BigTV English

Maoist Keshavarao: నంబాల కేశవరావు హతం.. అమిత్ షా పొగడ్తలు

Maoist Keshavarao: నంబాల కేశవరావు హతం.. అమిత్ షా పొగడ్తలు

Maoist Keshavarao: మిలటరీ ఆపరేషన్ నిపుణుడు, చంద్రబాబు అలిపిరి బ్లాస్టింగ్ సూత్రధారి.. నంబాల కేశరావు మృతి. ఇప్పటికే తప్పుకున్న గణపతి. నంబాల సైతం హతం. ఒక్కో మావోయిస్టు అగ్రనేతా అస్తమిస్తున్నాడు. క్రమంగా మావోయిస్టు పార్టీ కనుమరుగు కానుందా? అడవిలో అసలేం జరుగుతోంది? మావోయిస్టు పార్టీ ఇంతలా దెబ్బ తినడానికి గల కారణాలేంటి?


ప్రధాన కార్యదర్శి హోదా నాయకుడ్ని

నక్సలిజాన్ని నిర్మూలించే పోరాటంలో ఒక మైలురాయిలాంటి విజయమిది. ఈ రోజు ఛత్తీస్ గఢ్ నారాయణపూర్ లో జరిగిన ఆపరేషన్లో.. మన భద్రతా దళాలు… 27 మంది భయంకరమైన మావోయిస్టులను మట్టుబెట్టాయి. వారిలో సీపీఐమావోయిస్టు ప్రధాన కార్యదర్శి అగ్రనాయకుడు, నక్సల్ ఉద్యమానికి వెన్నుముక నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఉన్నారు. నక్సలిజంలో భారత్ చేసిన మూడు దశకాల పోరాటంలో ప్రధాన కార్యదర్శ హోదా కలగిన నాయకుడ్ని మన దళాలు మట్టుబెట్టడం ఇదే తొలిసారి. ఈ పురోగతికి మన ధైర్యవంతమైన భద్రతా దళాలు, ఇతర ఏజెన్సీలను నేను అభనందిస్తున్నాను. ఇదీ అమిత్ షా ట్వీట్ సారాంశం.


54 మంది నక్సలైట్లను అరెస్టు, 84 మంది లొంగుబాటు

ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ పూర్తయ్యాక.. 54 మంది నక్సలైట్లను అరెస్టు చేశారనీ.. 84 మంది నక్సలైట్లు లొంగిపోయారనే ఈ సమాచారాన్ని మీతో పంచుకోడానికి ఎంతో సంతోషంగా ఉందంటారు అమిత్ షా. ఎందుకంటే 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని నిర్మూలించడమే మోడీ ప్రభుత్వ లక్ష్యం. ఈ లక్ష్యానికి మనం దగ్గరకొచ్చేశాం అంటూ అమిత్ షా ఆనందం వ్యక్తం చేయడానికిదో నిదర్శనం. ఇక మోడీ సైతం ఈ అద్భుతమైన విజయం సాధించిన మన దళాలను చూసి గర్విస్తున్నానని అన్నారు. మావోయిజం ముప్పును తొలగించి.. ప్రజలకు శాంతియుత ప్రగతిని అందించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ప్రస్తుతం అమిత్ షా ఆనందానికి కారకుడైన కేశవరావును బసవరాజు, కృష్ణ, వినయ్, గంగన్న, ప్రకాష్, బీఆర్, ఉమేష్, రాజు, విజయ్, కేశవ్, దారపు నరసింహారెడ్డి, నరసింహ అనే మారు పేర్లతోనూ పిలిచేవారు 2018 నవంబర్ లో ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి రాజీనామా తర్వాత కేశవరావు పార్టీ సుప్రీం అయ్యారు. సిక్కోలు జిల్లా.. కోటబొమ్మాళి మండలం, జియ్యన్న పేటగ్రామంలో 1955లో జన్మించారు కేశవరావు. తండ్రి వాసుదేవరావు ఉపాద్యాయుడు. ఇక కేశవరావుకు ఒక సోదరుడు, ముగ్గురు అక్కచెల్లెళ్లు ఉన్నారు.

బీటెక్ చదువుతుండగా పీపుల్స్ వార్ భావజాలం వైపు మొగ్గు

కేశవరావు ప్రాధమక విద్య మొత్తం స్వగ్రామంలోనే జరిగింది. తాతగారి ఊరైన టెక్కలి మండలం తలగాంలో హైస్కూలు విద్య, టెక్కలి జూనియర్ కాలేజీలో ఇంటర్ చదివారు. ఇక డిగ్రీ సెకండియర్ చదువుతుండగా.. వరంగల్ RECలో అవకాశమొచ్చి.. అక్కడ జాయిన్ అయ్యారు. RECలో బిటెక్ చదువుతుండగానే సీపీఐ ఎంఎల్- పీపుల్స్ వార్ గ్రూపు సిద్ధాంతాలు భావజాలంవైపు ఆకర్షితులయ్యారు. ఎంటెక్ చదువు మధ్యలోనే స్వస్తి చెప్పి.. ఉద్యమంలో చేరారు. అప్పటి నుంచి 43 ఏళ్లుగా అజ్ఞాతంలోనే ఉన్నారు. నక్సల్ బరీ ఉద్యమంలో చేరాక.. కేశవరావు స్వగ్రామానికి ఎప్పడూ రాలేదంటారు గ్రామస్తులు. మిలటరీ దాడుల వ్యూహకర్తగానూ కేశవరావుకు పేరుంది. మిలిటరీ ఆపరేషన్లలో దిట్ట. ఆపరేషన్ రూపకల్పన, అమలు, ఆయుధాల వ్యాపారులతో సత్సంబంధాలు ఆయన ఇతర ప్రత్యేకతలు. దశాబ్ద కాలం పాటు కేంద్ర మిలటరీ కమిషన్ కార్యదర్శిగా పని చేశారు. గణపతి తర్వాత పార్టీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. గణపతితో పోల్చితే పార్టీ సిద్ధాంతాల అమల్లో అత్యంత కఠువుగా వ్యవహరించేవారు కేశవరావ్. ప్రతిఘటన ద్వారానే లక్ష్యం సిద్ధిస్తుందని బలంగా నమ్మే వ్యక్తి కేశవరావు. ఇది ఆయన స్వభావమని చెబుతారు ఆయన్ను బాగా ఎరిగిన వారు. అలిపిరిలో చంద్రబాబుపై జరిగిన క్లైమోర్ మైన్స్ దాడిలో ప్రధాన సూత్రధారి నంబాల కేశవరావు.

2010 చింతల్నార్ ఘటన వ్యూహకర్త

2010 ఏప్రిల్ లో ఛత్తీస్ గఢ్ లోని చింతల్నార్ ఘటన వ్యూహం కేశవరావుదే. గస్తీకి వెళ్లి తిరిగి వస్తున్న.. సీఆర్పీఎఫ్ జవాన్లు. రెండు కొండల మధ్యకు వచ్చాక. మావోయిస్టులు అకస్మాత్తుగా విరుచుకుపడ్డారు. జవాన్లకు పారిపోయే అవకాశం కూడా దక్కలేదు ఈ ఘటనలో మొత్తం 74 మంది జవాన్లు చనిపోయారు. ఇక 2013లో సల్వాజుడం వ్యవస్థాపకుడు మహేంద్ర కర్మ పై దాడి వ్యూహం కూడా కేశవరావుదే. ఈ ఘటనలో మహేంద్ర కర్మతో పాటు మరో 27 మంది మరణించారు. ప్రస్తుతం మరణించిన కేశవరావు వయసు డెబ్భై ఏళ్లు కాగా.. గణపతి వయసు 76 ఏళ్లు.. సోనూ, బాలకృష్ణ, పుల్లూరి ప్రసాదరావు, రామచంద్రారెడ్డి వంటి వారంతా అరవై ఏళ్లకు పైబడ్డవాళ్లే. మరి కొందరి వయసు యాభై ఏళ్లు దాటాయి. దీంతో యువతరాన్ని ముందుకు తీసుకురావాలని.. ప్రయత్నిస్తున్నారు. కానీ వీరెవరూ తెలుగు ప్రాంతాల వారు కారు. రానున్న కాలంలో ఛత్తీస్ గఢ్, ఒడిశాలో.. స్థానిక నాయకత్వం ఆవర్భవిస్తుందని జంపన్న చేసిన వాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి..

తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టు పార్టీ ఉనికి ప్రశ్నార్ధకం అయ్యిందా? మావోయిస్టులు క్రమంగా తగ్గిపోవడానికి గల కారణాలేంటి? సీపీఐ మావోయిస్టు ప్రకటన ఎప్పుడు జరిగింది? బలమైన పొలిట్ బ్యూరో ఇప్పుడైమంది? మేథోబలం ఎందుకు తగ్గుతూ వచ్చింది? వచ్చే రోజుల్లో తెలుగు నాయకత్వం అలా ఉంచితే.. మొత్తంగా మావోయిస్టు పార్టీ మనుగడ ఎంత వరకూ సాధ్యం? ఆ పూర్తి వివరాలు మీకోసం.. ఆరోగ్య సమస్యలతో అండర్ గ్రౌండ్ లో హిడ్మాఏపీ, తెలంగాణ.. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు అగ్రనేతలు ఎన్ కౌంటర్లలో మరణించారు. కొందరు వయో భారంతో నెట్టుకొస్తున్నారు. మరి కొందరు అనారోగ్య సమస్యలతో కొట్టు మిట్టాడుతున్నారు. ఉన్నత పదవుల్లో ఉన్నవారి పరిస్థితీ ఇంతే.. వయో భారంతో ఉద్యమాన్ని నడిపించలేక పోతున్నారు. దీంతో ఇదిగో ఇదీ పరిస్థితి. ఆపరేషన్ కగార్ పేరిట కేంద్ర బలగాలు ఏరి వేస్తుంటే.. ఒకప్పటి మావోయిస్టు స్వర్గధామం నేడు స్మశానాన్ని తలపిస్తోంది.

2004 సెప్టెంబర్ 21న.. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్..

ప్రస్తుతం మావోయిస్టులు ఉనికి పోరాటం చేస్తున్నారు. ఛత్తీస్ గఢ్ అడవుల్లో భద్రతా దళాలతో జరుగుతూన్న తీవ్ర పోరు.. వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అగ్రనేతలు సురక్షిత ప్రాంతాలకు తరలించడంపైనే ఎక్కువగా దృష్టి సారించారు. మావోయిస్టు సిద్ధాంతంపై సానుభూతిపరులకు తరగతులు నిర్వహించే సూచనలు కూడా కనిపించడం లేదు. తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు ఇదే మాట చెబుతున్నారు. 2004 సెప్టెంబర్ 21న.. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్.. ప్రధాన మావోయిస్టు గ్రూపైన సీపీఐ మార్క్సిస్ట్-లెనినిస్ట్, పీపుల్స్ వార్.. బీహార్, పశ్చిమ బెంగాల్ కేంద్రంగా సాగుతూన్న.. మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా- ఎంసీసీఐ విలీనం ద్వారా సీపీఐ మావోయిస్టు పార్టీ ఏర్పడింది. ఈ విలీన చర్చలు 2003లోనే ప్రారంభమయ్యాయి. పీపుల్స్ వార్ అగ్రనేతలు.. నాటి ముఖ్యమంత్రి వైయస్ ప్రభుత్వంతో చర్చలు జరిపారు. అప్పుడు సీపీఐ మావోయిస్టు పార్టీ ప్రకటన జరిగింది.

పొలిట్ బ్యూరో సభ్యులతో కూడిన కేంద్ర కమిటీ

2004లో సీపీఐ మావోయిస్టు పార్టీ ఏర్పడినపుడు 16 మంది సభ్యులతో బలమైన పొలిట్ బ్యూరో ఉండేది. అది గొప్ప నిర్ణయాలు తీసుకునేది. 34 మంది సభ్యులతో బలమైన కేంద్ర కమిటీ ఉండేది. కేంద్ర కమిటీతో పాటు పొలిట్ బ్యూరోలో ఎందరో ఏపీకి చెందిన వారుండేవారు. గతంలో పీపుల్స్ వార్ కు నాయకత్వం వహించిన ముప్పాళ్ల లక్ష్మణరావును ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. 2021 ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం.. పొలిట్ బ్యూరో సభ్యులతో కూడిన కేంద్ర కమిటీలో 21 మంది ఉండగా.. వీరిలో ఒక్క తెలంగాణాకు చెందిన వారే 10 మంది ఉండేవారు. ఏపీకి చెందిన ఇద్దరున్నారు. అయితే ఈ లెక్క ఇప్పుడు మారుతోంది. అగ్రనాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు కొందరు కింది స్థాయి నేతలను కేంద్ర కమిటీలోకి పంపుతున్నట్టు ఇంటెలిజెన్స్ రిపోర్ట్. ఆ రిపోర్ట్ లెక్క కూడా మారిపోయిందిపుడు. ఆపరేషన్ కగార్ తర్వాత మావోయిస్టులకు గట్టి దెబ్బే తగిలింది. 2026 మార్చ్ టార్గెట్ గా కేంద్రం చేస్తోన్న మిషన్.. దాదాపు అడవులను ఖాళీ చేయిస్తోంది.

కేశవరావు తరహాలో బీటెక్, ఎంటెక్ చదివిన వారు ఇటు వైపు కూడా తిరిగి చూడ్డం లేదు

తెలుగు మావోయిస్టు నాయకుల్లో ఎక్కువ మంది ఉన్నత విద్యావంతులుండేవారు. పోస్ట్ గ్రాడ్యుయేట్లు, లాయర్లు, పీహెచ్‌డీ హోల్డర్లూ ఇలాఎంతో మంది ఉండేవారు. క్రమం తప్పకుండా ట్రైనింగ్ నిర్వహించేవారు. తద్వారా కార్యకర్తల్లో మావోయిస్టు భావజాల సిద్ధాంతం పెరిగేది. దీంతో మేథస్సు అభివృద్ధి చెందేది. ఇప్పుడు కేశవరావు తరహాలో బీటెక్, ఎంటెక్ చదివిన వారు ఇటు వైపు కూడా తిరిగి చూడ్డం లేదు. ఒకప్పుడు విరివిగా కనిపించే చదువుకున్న కుర్రకారు దాదాపు అడవులవైపు వెళ్లడమే మరచిపోయారు. మారిన పరిణామ క్రమాలు, గ్లోబలైజేషన్, లాప్ టాప్ నుంచే ఆఫీస్, స్టార్టప్స్ అంటూ కొత్త లైఫ్ స్టైల్ కి కాలేజీ కాలం నుంచే అలవాటు పడి.. ఆనాటి భావజాలానికి దాదాపూ దూరం జరిగిపోయారు. అడవులకెళ్లడం సంగతి అటుంచితే.. కాంక్రీట్ జంగిల్లో బతకడానికే నానా పాట్లు పడుతోంది నేటి యువత. దీంతో అడవులకెళ్లే యువకుల సంఖ్య క్రమేపీ తగ్గుతోంది. వారి క్రయిటీరియాలోనే నేడు అడవుల బాట పట్టడం అనే కాన్సెప్ట్ కనుమరుగై పోయింది.

Also Read: కావలిలో వైసీపీకి బిగ్‌షాక్.. టీడీపీలోకి కీలక నేత?

2005- 09 మధ్య కాలంలో పోలీసు బలగాలు.. గ్రేహౌండ్స్ అనే మావోయిస్టు వ్యతిరేక దళం ఏర్పాటు నుంచీ పరిస్థితి మారింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టు ఉద్యమానికి గట్టి దెబ్బే తగిలింది. స్ట్రాంగ్ ఇంటెలిజెన్స్ నెట్ వర్క్ తో భద్రతా దళాలు ఒక్కొక్కరిగా మట్టుబెడుతూ వచ్చాయి. దీంతో అగ్రనాయకులంతాఛత్తీస్ గఢ్ అడవుల్లోకి, మరికొందరు ఒడిశాలోకి పారిపోవాల్సి వచ్చింది. ఎన్కౌంటర్లు, లొంగుబాట్ల కారణంగా అగ్రనాయకత్వంలో తెలుగువారి ఉనికి భారీగా తగ్గింది. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఇప్పటికీ తెలుగు వారున్నారు. పార్టీ సైద్ధాంతిక బలం విషయంలో.. వీరి కృషి ఎంతో ఉంది. దీంతో పార్టీ బలంగా ఉన్నట్టు కనిపించింది. కానీ ఎప్పుడైతే.. గణపతి తప్పుకుని.. నంబాల కేశవరావు పగ్గాలు చేపట్టారో.. తర్వాతి కాలంలో ఉనికి పోరాటంతోనే సరిపోయింది. దానికి తోడు వయోభారం పెరగటం వల్ల కొత్త నాయకత్వం లేక పోవడం తీవ్ర పరిణామాలకు దారి తీస్తూ వచ్చింది. తెలుగు నాయకత్వ లేమి సంగతి అటుంచితే.. అసలు పార్టీ నాయకత్వానికే దిక్కు లేకుండా పోయింది. ఎటు నుంచి ఎటు చూసినా కనిపించే అగ్రనాయకుడు హిడ్మానే. హిడ్మా చూస్తే ఆరోగ్య సమస్యల కారణంగా అండర్ గ్రౌండ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో మావోయిస్టు పార్టీ కేంద్ర బలాలకు లొంగిపోవడమో లేకుంటే ఇదిగో ఇలా హతం కావడమో జరుగుతోంది. దీంతో పార్టీ భవిష్యత్తే ప్రశ్నార్ధకంగా మారింది.

Related News

Telangana Politics: పొన్నం టార్గెట్ రీచ్ అవుతాడా?

Kothagudem Congress: కొత్తగూడెంలో కాంగ్రెస్‌కు కష్టాలు తప్పవా?

Jani Master: బిగ్ బాస్‌లోకి జానీ మాస్టర్ అసిస్టెంట్… ఇక హౌజ్‌లో రచ్చ రచ్చే

AP Politics: కొత్త కార్యచరణతో దూకుడు పెంచాలని చూస్తున్న జగన్.. ఎందుకంటే!

BJP Politics: ముగ్గురూ ముగ్గురే.. ముఖం చాటేస్తున్న లీడర్లు

AP Politics: టీడీపీకి పిల్లి సత్తిబాబు రాజీనామా.. కారణం ఇదేనా?

Big Stories

×