Kavali YSRCP Leaders: అధికారంలో ఉన్నప్పుడు రామ, లక్ష్మణులు అనిపించుకున్నారు. అధికారం పోయాక బద్ద శత్రువులు అయ్యారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోచుకోంది నీవు అంటే నీవు అని ప్రెస్‌మీట్‌లు పెట్టి మరీ దుమ్మెత్తి పోసుకుంటున్నారు. దాంతో ఆ నియోజకవర్గంలో పొలిటికల్ సీన్ మారిపోతోంది. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు అన్నీ తామై వ్యవహరించిన నేతలు ఇప్పుడు పక్కచూపులు చూస్తున్నారు. జగన్ అంటే మా ప్రాణం మా గుండె అన్న నేతలు సైతం సైకిల్ పార్టీకి జై కొట్టేందుకు సిద్దం అయిపోతున్నారట. అసలు అప్పట్లో రామలక్ష్మణుల్లా మెలిగిన మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్ రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ మన్నెమాల సుకుమార్‌రెడ్డిల మధ్య ఎందుకు చెడింది?
కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి అనుచరుడు సుకుమార్
నెల్లూరు జిల్లా కావలి రాజకీయంగా చైతన్యవంతమైన నియోజకవర్గం. అయితే అక్కడ రాజకీయాలు ఇప్పుడు ఊసరవెల్లిలా రంగులు మార్చుకుంటున్నాయి. గత ప్రభుత్వంలో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ ముఖ్య అనుచరుడుగా మాజీ ఏఎంసీ చైర్మన్ మన్నెమాల సుకుమార్ రెడ్డి అక్కడ చక్రం తిప్పేవారు. కావలి నియోజకవర్గంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని సుకుమార్ రెడ్డి అన్నీ తానై వ్యవహరించారు. రామ, లక్ష్మణులు అని చెప్పుకొనే ప్రతాప్ కుమార్ రెడ్డి, సుకుమార్ రెడ్డిలు ప్రభుత్వ స్థలాలు కబ్జా, గ్రావెల్ మాఫియా , రియల్ ఎస్టేట్ వ్యాపారాలలో కోట్లు దోచేశారన్న ఆరోపణలున్నాయి.
కావలిలో అమృత పైలాన్ స్థూపం ఆవిష్కరించిన లోకేష్
కావలి పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులతో 80 కోట్ల రూపాయలు మంజూరు కాగా దానికి చిహ్నంగా ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం 2018 జనవరి 11వ తేదీన అమృత పైలాన్ స్థూపాన్ని కావలిలో నిర్మించింది. అప్పటి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ దాన్ని ఆవిష్కరించారు. అయితే ఆ పైలాన్ శిలాఫలకంలో ఆనాటి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పేరు వేయలేదని, ప్రోటోకాల్ పాటించలేదని నెపంతో ప్రభుత్వం మారాక 2020 ఏప్రిల్ 11 తేదీ అర్ధరాత్రి గుట్టు చప్పుడు కాకుండా ఆ పైలాన్ ను ధ్వంసం చేశారు. ఆ స్థలాన్ని ప్రెస్ క్లబ్ కు కేటాయిస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రకటించారు.
పైలాన్ విధ్వంసం కేసులో కొందరు జర్నలిస్టు, వైసీపీ నేతల అరెస్ట్
అయితే ఆనాడు పైలాన్ ధ్వంసం అయినట్లు అప్పటి కమిషనర్ వెంకటేశ్వర్లు పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు. ఈ పైలాన్ విధ్వంసం వెనుక కొందరు జర్నలిస్టులు వైసీపీ నేతలు ఉన్నారంటూ తాజాగా పోలీసులు అరెస్టులు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి, సుకుమార్ రెడ్డి, మరికొంతమంది వైసీపీ నేతలపై కూడా కేసులు నమోదు చేశారు. దీంతో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డికి బెయిల్ రాగా కొందరు పరారీలో ఉన్నారు.
షాడో ఎమ్యెల్యేగా వ్యవహరించిన మన్నెమాల సుకుమార్‌రెడ్డి సై
అధికారం ఉన్నప్పుడు రెచ్చిపోయిన వైసీపీ నేతలు అధికారం పోగానే పక్కదారులు చూస్తున్నట్లు తెలుస్తోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కావలిలో షాడో ఎమ్మెల్యేగా వ్యవహరించిన మన్నెమాల సుకుమార్ రెడ్డి సైతం పార్టీ మారేందుకు సిద్ధమయ్యారంట. అధికారం ఉన్నప్పుడు కావలిలో ప్రతాప్‌కుమార్ రెడ్డి పై ఈగ వాలినా నేనున్నానంటూ ముందుకొచ్చి అవతల వాళ్ళపై విరుచుకుపడ్డ సుకుమార్ రెడ్డి ఇప్పుడు ఆయన వల్లే కావలిలో అరాచకాలు జరిగాయని, పైలాన్ ధ్వంసం చేయించింది ప్రతాప్‌కుమార్‌రెడ్డే అంటూ మీడియా ముందుకు వచ్చి ఆరోపించడం కావలి ప్రజలను ఆశ్చర్యాన్ని గురిచేస్తోంది.
Also Read: బీజేపీకి షాక్ ఇస్తున్న గోడం నగేష్?
ప్రతాప్ అవినీత ఆధారాలతో బయట పెడతానంటున్న సుకుమార్
మరి ఫైలాన్ ధ్వంసం చేసినప్పుడు ఇన్ని రోజులు తెలియనట్లు ఉన్న సుకుమార్ రెడ్డి కేసులు పెట్టడంతో అకస్మాత్తుగా తన ప్రమేయం ఏమీ లేదని, అంతా ప్రతాప్ కుమార్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగిందని చెప్తున్నారు. కమ్మ సామాజికవర్గం పై కక్ష పెంచుకొని ఆయనే ఆ పైలాన్ ధ్వంసం చేయించారని, ప్రతాప్‌కుమార్ రెడ్డి చేసిన అవినీతి మెత్తం ఆధారాలతో సహా బయట పెడతానని, అప్రూవల్ గా మారిపోయినట్లు సత్య హరిచంద్రుడు లెక్క సుకుమార్ మాట్లాడుతుండటం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోందంట. టీడీపీలో చేరికకు లైన్ క్లియర్ చేసుకోవడానికే ఇప్పటికే వైసీపీ నుంచి సస్పెండ్ అయిన సుకుమార్ ప్లేటు మార్చారన్న టాక్ వినిపిస్తోంది.
సుకుమార్ బండారం బయటపెడతామంటున్న ప్రతాప్ అనుచరులు
ప్రతాప్‌కుమార్ రెడ్డి అనుచరులు కూడా పార్టీ అధికారం ఉన్నప్పుడు అడ్డదారుల్లో దోచుకొని, అధికారం పోగానే తమ నేతపై అభాండాలు వేయటం మంచి పద్ధతి కాదని, త్వరలోనే నీ బండారం మొత్తం బయటపెడతామని సుకుమార్‌ను హెచ్చరిస్తున్నారు. మొత్తం మీద పైలాన్ ధ్వంసం కేసు కావలి రాజకీయాలను మలుపు తిప్పుతున్న పరిస్థితి ఉంది. అధికారం ఉన్నప్పుడు టీడీపీ నేతలపై అక్రమ కేసులు, దౌర్జన్యాలు, దాడులు చేసిన వైసీపీ నేతలను పార్టీలోకి తీసుకుంటే వాళ్ల మరకలు పార్టీకి అంటుతాయని పార్టీ కి చెడ్డ పేరు వచ్చే పరిస్థితి ఉందని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. మరి చూడాలి రాబోయే రోజుల్లో కావలి రాజకీయం ఏ మలుపుతు తిరుగుతుందో.