BigTV English

Amit shah speech lok sabha : మణిపూర్‌లో అసలేం జరిగిందంటే.. సభలో ‘షా’ షో..

Amit shah speech lok sabha : మణిపూర్‌లో అసలేం జరిగిందంటే.. సభలో ‘షా’ షో..
Amit shah latest speech

Amit shah latest speech(Parliament latest news update):

బీజేపీ నేతలకు మైక్ ఇస్తే ఊరుకుంటారా? మోదీ పాలనపై ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూనే ఉంటారు. కాంగ్రెస్‌పై, రాహుల్ గాంధీపై అదే స్థాయిలో విమర్శలూ చేస్తుంటారు. అది బహిరంగ సభ అయినా.. పార్లమెంట్ సభ అయినా. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా లోక్‌సభలో అదే జరిగింది. కేంద్రం హోంమంత్రి అమిత్ షా సుదీర్ఘంగా మాట్లాడారు. మణిపూర్ ఇష్యూపై కాసేపు.. మోదీ పాలన, కాంగ్రెస్ తీరుపై చాలాసేపు ప్రసంగించారు. ఇంతకీ అమిత్ షా ఏమన్నారంటే….


మణిపూర్‌ ఘటనలు సిగ్గుచేటని అంగీకరించారు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా. ఇద్దరు మహిళలపై లైంగిక వేధింపులు వీడియో గురించి ప్రస్తావించారు. ఆ వీడియోను పోలీసులకు ఇచ్చి ఉండాల్సిందని.. పార్లమెంట్‌ సమావేశాలకు ముందే ఆ వీడియో రిలీజ్‌ అయ్యిందని అన్నారు. రాహుల్‌గాంధీ మణిపూర్‌ను రాజకీయం చేశారని విమర్శించారు.

అల్లర్లు జరిగిన ప్రాంతాల్ని సందర్శించిన మొదటి వ్యక్తిని తానేనని.. 3 రోజులపాటు తాను అక్కడే ఉన్నానని.. ఆ మూడు రోజులూ ప్రధాని మోదీ తనతో మాట్లాడుతూనే ఉన్నారని చెప్పారు అమిత్ షా. కేంద్ర సహాయ మంత్రి ఏకంగా 23 రోజులపాటు మణిపూర్‌లోనే ఉండి పరిస్థితిని పర్యవేక్షించారని అన్నారు. మెయితీ, కుకీ వర్గాలతో చర్చిస్తున్నామని.. త్వరలోనే మణిపూర్‌ పరిస్థితులను అదుపులోకి తీసుకొస్తామని తెలిపారు.


మణిపూర్‌ అల్లర్లలో ఇప్పటివరకు 152 మంది చనిపోయారని.. ఒక్క మే నెలలోనే 107 మంది చనిపోయారని అమిత్ షా సభలో ప్రకటించారు. కీలక ప్రాంతాల్లో అధికారులను మార్చారని.. మణిపూర్‌ సీఎంను మార్చాల్సిన అవసరం లేదంటూ సమర్థించుకున్నారు. ఆరున్నరేళ్లుగా మణిపూర్‌లో బీజేపీ అధికారంలో ఉందని.. ఏనాడూ ఆ రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు జరగలేదని.. కర్ఫ్యూ విధించలేదని గుర్తు చేశారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు మణిపూర్‌లో హింసకు కారణం అయ్యాయన్నారు. మెయితీలను గిరిజనులుగా ప్రకటించాక.. కుకీ గ్రామాల్లో పుకార్లు వ్యాపించి.. హింస చెలరేగిందన్నారు. మే 3న మొదలైన మణిపూర్‌ హింస నేటికీ కొనసాగుతున్నాయని చెప్పారు.

ఒక ఎంపీ 13సార్లు రీలాంచ్‌ అయ్యారని.. ఆ ఎంపీ 13సార్లూ ఫెయిల్‌ అయ్యారంటూ పరోక్షంగా రాహుల్‌ గాంధీపై పంచ్‌లు వేశారు అమిత్ షా. కాంగ్రెస్‌ది కరప్షన్‌ క్యారెక్టర్‌ అన్నారు. ఆగష్టు 9న మహాత్మా గాంధీ క్విట్‌ఇండియా పిలుపు ఇచ్చారని.. ఇండియా కూటమికి కౌంటర్‌గా మోదీ కూడా ఇప్పుడు క్విట్‌ ఇండియా పిలుపు ఇస్తున్నారని చెప్పారు. గతంలో పీవీ సర్కార్‌ ఎంపీలను కొనుగోలు చేసి అవిశ్వాసం నెగ్గిందని.. ఆ కేసులో చాలా మంది జైలుకు కూడా వెళ్లారని దెప్పిపొడిచారు. నిజాయతీతో అవిశ్వాసాన్ని ఫేస్ చేసి వాజ్‌పేయీ ఒక్క ఓటు తేడాతో ప్రధాని పదవి నుంచి వైదొలిగారని.. నిజాయతీ, నిబద్ధతతో నిలిచినందుకే వాజ్‌పేయీ మళ్లీ ప్రధాని అయ్యారని అన్నారు.

గడిచిన తొమ్మిదేళ్లలో మోదీ 50కి పైగా కీలక నిర్ణయాలు తీసుకున్నారని.. రోజులో 17 గంటలు పని చేసే ప్రధాని నరేంద్ర మోదీ అని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా భారత్‌ గౌరవాన్ని మోదీ పెంచారని.. అనేక దేశాలు తమ దేశ అత్యున్నత పురష్కారాన్ని మోదీకి ఇచ్చాయని అన్నారు. ఇప్పటి వరకు 4వేల మంది ఉగ్రవాదులను హతమార్చామని.. పాక్‌ భూభాగంలోకి చొచ్చుకెళ్లి మరీ సర్జికల్‌ స్ట్రైక్ చేశామని చెప్పారు. ఉగ్రవాదంపై పాకిస్తాన్‌తో చర్చలు జరపమని.. కేవలం కశ్మీర్ యువతతో మాత్రమే చర్చిస్తామని తెలిపారు. నెహ్రూ తప్పుడు విధానాల వల్లే ఆర్టికల్‌ 370 వచ్చిందని.. ప్రధాని మోదీ జమ్మూకశ్మీర్‌ను పూర్తిగా భారత్‌లో కలిపేశారని అన్నారు. తాము ఉచితాలకు వ్యతిరేకమని.. ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా నేరుగా లబ్ధిదారులకు నిధులు ఇస్తున్నామన్నారు. రుణమాఫీ చేస్తామని చెప్పట్లేదని.. రైతులను శాశ్వతంగా రుణ విముక్తి చేస్తున్నామని అమిత్ షా చెప్పారు.

Related News

US Army in Bangladesh: బంగ్లాలో సీక్రెట్ మిషన్..! రంగంలోకి యూఎస్ ఆర్మీ..

Amit Shah: మావోయిస్టుల రూట్ చేంజ్! కొత్త వ్యూహం ఇదేనా?

Telangana Sports: టార్గెట్ 2036 ఒలింపిక్స్..! గోల్డ్ తెచ్చిన వారికి రూ.6 కోట్ల నజరానా

Telangana BJP MP’s: మారకపోతే అంతే.. బీజేపీ ఎంపీలకు ఢిల్లీ పెద్దల వార్నింగ్

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్‌పై.. వైసీపీ పొలిటికల్ గేమ్

Kakinada: కాకినాడ రూరల్ సెగ్మెంట్‌పై ఫోకస్ పెట్టని టీడీపీ పెద్దలు

Hyderabad Metro: మెట్రో ప్లాన్..! అప్పుల నుంచి బయటపడాలంటే ఇదొక్కటే మార్గం..!

Kakani Govardhan Reddy: జైలు జీవితం కాకాణిని మార్చేసిందా?

Big Stories

×