Made-in-India Railway Technology: భారతీయ రైల్వే రంగానికి అంతర్జాతీయ స్థాయిలో మరో గుర్తింపు లభించింది. భారత్‌లో తయారైన ఎలక్ట్రానిక్ రైలు ప్రొపల్షన్ సిస్టమ్‌ల కోసం జపాన్ తొలిసారిగా ఆర్డర్ ఇచ్చింది. రైల్వే టెక్నాలజీలో ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరున్న జపాన్ నుంచి ఈ ఆర్డర్ రావడం భారత తయారీ రంగానికి అదిరిపోయే న్యూస్ గా చెప్పుకోవచ్చు. అదే సమయంలో రైల్వే విడిభాగాల ఎగుమతుల్లో భారత్‌కు కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయి.
రైలు కదలడానికి అవసరమైన శక్తిని అందించడంలో ప్రొపల్షన్ సిస్టమ్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇంజిన్, మోటార్లు, విద్యుత్ నియంత్రణ వ్యవస్థలు ఇందులో భాగంగా ఉంటాయి. ఒక రైలు మొత్తం విలువలో దాదాపు 40 శాతం వరకు ఈ వ్యవస్థల వాటా ఉంటుంది. అలాంటి కీలక సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత్ నుంచి జపాన్ కొనుగోలు చేయడం మన తయారీదారుల నైపుణ్యానికి అద్భుతమైన గుర్తింపుగా చెప్పుకోవచ్చు.
ఇప్పటికే భారత్ జర్మనీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, అమెరికా లాంటి దేశాలకు రైల్వే విడిభాగాలను సరఫరా చేస్తోంది. వడోదరలోని మనేజాలో ఉన్న ఆల్స్టోమ్ తయారీ కేంద్రంతో పాటు ఇతర ప్లాంట్లు కలిసి 5,000కు పైగా యూనిట్లను వివిధ దేశాలకు ఎగుమతి చేశాయి. జర్మనీ, ఇటలీ, స్పెయిన్, రొమేనియా, మెక్సికో లాంటి దేశాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.
విడిభాగాలకే పరిమితం కాకుండా భారత్ రైల్వే కోచ్‌లు, లోకోమోటివ్‌లను కూడా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తోంది. ఆస్ట్రేలియా, కెనడాలకు రైల్వే కోచ్‌లను సరఫరా చేయగా, మొజాంబిక్, సెనెగల్, శ్రీలంక లాంటి దేశాలకు లోకోమోటివ్‌లను అందించింది. తాజాగా జపాన్ నుంచి వచ్చిన ఆర్డర్ తో భారతీయ రైల్వే తయారీ రంగానికి మరో అంతర్జాతీయ మార్కెట్ అందుబాటులోకి వచ్చింది.
భారత్ కేవలం రైల్వే విడిభాగాలను మాత్రమే కాకుండా పూర్తిస్థాయి రైళ్లను కూడా విదేశాలకు ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2029-30 నాటికి స్వదేశంలో తయారైన వందే భారత్ రైళ్లను ఇతర దేశాలకు ఎగుమతి చేయాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. దీనివల్ల భారత రైల్వే తయారీ సామర్థ్యానికి అంతర్జాతీయంగా మరింత గుర్తింపు వచ్చే అవకాశం ఉంది.
మరోవైపు ముంబై–అహ్మదాబాద్ మధ్య 508 కిలోమీటర్ల హైస్పీడ్ రైలు కారిడార్ కోసం భారత్ సొంతంగా బుల్లెట్ రైలును అభివృద్ధి చేస్తోంది. BEML, ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF), భారతీయ రైల్వే జాయింట్ గా ఈ ప్రాజెక్టుపై పనిచేస్తున్నాయి. 2027 మధ్యలో టెస్టింగ్స్ మొదలు పెట్టాలని భావిస్తున్నాయి. దీని టెస్టింగ్ స్పీడ్ గంటకు 280 కిలోమీటర్లుగా, సాధారణ ఆపరేషనల్ వేగం గంటకు 250 కిలోమీటర్లుగా ఉండేలా రూపొందిస్తున్నారు. భవిష్యత్తులో గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే మరో వెర్షన్‌ను కూడా అభివృద్ధి చేయాలని ప్రణాళికలు ఉన్నాయి.
Read Also: రైలు కిటికీలకు అద్దాలు ఉన్నా ఇనుప కడ్డీలు ఎందుకు? ఇదీ అసలు కథ!