2001 Parliament attack | డిసెంబర్ 13 2023 బుధవారం రోజున పార్లమెంటుపై ఉగ్రవాదులు దాడి చేసి సరిగ్గా 22 ఏళ్లు పూర్తయ్యాయి. అదే తేదీన మళ్లీ పార్లమెంటుపై దాడి జరిగింది. దీంతో అసలు ప్రజాస్వామ్యానికి దేవాలయంగా పరిగణించే పార్లమెంటులో భద్రతా వైఫల్యం ఎలా జరిగిందనేది పెద్ద ప్రశ్నగా మారింది. బుధవారం జరిగిన దాడిలో ఎటువంటి ప్రాణ నష్టం జరుగలేదు. కానీ జాతీయ నాయకులంతా సమావేశాలు జరిపే పార్లమెంటు లాంటి స్థానం కూడా సురక్షితం కాదా అనే అనుమానాలు అందరిలో కలుగుతున్నాయి.
2001 Parliament attack | డిసెంబర్ 13 2023 బుధవారం రోజున పార్లమెంటుపై ఉగ్రవాదులు దాడి చేసి సరిగ్గా 22 ఏళ్లు పూర్తయ్యాయి. అదే తేదీన మళ్లీ పార్లమెంటుపై దాడి జరిగింది. దీంతో అసలు ప్రజాస్వామ్యానికి దేవాలయంగా పరిగణించే పార్లమెంటులో భద్రతా వైఫల్యం ఎలా జరిగిందనేది పెద్ద ప్రశ్నగా మారింది. బుధవారం జరిగిన దాడిలో ఎటువంటి ప్రాణ నష్టం జరుగలేదు. కానీ జాతీయ నాయకులంతా సమావేశాలు జరిపే పార్లమెంటు లాంటి స్థానం కూడా సురక్షితం కాదా అనే అనుమానాలు అందరిలో కలుగుతున్నాయి.
2001లో ఉగ్రవాదలు పార్లమెంటుపై చేసిన దాడిని మరో సారి తలుచుకుంటేనే భయంగా ఉందని కొందరు లోక్ సభ సభ్యలంటున్నారు. అసలు 22 ఏళ్ల క్రితం ఏం జరిగింది. ఆ ఘటనని తలుచుకునేందుకు అంతలా అందరూ ఎందుకు భయపడుతున్నారు.
డిసెంబర్ 13 2001 పార్లమెంటుపై ఉగ్రదాడి
డిసెంబర్ 13 2001 సంవత్సరం ప్రజాస్వామ్యానికి ప్రతీక అయిన పార్లమెంటు భవనాన్ని ఉగ్రవాదుల టార్గెట్ చేశారు. లష్కరే తొయిబా, జైషె ముహమ్మద్.. ఈ రెండు ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన అయిదుగురు ఉగ్రవాదులు పార్లమెంటు భవనంపై దాడి చేశారు. ఈ భయంకరమైన దాడిలో 9 మంది చనిపోయారు. మృతుల్లో 6 మంది ఢిల్లీ పోలీస్ సిబ్బంది, ఇద్దరు పార్లమెంటు భద్రతా దళం సిబ్బంది, ఒకరు పార్లమెంటులో పనిచేసే తోటమాలి. దాడి చేసిన ఉగ్రవాదులందరూ పోలీసులు జరిపిన కాల్పుల్లో చనిపోయారు.
పార్లమెంటు శీతకాల సమావేశాలు జరుగుతున్నాయి. లోక్ సభలో ఎంపీలంతా హాజరయ్యారు. ఒక అంశంపై అధికార కూటమి, విపక్షాల మధ్య గొడవ జరిగి.. సభ 40 నిమిషాల పాటు వాయిదా వేశారు. ఈ సమయంలోనే పార్లమెంటు బయట నుంచి కాల్పుల శబ్దాలు వినిపించాయి. దీంతో అక్కడున్న నాయకులు, భద్రతా సిబ్బంది ఒక్కసారిగా షాకయ్యారు.
వివరాలు
ఉదయం 11గంటల 28 నిమిషాలకు సభ వాయిదా పడింది. 11.29 నిమిషాలకు పార్లమెంటు గేటు నెంబర్ 11 వద్ద అప్పటి ఉపరాష్ట్రపతి, రాజ్యసభ సభాపతి కృష్ణకాంత్ బయటికి వస్తుండగా.. ఆయన కోసం సెక్యూరిటీ సిబ్బంది ఎదురుచూస్తున్నారు. సరిగ్గా అదే సమయానికి ఒక తెల్ల రంగులో అంబాసిడర్ కారు వేగంగా ఉపరాష్ట్రపతి ప్రయాణించే కారవాన్ వైపుకు దూసుకెళ్లింది. మూమూలుగా పార్లమెంటు లోపలకి వచ్చే కార్ల వేగం కంటే ఈ అంబాసిడర్ కారు చాలా వేగంగా వస్తోంది. ఈ కారు సెక్యూరిటీ చెకింగ్ కోసం ఆగలేదని.. వెనుక నుంచి సెక్యూరిటీ సీనియర్ అధికారి జగదీశ్ యాదవ్ పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఆ కారుని ఎవరైనా ఆపండి అని ఆయన కేకలు వేస్తున్నారు.
జగదీశ్ యాదవ్ ఇలా పరిగెడుతూ రావడం చూసిన ఉపరాష్ట్రపతి సెక్యూరిటీ సిబ్బంది ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. వారు కూడా ఆ కారుని అపేందుకు ప్రయత్నించారు. కానీ ఆ తెల్ల అంబాసిడర్ కారు ఒక్కసారిగా గేటు నెంబర్ ఒకటి వైపు మళ్లింది. అక్కడే ఉపరాష్ట్రపతి వెళ్లే కారు నిలబడి ఉంది. ఆ తెల్ల అంబాసిడర్ కారు వేగం ఎక్కువగా ఉండడంతో కారు డ్రైవర్ దానిని కంట్రోల్ చేయలేక ఉపరాష్ట్రపతి వెళ్లే కారుని ఢీకొట్టాడు.
సెక్యూరిటీ సిబ్బంది ఇంకా ఆ కారు వరకు చేరుకోలేదు. అప్పుడే ఒక్కసారిగా ఆ తెల్ల అంబాసిడర్ కారు నాలుగు డోర్లు కూడా ఒకేసారి తెరుచుకున్నాయి. ఆ కారులో నుంచి మొత్తం అయిదు మంది టెర్రరిస్టులు బయటికి వచ్చి ఇష్టమొచ్చినట్లు కాల్పులు ప్రారంభించారు. వారందరి చేతుల్లో ఎకె-47 తుపాకులున్నాయి. అయిదుగురు ఉగ్రవాదుల వీపులకు బ్యాగులన్నాయి. ముందుగా కారు ఆపేందుకు వెనుక నుంచి పరిగెడుతూ వస్తున్న నలుగురు సెక్యురిటి సిబ్బంది కాల్పుల్లో మరణించారు. దీంతో పార్లమెంటు ప్రాంగణంలో జనమంతా పరుగులు తీశారు.
గేటు నెంబర్ 11 వద్ద ఉగ్రవాదులు తమ అంబాసిడర్ కారుని అడ్డుపెట్టుకొనే కాల్పులు చేస్తున్నారు. కొన్నిసార్లు అప్పటికే గ్రెనేడ్ బాంబులు విసిరారు. ఈ సమాచారం ఢిల్లీ పోలీసులకు, CRPF భద్రతా దళాలకు చేరింది. వారంతా పరుగుపరుగున అక్కడికి చేరుకొని పార్లమెంటు గేటు నెంబర్ 11 వద్ద ఉగ్రవాదులను టార్గెట్ చేస్తూ కాల్పులు మొదలుపెట్టారు.
ఈ దాడి జరుగుతున్న సమయంలో పార్లమెంటు సెక్యూరిటీ సిబ్బంది ముందుగా భవనం లోపల ఉన్న అందరు నాయకులను సురక్షిత ప్రదేశాలకు తరలించారు. భవనం లోపలి నుంచి అన్ని తలుపులు మూసివేశారు. అప్పుడు కేంద్ర హోం మంత్రిగా బిజేపీ అగ్రనాయకుడు లాల్ కృష్ణ అడ్వాణీ, రక్షణ శాఖ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్ ఉన్నారు. ఇంతలో అయిదుగురు ఉగ్రవాదులు మెల్లగా తమ స్థానాలు వదిలి ముందుకు సాగారు. వారిలో ఒకడు విపరీతంగా కాల్పులు జరుపుతూ గేటు నెంబర్ ఒకటి వైపు వెళతాడు.. మిగతా నలుగురు గేటు నెంబర్ 12 వైపు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.
పార్లమెంటు భవనం లోపల ప్రవేశించి అక్కడున్న ఎంపీలను హాని కలిగించడానికే ఉగ్రవాదులు ఆ మార్గంలో వెళుతున్నారు. కానీ అప్పటికే భద్రతా దళాలు భవనం లోపలి నుంచి తలుపులు మూసేసి.. ఎంపీలందరినీ సురక్షితం చేశాయి. భవనం చుట్టూ రక్షణ వలయం సృష్టించారు. అప్పుడే ఎవరూ అనుకోనిది జరిగింది.
ఉగ్రవాదులంతా భవనం లోపలి వెళ్లడానికి దారి వెతుకుతున్నారు. కానీ వారు ఏ గేటును తెరవలేకపోయారు. దీంతో ఒక ఉగ్రవాది గేటు నెంబర్ ఒకటి వైపు కాల్పులు చేస్తూ దూసుకొస్తున్నాడు. అతడిపై భద్రతా సిబ్బంది బుల్లెట్ల వర్షం కురిపించింది. దీంతో అతను గేట్ నెంబర్ ఒకటి సమీపంలో కుప్పకూలిపోయాడు. కానీ అతను ఇంకా ప్రాణాలతో ఉన్నాడు. అతని వద్దకు వెళ్లడానికి సెక్యూరిటీ సిబ్బంది జంకుతున్నారు. అతని వద్ద బాంబు ఉన్నట్లు వారికి అనుమానం కలిగింది. వారి అనుమానమే నిజమైంది. చనిపోయేముందు ఆ ఉగ్రవాది తన శరీరం చుట్టూ ఉన్న బాంబును రిమోట్‌తో పేల్చేశాడు. అవును అతనొక సూసైడ్ బాంబర్. అక్కడొక ఆత్మాహుతి దాడి జరిగింది. ఉర్దూ భాషలో సూసైడ్ బాంబర్‌ని ఫిదాయీన్ అని అంటారు.
ఒక ఫిదాయీన్.. ఆత్యాహుతి దాడి చూసి భద్రతా సిబ్బంది చాలా చాకచక్యంగా అడుగులు వేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఇంకా నలుగురు ఉగ్రవాదులు బతికే ఉన్నారు. ఆ నలుగురూ ఒక చోట స్థిరంగా ఉండకుండా పరిగెడుతూ కాల్పులు జరుపుతున్నారు. వాళ్ల వీపులకు ఉన్న బ్యాగుల లోపల పెద్ద మొత్తం బుల్లెట్లు, గ్రెనేడ్లు ఉన్నట్లుగా భద్రతా సిబ్బంది అంచనా వేశారు. ఆ నలుగురినీ అన్ని వైపుల నుంచి భద్రతా సిబ్బంది, పోలీసులు చుట్టుముట్టారు. వారిలో ఒకడు గేటు నెంబర్ 5 వద్ద భద్రతా సిబ్బంది చేతిలో చనిపోతాడు. అప్పటికే ఈ ఉగ్రవాద దాడి మొదలై 40 నిమిషాలు గడిచిపోయాయి. ముగ్గురు ఉగ్రవాదులు ఇంకా బతికే ఉన్నారు.
ఆ ముగ్గురూ ప్రాణాలతో బయటి పోలేరు. అందుకే ముందు నుంచి తమ శరీరాలకు బాంబులు చుట్టుకొని వచ్చారు. కానీ భద్రతా సిబ్బంది వారిని సమర్థవంతంగా అడ్డుకుంది. అందుకే ఆ ముగ్గురూ కలిసి ఆగకుండా కాల్పలు చేస్తూ గేట్ నెంబర్ 9 వైపు బయలుదేరారు. కానీ దారిలోనే భద్రతా సిబ్బంది ఒక్క అడ్డుగోడగా నిలబడ్డారు. దీంతో ఆ ముగ్గురు ఉగ్రవాదులు తమ వద్ద ఉన్న బాంబులు విసరడం మొదలు పెట్టారు. ఇంతలో వెనుక నుంచి ఢిల్లీ పోలీసులు, కమాండోలు వారిపై బుల్లెట్ల వర్షం కురిపించారు. దీంతో ఆ ముగ్గురూ ప్రాణాలు విడిచారు. ఈ మొత్తం ఘటనలో ఉగ్రవాదుల అయిదుగురితో పాటు 9 మంది చనిపోయారు. మృతుల్లో 6 మంది ఢిల్లీ పోలీస్ సిబ్బంది, ఇద్దరు పార్లమెంటు భద్రతా దళం సిబ్బంది, ఒకరు పార్లమెంటులో పనిచేసే తోటమాలి. మరో 18 మందికి గాయలయ్యాయి.
ఈ ఘటన తరువాత కేంద్ర హోం మంత్రి ఎల్‌కే అడ్వాణీ ఒక ప్రకటన చేశారు. లోక్ సభలో మాట్లాడుతూ.. చనిపోయిన అయిదుగురు పాకిస్తాన్ ఉగ్రవాదులని చెప్పారు. ఇది పాకిస్తాన్ ఐఎస్ఐ కుట్ర అని అన్నారు. దుండగులు ఉపయోగించిన కారు, ఫోన్ల ఆధారంగా ఈ దాడికి కుట్ర చేసిన వారిలో కొంతమందిని అరెస్టు చేశారు
ఈ ఉగ్రదాడి కేసులో అరెస్ట్ అయిన వారిలో మహ్మద్ అఫ్జల్ గురు, అతడి బంధువు షౌకత్ హుసేన్ గురు, షౌకత్ భార్య ఆఫ్సానా, గిలానీ అనే మరో వ్యక్తి ఉన్నారు. ట్రయల్ కోర్టు విచారణలో అఫ్సానా నిర్దోషి అని తేలింది. మిగతా ముగ్గురు.. అఫ్జల్ గురు, షౌకత్, గిలానీలకు కోర్టు మరణశిక్ష విధించింది. ఆ తరువాత పైకోర్టులో వీరందరూ అప్పీలు చేసుకోగా.. దాడుల సూత్రధారి అఫ్జల్ గురుకి మరణ శిక్షను ఖారరు చూస్తూ.. మిగతా ఇద్దరిలో గిలానీ నిర్దోషి అని, షౌకత్‌కు పదేళ్ల కఠిన కారాగార శిక్ష అని కోర్టు తీర్పు వెలువరించింది.
అనంతరం అఫ్జల్ గురు సుప్రీం కోర్టు కెళ్లినా, రాష్ట్రపతి క్షమాభిక్ష కోసం ప్రయత్నించినా అతనికి ఊరట లభించలేదు. అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అతడి క్షమాభిక్ష అభర్థనను తిరస్కరించారు. చివరకు 2013 ఫిబ్రవరి 9న ఢిల్లీ తీహార్ జైలులో అఫ్జల్ గురుని ఉరితీశారు.