జెన్‌జీని చాలా తక్కువగా అంచనా వేశానని తన అనుభవాన్ని చెప్పుకున్నారు కేటీఆర్. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఎప్పుడైతే జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ చేసిన ఆందోళన మోడీనే గడగడలాడించిన ఘటన చూసిన తరువాత ఒక్కసారిగా తన అభిప్రాయాన్ని మార్చుకున్నానని చెప్పుకొచ్చారు కేటీఆర్.
అప్పటి వరకు ఈ తరం యువతను చాలా తక్కువగా అంచనా వేశానని, ఎలాంటి బాధ్యత లేకుండా, గాలికి తిరిగే బాపతుగా లెక్కగట్టేవాడినని అన్నారు. సోషల్ మీడియాలో గడిపే తరంగా వారిని అంచనా వేశానన్నారు కేటీఆర్. కాక్రోచ్ పార్టీ చేపట్టిన ఉద్యమం తరువాత వారిలో ఉన్న యువశక్తి అనుకున్నది సాధించే వరకు వదలదని, ఎంతటి శక్తినైనా అది ఎదుర్కోనేందుకు వెనుకాడదనే విషయాన్ని తెలుసుకోగలిగానన్నారు. ‘అప్పట్నుంచే ఒక్కటే డిసైడయ్యాను. నేతలు ఎవరైనా, ఎక్కడైనా జెన్‌జీతో పెట్టుకుంటే ఖతమేనని.. అందుకే తాను జెన్జీలు చేసే ఏ ఉద్యమానికైనా మద్దతుగా నిలిచేందుకు డిసైడ్ అయ్యాన’ని అన్నారు.
వారి పట్ల గతంలో ఉన్న తన ఆలోచనను జంతర్‌మంతర్ ఉద్యమం పూర్తిగా మార్చేసిందన్నారు కేటీఆర్. అయితే జంతర్‌మంతర్ వద్ద ఉద్యమం జరిగేటప్పుడు.. ఇక్కడ హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద కూడా సీజేపీ ఆందోళన చేపట్టింది. దీనికి సంఘీభావం తెలిపారు కేటీఆర్. ఆ ఆందోళనలో కూర్చుని, తాము ఓ పార్టీగా ఢిల్లీకి వస్తే.. మీరు చేసే రాజకీయేతర ఉద్యమాన్ని మలినం చేసినవారమవుతామని, ఇలాగే ఒంటరిగానే విజయం సాధించాలని కోరారు.
ఆ తరువాత కొద్ది రోజులకే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో సీజేపీ ఆందోళన సక్సెసయ్యింది. ఆ తరువాత జెన్‌జీ ఉద్యమాల ప్రస్తావన రాలేదు. బీఆర్ఎస్ కూడా ఈ విషయంలో ఎలాంటి కామెంట్స్ చేయలేదు. ఆ తరువాత ఎస్ఐఆర్ విధానంలో స్వయంగా కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనరే ఉద్దేశ్యపూర్వక తప్పిదాలను ప్రవేశపెట్టారని తోటి కమిషనర్లు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో జెన్‌జీ మళ్లీ ఉద్యమ బాట పట్టింది. మరోసారి మోడీని భయపెట్టినంత పని చేశాయి బొద్దింకలు.
ఢిల్లీని మొత్తం స్తంభింపజేసింది కేంద్రం. అన్నింటినీ బంద్ చేసి జెన్ జీఉద్యమానికి తీవ్ర ఆటంకం కలిగించింది. అయినా ఆ పోరాటం కొనసాగింది చాలా రోజుల పాటు. కానీ కేటీఆర్ మాత్రం ఈ ఉద్యమం పట్ల చడీచప్పుడు చేయలేదు. సంఘీభావం తెలుపుతున్నట్టు కూడా ప్రకటించలేదు. ఇది కాంగ్రెస్ చేస్తున్న పోరాటంగానే చూడటమే దీనికి కారణంగా రాజకీయ విశ్లేషణలు రావడంతో.. ఆయన మళ్లీ తన స్టాండ్ మార్చుకోవాల్సి వచ్చింది.
ఇటీవల నిర్మల్ రైతు గర్జన సభలో బీజేపీ నేతలను తీరును తప్పుబడుతూ మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఓట్ చోరీపై చేస్తున్న ఆందోళనలకు బీజేపీ నేతలు ఎందుకు భయపడుతున్నారని, ర్యాలీలు తీయడం వెనుక ఏదో తప్పు జరిగిందనే అనుమానం కలుగుతుందనే విధంగా కామెంట్ చేశారు. మరి ఓట్ చోరీ పై క్లారిటీ వచ్చిన తరువాతైనా ఆయన తన పార్టీ ద్వారా ఉద్యమాలకు పిలుపునిచ్చారా? అంటే అలా చేయలేదు.
దేశ వ్యాప్తంగా ఆందోళన చేసినా.. ఒక్క బీఆర్ఎస్ మాత్రం దీనిపై సైలెంట్‌గా ఉండటాన్ని ఆ రెండు పార్టీల రహస్య ఒప్పందాల నేపథ్యమేననే ప్రచారమూ జరిగింది. అయితే ఇదే ఇంటర్వ్యూలో.. మీపైన కేంద్ర విచారణ సంస్థలు పెట్టిన కేసుల్లో పురోగతి లేకపోవడం వెనుక, బీజేపీతో మీకు మంచి దోస్తానా ఉందనే ప్రచారాన్ని ఎలా చూస్తారని అడిగిన ప్రశ్నకు కేటీఆర్ తప్పించుకునే దోరణిలోనే సమాధానమిచ్చారు. మోడీ, ఈడీ.. రెండింటినీ ఎదుర్కుంటానని, ఏం చేసుకుంటారో చేసుకోనీయండని పొంతన లేని ఆన్సర్ ఇచ్చారు.