తన మూడేళ్ల పరిపాలనకు వందకు 60 మార్కులేసుకున్నారు సీఎం రేవంత్‌రెడ్డి, ఇంకా మిగిలి ఉన్న రెండేళ్ల కాలంలో మరిన్ని మార్కులు సాధిస్తాననే నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఓ మీడియా కాంక్లేవ్‌లో పాల్గొన్న ఆయన.. వారు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలిచ్చారు.
గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో తొలి ఏడాదితో తనకు తానుగా 60 మార్కులేసుకున్నారు. తొలి ఏడాదే కాబట్టి ఫస్ట్ క్లాసు మార్కులే వేసుకుంటున్నానని, ఇంకా పాలన సమయం ఉన్నందున ఈ మార్కులను పెంచుకుంటూ పోతానని కూడా ఆయన కామెంట్ చేశారు. తొలిసారిగా సీఎంగా రేవంత్ పాలనకు మూడేండ్లు పూర్తయిన నేపథ్యంలో ఈ మార్కుల ప్రస్తావన వచ్చింది. రేవంత్ వందకు 60 మార్కులు వేసుకోవడంతో పాటు.. మరో రేండేళ్ల కాలంలో మార్కులు పెంచుకుంటానని కామెంట్ చేశారు.
దీనికి ముందు రోజే సిద్దిపేట బహిరంగ సభలో రేవంత్ ఈ అంశంపైనే ప్రజలకు నేరుగా అప్పీలు చేసుకున్నట్టుగా మాట్లాడటం, దీనికి అనుబంధంగా ఈ మార్కుల అంశం ప్రాధాన్యత సంతరించుకున్నది. సిద్దిపేటలో ఆయన మాట్లాడుతూ.. ‘ఇంకా చేయాల్సినవి చాలనే ఉన్నాయన్నారు. ఏం కావాలో నాతో నేరుగా చెప్పండి.. మీ అభిప్రాయాలను పంచుకోండి.. అన్నీ చేస్తాను..’ అని జనాన్ని కోరడం కూడా పార్టీపై పెరుగుతున్న వ్యతిరేకతను తగ్గించుకునే వ్యూహంలో భాగంగా చూస్తున్నారు.
ఇదే వేదికపై తన పార్టీ నేతల నుంచే వినిపిస్తున్న నిరసన గళంపై కూడా ఆయన తనదైన శైలిలో ఖండించారు. దీనికి బ్రేకులు వేసేలా మాట్లాడారు. మంచిని మైకు ముందు చెప్పాలి.. చెడు చెవిలో చెప్పాలి.. కానీ మావోళ్లు చెడును మైకు ముందు చెబుతున్నారని.. పరోక్షంగా వారి పనులు కావడం లేదనే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారనే విధంగా సీఎం కామెంట్స్ ఉన్నాయంటున్నారు.
అదే సమయంలో.. ఇలా సర్కార్‌ను ఇబ్బందుల పాలు చేసే విధంగా మాట్లాడే నేతలను ఎర్రగడ్డ లో వేసి మంచి ట్రీట్‌మెంట్‌ను కార్యకర్తలే ఇస్తారని కామెంట్ చేయడం పట్ల.. ఆ రెబల్ నేతల మాటలు పట్టించుకోవద్దనే విధంగా సీఎం మాట్లాడారు. కష్టపడి పార్టీని ప్రభుత్వంలోకి తీసుకొస్తే.. తినే కంచంలో మన్ను పోసుకున్న విధంగా ఆ నేతల కామెంట్స్ ఉన్నాయని, వీరి వ్యాఖ్యల ద్వారా అందరికీ నష్టం జరుగుతుంది కాబట్టి.. క్యాడర్ కూడా వీరిని వదిలిపెట్టొద్దనే ఒక సిగ్నల్ తో పాటు.. ఇలాంటి కామెంట్స్‌ను నేను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించను అనే విధంగా సాగిన ఆయన ప్రసంగం కొత్త చర్చకు తెర తీసింది.
కేసీఆర్ హయాంలో ప్రవేశ పెట్టిన పథకాలన్నీ అమలు చేస్తున్నామని కూడా ఈ వేదికగా జనాలకు వివరించే ప్రయత్నం చేశారు. ఇదే అంశంపై హరీశ్ కౌంటర్ ఎటాక్ చేశారు. చాలా పథకాలను సీఎం రేవంత్‌రెడ్డి బంద్ పెట్టించారని ఆరోపించారు. బడ్జెట్ లేదనే సాకుతో వారిచ్చిన హామీలకు దిక్కు లేకుండా పోయిందని, కేసీఆర్‌కు ఎక్కడ పేరు వస్తుందోననే భయంతో ఆయన పెట్టిన పథకాలు చాలా వరకు పెండింగ్‌లోనే ఉన్నాయని రేవంత్ తీరుపై దుమ్మెత్తిపోశారు హరీశ్.
మరోవైపు కేటీఆర్ కూడా పింఛన్ల విషయాన్ని జనాల్లోకి బాగా తీసుకుపోతున్నారు. ఇప్పుడు పెంచి ఇచ్చిన పింఛన్లు 4.6లక్షల పింఛన్లు తమ హయాంలో ఇచ్చినవేనని, వీటిని తీసేసి మళ్లీ ఇస్తున్నారని, అందుకే బడ్జెట్ మాత్రం పెరగలేదని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నాడు. అంతే కాదు, ఒకవేళ కేసీఆర్ సీఎం అయివుంటే.. ఇప్పటి వరకు 4వేల పింఛన్ వచ్చి ఉండేది కాదా? అని కూడా జనాల్లో కొత్త చర్చ వచ్చేలా మాట్లాడుతున్నాడు.
మూడేండ్ల తరువాత కూడా తనదైన పాలనపై , సంక్షేమ పథకాలపై విస్తృతంగా ప్రచారం చేసుకోలేని పరిస్థితుల్లో, ప్రతిపక్షాల ఆరోపణలకు ధీటుగా సమాధానం ఇవ్వలేని పరిస్థితుల్లో రేవంత్ సర్కార్ ఉందనే చర్చ జరుగుతోంది జనాల్లో. మరి మిగిలిన రెండేండ్ల సమయంలో ఈ మార్కుల అంశంలో పురోగతి ఉంటుందా? తిరుగోమనమేనా? అనే చర్చకు నాంది పలికినట్టైంది సీఎం రేవంత్ తాజా కామెంట్స్..