Amaravati: రాజధాని అమరావతికి చట్టబద్దతపై అడ్డంకులు తొలగిపోతున్నాయి. శాశ్వత రాజధాని అమరావతే అన్న తీర్మానానికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆమోదించిన ఏకగ్రీవ తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీకి పంపించింది. అమరావతికి చట్టబద్ధత కల్పించడమే కాకుండా భవిష్యత్తులో ఎవరు వచ్చినా కూడా అమరావతిని మార్చే అవకాశం లేకుండా చేసే ఉద్దేశంతోనే 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని సవరిస్తూ ఏపీ శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసింది. అంతటి కీలక అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ముఖం చాటేయడం చర్చనీయాంశంగా మారింది.
ఇంద్రలోకానికి రాజధాని అమరావతి.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే. రాష్ట్ర విభజన తర్వాత రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ తన ప్రస్థానాన్ని మొదలుపెటింది. ఓ వైపు రాజధాని లేకుండా, మరోవైపు ఆర్థిక లోటుతో ప్రయాణం మొదలుపెట్టిన ఏపీని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు విభజిత ఏపీకి తొలి సీఎంగా ఓ స్పష్టమైన దారిని చూపించే ప్రయత్నం చేశారు. ఆర్థిక లోటును క్రమంగా తగ్తిస్తూ .. రాష్ట్రానికి నడిబొడ్డున.. అన్ని జిల్లాలకు అందుబాటులో ఉండేలా అమరావతిని ఏపీ రాజధానిగా నిర్ణయించారు. విజయవాడ, గుంటూరుల మధ్యలో బాబు ఎంపిక చేసిన రాజధాని నిర్మాణానికి రైతులు దాదాపు 30 వేల ఎకరాలకు పైగా సారవంతమైన భూములను స్వచ్ఛందంగా ఇచ్చారు.
రైతులు ఇచ్చిన భూముల్లో తొలి రెండు, మూడేళ్లలోనే చంద్రబాబు అమరావతికి రాజధాని రూపు తెచ్చారు. అమరావతిని రాజధానిగా నిర్ణయించి అసెంబ్లీలో తీర్మానం చేసిన సమయంలో అప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ కూడా ఆమోదం తెలిపింది. అయితే అమరావతి విషయంలో వైసీపీ నేతలు తెర వెనుక ఎన్నోనాటకాలాడారు. ఆ అనుమతులు, ఈ అనుమతులు లేవంటూ కేసులు వేసి అమరావతి నిర్మాణపనులకు ఆటంకాలు సృష్టించే ప్రయత్నం చేశారు. మొదటి సారి చంద్రబాబు ప్రభుత్వానికి కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో సహకారం లభించకపోయినా.. అమరావతికి ఒక రూపం తీసుకు రావడంలో చంద్రబాబు తన పట్టుదలతో సక్సెస్ అయ్యారు.
ఇక తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ కొద్ది రోజులకే అమరావతిపై తన అక్కసు వెల్లగక్కారు. మూడు రాజధానులంటూ మూడు ముక్కలాట మొదలుపెట్టి .. అమరావతిని శ్మశానం అన్నారు. కేసులు వేశారు. నదీపరివాహక ప్రాంతంలో రాజధాని ఏంటని వితండవాదం చేశారు. 2019లో ఒక్క ఛాన్స్ అంటూ వచ్చిన జగన్ రాజధానిగా అమరావతిని సమూలంగా నిర్మూలించే దిశగా అడుగులు వేస్తూ, మూడు రాజధానుల నినాదం ఎత్తుకోవడాన్ని రాజధాని రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ పోరాటం చేశారు. ఆ క్రమంలో చట్ట పరమైన సమస్యలు, అమరావతి రైతుల పోరాటంతో మూడు రాజధానుల దిశగా జగన్ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయారు. కాని, మళ్లీ అధికారంలోకి వచ్చేది తానే అన్న ధీమాతో వైజాగ్ నుంచి పాలన కొనసాగించడానికి రుషికొండపై ప్రజల సొమ్ముతో బ్రహ్మాండమైన ప్యాలెస్ మాత్రం నిర్మింపచేసుకున్నారు.
అయితే 2024 ఎన్నికల్లో వైసీపీ సీన్ పూర్తిగా రివర్స్ అయింది. 151 సీట్ల నుంచి 11కి వైసీపీ బలం పడిపోవడంతో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా పోయింది. సీఎంగా చంద్రబాబునాయుడు మళ్లీ బాధ్యతలు చేపట్టడంతో అమరావతి నిర్మాణ పనులు పరుగులు పెడుతున్నాయి. మాజీ సీఎం జగన్ ఎన్నికల్లో అంత చావు దెబ్బ తగిలినా, అమరావతిపై తన కక్ష సాధింపు కొనసాగించాలనే చూస్తున్నారు. అమరావతిని అడ్డుకుంటానని జగన్ మళ్లీ ప్రకటించారు. ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అదే రాజధానని విచిత్రమైన వాదన మొదలుపెట్టారు.
మరోవైపు పదేళ్ల కిందట 2015 అక్టోబర్ 22న అమరావతి నిర్మాణానికి ఉద్దండరాయునిపాలెంలో శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్రమోడీ, మళ్లీ 2025 మే 2న అక్కడికి సరిగ్గా రెండు కిలోమీటర్ల దూరంలోని వెలగపూడిలో అమరావతి పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఆయన ఆవిష్కరించారు. పదేళ్ల కిందట అమరావతి రాజధాని నిర్మాణానికి రూ.15,000 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేయగా, ఇప్పుడు సుమారు రూ. 60 వేల కోట్ల విలువైన పనులకు శ్రీకారం చుట్టారు. కేంద్రం నుంచి నిధుల కొరత లేకపోవడంతో కొత్త రాజధాని పనులు నిరాటంకంగా సాగుతున్నాయి.
ఎవరు అడ్డుకున్నా ప్రపంచ శ్రేణి నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతానని, రాష్ట్ర రాజధానిగా అమరావతి శాశ్వతంగా ఉంటుందని. ఎన్ని కుయుక్తులు పన్నినా అమరావతిని అడ్డుకోలేరని చంద్రబాబు స్పష్టం చేస్తున్నారు. గత ఏడాది పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ప్రధాని సైతం అదే విధంగా హామీ ఇచ్చారు. అమరావతి ఒక నగరంగా కాదు, శక్తిగా రూపొందాలని, వికసిత భారత్‌కి గ్రోత్ ఇంజిన్‌గా అమరావతి తయారుకావాలని, అమరావతి నిర్మాణానికి కేంద్రప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని, అమరావతి అభివృద్ధికి మీ భుజానికి నా భుజం తోడుగా ఉంటుందని చంద్రబాబు సమక్షంలో స్పష్టం చేశారు.
అయితే అమరావతిపై జగన్ వైఖరి స్పష్టం చేయకపోతుండటంతో .. ఇకపై ఎవరు అధికారంలోకి వచ్చినా…రాజధానిగా అమరావతికి ఎలాంటి ఇబ్బంది కలగని రీతిలో చర్యలకు బాబు సర్కారు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా త్వరలోనే ఏపీ సర్కారు ఓ కీలక అడుగు వేసింది. అమరావతికి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది కలగని రీతిలో రాజధానిగా చట్టబద్ధత కల్పించే దిశగా బాబు సర్కారు ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశ పరిచి రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కోరుతూ తీర్మానాన్ని ఆమోదించింది. ఏపీ పునర్విభజన చట్టం–2014లోని సెక్షన్-5ను సవరించి, సీఆర్డీఏ పరిధిలోని అమరావతిని రాష్ట్ర రాజధానిగా చేర్చాలని తీర్మానం చేసింది. అసెంబ్లీలో ఆ తీర్మానాన్ని ఆమోదించి నేరుగా కేంద్రానికి పంపింది.
ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే రాజధానిగా అమరావతి చట్టబద్దత బిల్లు ప్రవేశ పెట్టే అవకాశముంది. ఏప్రిల్ 1 కేంద్ర క్యాబినెట్ ముందు రాష్ట్ర ప్రభుత్వ తీర్మానం వస్తుందని, ఆమోదముద్ర పడుతుందని ఇప్పటికే మంత్రి నారా లోకేశ్ ఆశాభావం వ్యక్తం చేశారు. టీడీపీ ఎంపీలు ఢిల్లీలో ఆ దిశగా తీవ్రకృషి చేస్తున్నారు. కేంద్రంలో కూటమి సర్కారే అధికారంలో ఉన్న నేపథ్యంలో ఈ తీర్మానానికి పార్లమెంటు ఆమోదం లాంఛనమే. ఏపీ అసెంబ్లీ తీర్మానానికి పార్లమెంటు ఆమోదం లభిస్తే…. ఆ తర్వాత జగన్ అయినా, మరెవరైనా అధికారంలోకి వచ్చినా… అమరావతి నుంచి రాజధానిని మార్చడం అసాధ్యమే. ఈ పరిణామంతో అమరావతికి భూములిచ్చిన రైతుల్లో ఆనందోత్సాలు వెల్లి విరుస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో 1631 రోజుల పాటు తాము చేసిన పోరాటానికి సార్థకత చేకూరిందని సంబరపడుతున్నారు. మరి ఈ కీలక అసెంబ్లీ సమావేశాలకు ముఖ్యం చాటేసిన వైసీపీ.. దీనిపై ఎలా రియాక్ట్ అవుతుందనేది ఆసక్తి రేపుతోంది.
Also Read:
Story by: Apparao, Big Tv