారు కాలేదు.
మరోవైపు.. ఒప్పో ఫైండ్ X10 అల్ట్రా ప్రాజెక్ట్‌ను ఆపేసినట్లు సమాచారం. ఆ ఫోన్ కోసం సిద్ధం చేసిన కొన్ని ఫీచర్లను ఫైండ్ X11 ప్రో మ్యాక్స్‌లో వాడొచ్చని సమాచారం. ఇందులో 200MP మెయిన్ కెమెరా, 2K రిజల్యూషన్‌తో 144Hz డిస్‌ప్లే ఉండొచ్చని అంచనా. సెల్ఫీల కోసం 100MP స్క్వేర్ కెమెరా కూడా రావచ్చట. అయితే X10 అల్ట్రా కోసం అనుకున్న 10x పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఇందులో ఉండకపోవచ్చని లీక్ చెబుతోంది. ఈ వివరాలన్నీ ప్రస్తుతానికి అంచనాలే. కంపెనీ నుంచి ప్రకటన వచ్చే వరకు వీటిని ఖరారైన ఫీచర్లుగా భావించకూడదు.