Big Stories

Nellore Politics: f3 కుటుంబ కథా చిత్రమ్..

Nellore political news(AP politics): ఏసీలకు అలవాటు పడి ఎండ ముఖం ఎరక్కుండా పెరిగిన వారు ఇప్పుడు మండుటెండల్లో రోడ్ల మీదకు వస్తున్నారు. ఎన్నికల పుణ్యమా అని తమ వారి గెలుపు కోసం గడపగడపా తొక్కుతున్నారు. భర్తల కోసం భార్యలు, తల్లిదండ్రుల కోసం పిల్లలు భానుడి ప్రతాపాన్ని లెక్కచేయకుండా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎమ్మెల్యే, ఎంపీలుగా గెలిపించుకుని తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడానికి వారు పడుతున్న పాట్లు ఓటర్లను ఆకట్టుకుంటున్నట్లే కనిపిస్తున్నాయి. మరి ఓటరు దేవుడు ఎవర్ని కరుణిస్తాడో కాని.  నెల్లూరు జిల్లాలో జరుగుతున్న ఈ ఫ్యామిలీ మెంబర్స్ కాన్వాసింగ్ ఆసక్తికరంగా తయారైంది ఫ్యామిలీ ప్రచారం.

- Advertisement -

ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు బిజీబిజీగా ఉండటం మామూలే.. ఒక్కోసారి గెలుపు కోసం నిద్రాహారాలు కూడా మర్చిపోతుంటారు. ఓటరు దేవుళ్లుని ప్రసన్నం చేసుకోవడానికి ఎక్కేగడపా.. దిగే గడపా అన్నట్లు తిరిగేస్తుంటారు. అయితే ఈసారి పోటీలో ఉన్న అభ్యర్థుల తరఫున వారి కుటుంబసభ్యులు కూడా రోడ్డెక్కడం ఆసక్తికరంగా మారింది.. భర్తలు, తల్లిదండ్రుల కోసం ఆయా కేండెట్ల ఫ్యామిలీ మెంబర్స్ సింహపురిలో సూర్య ప్రతాపాన్ని సైతం లెక్కచేయకుండా తిరిగేస్తున్నారు.

- Advertisement -

Nellore political news

నెల్లూరు జిల్లాలో ప్రధాన పార్టీల నుంచి పోటీలో ఉన్న అభ్యర్థుల విజయం కోసం వారి కుమారులు, కుమార్తెలు, కోడళ్ళు, ఇతర కుటుంబ సభ్యులు ప్రచారాన్ని వేగవంతం చేస్తున్నారు. ఇప్పటివరకు రాజకీయాలకు కొత్తే అయినా.. ఓటర్లను తమదైన శైలిలో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. నియోజకవర్గాల్లో సమస్యలను గుర్తిస్తూ వాటి పరిష్కారాన్ని తల్లిదండ్రుల తరఫున హామీ ఇస్తూ.. ఎప్పుడే అవసరం వచ్చినా మేమున్నామని భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు. నెల్లూరు జిల్లాలో దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో కుటుంబసభ్యులు ప్రచారం నిర్వహించడం ఆసక్తికరంగా మారింది.

Also Read: ఏపీలో ఎన్నికల తొలి అంకం, వారం రోజులు మాత్రమే

ఈ సారి రాష్ట్రంలోనే కాస్ట్లీ ఎలక్షన్స్ నెల్లూరులో జరుగుతున్నాయన్న టాక్ ఉంది. ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు నుంచి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఆ రాజ్యసభ మాజీ సభ్యుడికి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే మొదటిసారి  గత ఎన్నికల్లో వైసీపీకి పెద్దదిక్కుగా జిల్లాలో చక్రం తిప్పి పదికి పది అసెంబ్లీ స్థానాలు, ఎంపీ సీటు గెలుచుకునేలా చేసిన వేమిరెడ్డి.. ఈ సారి తానే బరిలో ఉండటంతో టీడీపీని అదే గెలిపించాలన్న పట్టుదలతో ఉన్నారు

అలాంటి నేతను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వైసీపీ కూడా బడా నేతనే రంగంలోకి దించింది. ఆ పార్టీలో జగన్ తర్వాత ప్రాధాన్యత కలిగిన నేతల్లో ఒకరు, రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి ఇక్కడి నుంచి పోటీలో ఉన్నారు … ఇద్దరూ బడాబాబులే అవ్వడంతో నెల్లూరు లోక్‌సభ సెగ్మెంట్ రాజకీయం అత్యంత ఖరీదైందిగా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదలా ఉంటే కావలి, కోవూరు, ఆత్మకూరు, సర్వేపల్లి, సూళ్లూరుపేట, నుంచి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలే పోటీ చేస్తున్నారు. ఇక టీడీపీ నుంచి 5 నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

రెండు పార్టీల నుంచి వారి తల్లిదండ్రుల గెలుపు కోసం వారసులతో పాటు కుటుంబ సభ్యులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. కోవూరు వైసీపీఅభ్యర్థి ప్రసన్నకుమార్ రెడ్డి తరఫున కొడుకు రజిత్‌కుమార్‌రెడ్డి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. టీడీపీ అభ్యర్థిని వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ కొడుకుఅర్జున్ రెడ్డి, కుమార్తె నీలిమారెడ్డి ప్రచారంలో పాల్గొంటున్నారు. నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకరరెడ్డిని, కోవూరు ఎమ్మెల్యేగా ప్రశాంతిరెడ్డిని గెలిపించాలని వారు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు.

అలాగే నెల్లూరు సిటీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్ధిగా పోటీలో ఉన్న మాజీమంత్రి నారాయణను గెలిపించుకోవడానికి కుమార్తెలు సింధూర, షరణిలు గడపగడప తిరుగుతున్నారు … వారితో పాటు తమ భర్తని గెలిపించాలని నారాయణ సతీమణి రమాదేవి. సిటీ వైసీపీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ సతీమణి నసీమా ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.

Also Read: సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ.. టీడీపీ నేతల్లో ఉత్కంఠ!

నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఫ్యామిలీ మెంబర్స్ ప్రచారం ఊపందుకుంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తరపున కుమార్తెలు లక్ష్మీ హైందవి, సాయి వైష్ణవి, శ్రీధర్ రెడ్డి సతీమణి సుజాత ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు .. ఉదయం నుంచి రాత్రి వరకు నిత్యం ప్రజల్లో ఉంటూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపీ ఆదాల ప్రభాకర్రెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయన కుమార్తె హిమ బిందురెడ్డి ప్రచారంలో స్పీడ్ పెంచుతున్నారు. నిత్యం ఓటర్లను కలుసుకుంటూ తన తండ్రి ఆదాలని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.

గూడూరులోనూ అభ్యర్థుల వారసులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాశం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి, కుమారుడు జస్వంత్ ఇప్పటికే పట్టణంలో ఇంటింటి ప్రచారాన్ని ఒక రౌండ్ పూర్తి చేశారు. సునీల్‌తో కలిసి సంధ్యారాణి మరోసారి ప్రజల్లోకి వెళ్తున్నారు. వైసీపీ నుంచి పోటీలో ఉన్న మురళీధర్ పట్టణంలో తన కుమారుడు రేవంత్ చక్రవర్తికి ప్రచార బాధ్యతలు అప్పగించారు. దాంతో వార్డుల్లో తిరుగుతున్న రేవంత్ చక్రవర్తి ప్రతి ఓటర్ని కలిసే ప్రయత్నం చేస్తున్నారు.

మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పోటీ పడుతున్న సర్వేపల్లిలో వారిద్దరి తరపున కుమారులు, కుమార్తెలు, కోడళ్ల కూడా రంగంలో దిగారు. ఎన్నికల షెడ్యూల్ కంటే ముందుగానే వారి వారసులు ప్రచారాన్ని మొదలు పెట్టడం విశేషం. కాకాణి గోవర్ధన్ రెడ్డిని మూడో సారి గెలిపించుకోవడనాకి కుమార్తె పూజితరెడ్డి గల్లీగల్లీ తిరిగేస్తున్నారు. మాజీ మంత్రి సోమిరెడ్డి కుమారుడు సోమిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఇప్పటికే రాజకీయాల్లో ఆయనకు చేదోడు, వాదుడుగా ఉంటున్నారు. ఆయన ఈ సారి తండ్రిని ఎలాగైనా గెలిపించుకోవాలని నియోజకవర్గంలో గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. కోడలు శృతి రెడ్డి కూడా ఎన్నికల ప్రచారంలో ముందుకు సాగుతూ తన మామ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని గెలిపించాలని ప్రచారం నిర్వహిస్తున్నారు.

ఉదయగిరిలో వైసీపీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్‌రెడ్డి గెలుపు కోసం తనయుడు అభినవరెడ్డి బ్రాహ్మణపల్లిలో మకాం వేసి మరీ ప్రచారాన్ని పరుగులెత్తిస్తున్నారు. ఇక నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్ధి విజయసాయిరెడ్డి గెలుపు కోసం కుమార్తె నేహారెడ్డి ఎండల్లో రొడ్డెక్కుతున్నారు ..ఇలా తల్లిదండ్రుల గెలుపు కోసం కుటుంబ సభ్యులు చేస్తున్న ప్రచారం జిల్లాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారింది… మరి ఈ ఫ్యామిలీ మెంబర్స్ కాన్వాసింగ్ ఎవరెవరికి ప్లస్ అవుతుందో చూడాలి

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News