BigTV English
Advertisement

Ajjada Adibhatla Narayana Das : ఆదిభట్ల అస్తమించిన రోజు..!

Ajjada Adibhatla Narayana Das : ఆదిభట్ల అస్తమించిన రోజు..!

Ajjada Adibhatla Narayana Das : తెలుగువారి విశిష్ట కళారూపమైన హరికథకు ప్రాణం పోసి, దానికి నిర్దిష్ట రూపాన్ని కల్పించి, దానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన కళాకారుడు.. ఆదిభట్ల నారాయణ దాసు. సంగీత, సాహిత్య, నాట్యాల మేలి కలయిక అయిన అరుదైన కథారూపమే హరికథ. భారతీయ పురాణేతిహాసాలను సామాన్యులకు అర్థమయ్యేలా చెప్పటమే గాక, వాటిలోని నీతితో మేలైన జాతిని నిర్మించాలనేది నారాయణ దాసు సంకల్పం. దైవంతో బాటు ఈ హరికథా పితామహుడినీ తలుచుకున్న తర్వాతే.. భాగవతులు హరికథను ప్రారంభించటం నేటికీ కొనసాగుతున్న సంప్రదాయం.


సంస్కృతాంధ్రాలలో అనేక రచనలు చేసిన రచయితగా, కవిగా, బహుభాషా కోవిదుడిగా, గొప్ప తాత్వికుడిగా నారాయణ దాసు పేరు పొందారు. తెలుగునేలపైనే గాక పలు ఇతర ప్రాంతాల్లోనూ ఆయన ప్రదర్శనలిచ్చారు.

1864 ఆగష్టు 31న నేటి ఆంధ్రప్రదేశ్‌లోని బొబ్బిలికి సమీపంలోని బలిజిపేట మండలంలోని.. అజ్జాడ గ్రామంలో లక్ష్మీ నరసమాంబ, వేంకటచయనులనే దంపతులకు నారాయణ దాసు జన్మించారు. ఈయన అసలు పేరు సూర్యనారాయణ. హరికథకుడిగా బాగా ప్రఖ్యాతికెక్కిన తర్వాత ఆయన పేరు.. నారాయణదాసుగా మారింది. పేదరికం వల్ల బడికి వెళ్లలేకపోయారు. కానీ.. ఐదేళ్లకే భాగవత పద్యాలు విని.. వాటిని గుర్తుంచుకుని అద్భుతంగా పాడేవారు.


ఆ సమయంలో తల్లితో బాటు ఏదో తీర్థయాత్రకు పోయిన ఈ బాలుడి కన్ను గుడి బయటి దుకాణంలోని భాగవతం పుస్తకం మీద పడి.. దానిని కొనివ్వమని తల్లిని బతిమిలాడాడు. ఆ షాపు యజమాని ‘నువ్వింకా పిల్లాడివే. అది నీకర్థమయ్యే పుస్తకం కాదు’ అనగా, వెంటనే బాలుడైన నారాయణ దాసు.. అందులోని 10 పద్యాలను టకటకా రాగయుక్తంగా పాడటంతో ఆ దుకాణదారు.. ఆ పుస్తకంతో బాటు కొంత డబ్బును బహుమతి కూడా ఇచ్చిపంపాడట.

మరోసారి.. బాలుడైన నారాయణ దాసు.. అమ్మమ్మగారింటికి పోయినప్పుడు.. వీధి అరుగుమీద కూర్చొని రాగయుక్తంగా పద్యాలు పాడారు. దీన్ని చూసి ముచ్చట పడ్డ ఆయన తాతగారు, మేనమామలు.. ఓ విద్వాంసుడి వద్ద సంగీత శిక్షణ ఇప్పించారు. సంగీత సాధన చేస్తూ.. బడికీ వెళ్లటం మొదలైంది. కొన్నాళ్లకు బొబ్బిలిలో వీణ నేర్చుకునే అవకాశం రావటం, తర్వాత.. ఇంగ్లిష్ నేర్చుకునేందుకు విజయనగరంలో ఉంటే అన్నగారింట చేరటం జరిగాయి.

ఈయన ప్రతిభను గుర్తించిన సంగీత గురువైన జయంతి రామదాసు.. పురాణేతిహాసాలను హరికథగా చెప్పాలని సూచించారు. రాజమండ్రిలో తొలి హరికథను చెప్పారు. కరెంటు, మైకులు, సౌండ్ బాక్స్‌లు, మెరుగైన రవాణా సౌకర్యాలు లేని ఆ రోజుల్లో.. నాటి ఆయన కార్యక్రమానికి ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారు. భారీ ఆకారుడైన నారాయణ దాసు.. తన కంచుకంఠంతో చేత చిడతలు, కాళ్లకు గజ్జెలు ధరించి అద్భుతమైన రీతిలో హరికథను చెప్పారు.

ఇక నాటి నుంచి ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. మైసూర్ మహారాజు ఈయనను పిలిచి హరికథ చెప్పించుకోవటమే గాక ఈయన వీణాగానానికి తన్మయుడై బోలెడన్ని బహుమతులిచ్చాడట. హరికథలు చెప్పటమే గాక నేర్చుకునేందుకు వచ్చిన వారికి సకల సౌకర్యాలు కల్పించి.. గొప్ప శిష్యులను తయారుచేశారు. తన జీవితకాలంలో తెలుగులో 17, సంస్కృతంలో 3, గ్రాంధిక తెలుగులో ఒక హరికథలను రచించారు.

ఈయన ప్రతిభను గుర్తించి 1919లో నాటి విజయనగర సంస్థానాధీశులు.. తమ శ్రీ విజయనగర సంగీత కళాశాలలో తొలి అధ్యాపకుడిగా నియమించారు. ప్రసిద్ధ వయొలిన్ విద్వాంసుడు ద్వారం వెంకటస్వామి నాయుడు అక్కడ విద్యార్థులకు వీణ నేర్పించారు. ఈ పాఠశాలలో చదివిన ఘంటసాల వెంకటేశ్వరరావు వంటి ఎందరో గాయకులు తర్వాతి రోజుల్లో గొప్ప ప్రతిభావంతులుగా రాణించారు.

గురుదేవ్ రవీంద్ర నాథ్ ఠాగూర్.. తన శాంతినికేతనానికి ఈయనను ఆహ్వానించగా.. అక్కడ హిందూస్థానీ బాణీలో నారాయణ దాసు ఆలపించిన ‘భైరవి’ రాగానికి రవీంద్రనాథ్ ఠాగూర్ మైమరచిపోయాడట. అంతేకాదు.. ఇక్కడి విజయనగర సంగీత పాఠశాల సిలబస్‌ను తన శాంతినికేతనంలోనూ ప్రవేశపెట్టారట.

నారాయణ దాసు తెలుగుతో బాటు సంస్కృత, తమిళ, హిందీ, బెంగాలీ, ఉర్దూ, ఆంగ్ల, అరబ్బీ, పారశీక భాషలను ఔపాసన పట్టారు. తెలుగులో అష్టావధానాలూ చేశారు. లయబ్రహ్మ, పంచముఖ పరమేశ్వర, సంగీత సాహిత్య స్వర బ్రహ్మ అనే బిరుదులను స్వీకరించారు. ఆనంద గజపతి మహారాజు ఆస్థాన విద్వాంసునిగానూ అలరించారు. జగజ్యోతి, హరికథామృతం, తారకం, రామచంద్ర శతకం, కాశీ శతకం అనే గ్రంథాలను రచించారు. వీరు ‘నా ఎరుక’ పేరుతో స్వీయ చరిత్ర కూడా రాశారు.

సంగీత, సాహిత్య, గాన కళలో ఈయన ప్రతిభకు మెచ్చిన నాటి ఆంగ్లేయ పాలకులు ఈయన పేరును కొన్ని పురస్కారాలకు సిఫారసు చేసినా.. తనకు ఏ అవార్డూ వద్దంటూ నారాయణ దాసు తిరస్కరించారట. తాను రూపొందించిన హరికథకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేందుకు జీవితకాలం క‌‌ృషిచేసిన ఆదిభట్ల నారాయణ దాసు.. 1945, జనవరి 2వ తేదీన కన్నుమూశారు.

Related News

India VS Pakistan: పవర్‌ఫుల్‌గా పాక్ ఆర్మీ చీఫ్ మునీర్! యుద్ధం ఖాయమేనా?

Nara Lokesh: ప్రజాదర్బార్‌ జరగాల్సిందే! మంత్రులపై లోకేష్ అసహనం

KCR Campaign: జూబ్లీహిల్స్ ప్రచారానికి కేసీఆర్ రానట్లేనా?

CM Revanth Reddy: జూబ్లీహిల్స్‌లో.. కాంగ్రెస్ త్రిముఖ వ్యూహం

Donald Trump: ఎవరీ జొహ్రాన్‌ మమ్దానీ? న్యూయార్క్ మేయర్ బ్యాక్ గ్రౌండ్ ఇదే

Suicide Incidents: బతకండ్రా బాబూ! అన్నింటికీ ఆత్మహత్యే పరిష్కారమా?

Vallabhaneni Vamsi: రాజకీయాల్లోకి రీ ఎంట్రీ.. జగన్‌ పర్యటనలో వల్లభనేని

Jubilee Hills Bypoll: నవంబర్ సెంటిమెంట్.. బైపోల్స్‌లో బీజేపీ హ్యాట్రిక్ కొడుతుందా!

Big Stories

×