Peddapalli Congress: ఉత్తర తెలంగాణ రాజకీయాల్లో కీలకమైన ఉమ్మడి కరీంనగర్,ఆదిలాబాద్ జిల్లాల పరిధిలోని పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్‌లో ఇప్పుడు ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. అసెంబ్లీ,లోక్‌సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు ప్రదర్శించిన హస్తం పార్టీలో ఇప్పుడు ‘మంత్రి వర్సెస్ ఎంపీ’ ఎపిసోడ్ హాట్ టాపిక్‌గా మారింది.రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పెద్దపల్లి యువ ఎంపీ గడ్డం వంశీకృష్ణ మధ్య నెలకొన్న విభేదాలు, బహిరంగ లేఖల ఫైట్ ఇప్పుడు క్షేత్రస్థాయిలో కార్యకర్తల సస్పెన్షన్లు, పరస్పర విమర్శల వరకు వెళ్లడం పార్టీ అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది.
లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది రోజుల నుంచే మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ వంశీకృష్ణ మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. ఒకవైపు సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన సీనియర్ మంత్రి, మరోవైపు కాకా వెంకటస్వామి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చి తొలిసారే ఎంపీగా గెలిచిన యువ నేత మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది.నియోజకవర్గ పరిధిలో ఏ కార్యక్రమం జరిగినా ఇరువురు నేతలు ఎడముఖం పెడముఖంగా ఉండటం, మంత్రితో పాటు స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం ఎంపీకి దూరంగా ఉంటున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.వీళ్లిద్దరి మధ్య ఫైట్..లోకల్ కేడర్ కు వార్ గా మారింది.
ఇటీవల మల్హర్ మండలం వల్లెంకుంటలో విశాఖ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు స్కూల్ బ్యాగుల పంపిణీ కార్యక్రమానికి ఎంపీ వంశీకృష్ణ హాజరయ్యారు. ఆ కార్యక్రమానికి స్థానిక ఉపసర్పంచ్, వార్డు మెంబర్‌తో పాటు మరికొందరు కాంగ్రెస్ నేతలు హాజరుకావడమే వివాదానికి ఆజ్యం పోసింది. ఎంపీ పర్యటన ముగిసిన మరుసటి రోజే ఆ నలుగురు నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ మండల నాయకత్వం నిర్ణయం తీసుకోవడం కలకలం రేపింది. దీనిపై తీవ్రంగా స్పందించిన ఎంపీ వంశీకృష్ణ, నేరుగా మంత్రి శ్రీధర్ బాబును ఉద్దేశించి బహిరంగ లేఖలు సంధించడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. “20 ఏళ్లుగా పార్టీకి సేవ చేసిన కార్యకర్తలకు ఇచ్చే బహుమానం ఇదేనా? పేద విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంచడం తప్పా?” అంటూ ఎంపీ సూటిగానే ప్రశ్నించారు. అంతేకాకుండా, ఢిల్లీలో జరిగిన పార్టీ కార్యక్రమానికి గైర్హాజరైన ఎమ్మెల్యేలపై లేని చర్యలు, సామాన్య కార్యకర్తలపై ఎందుకని ఎంపీ వేసిన సెటైర్లు అగ్గికి ఆజ్యం పోశాయి.
Also read: సెన్సార్ పూర్తి చేసుకున్న నాగచైతన్య ‘వృషకర్మ’ .. ఏ సర్టిఫికెట్ వచ్చిందంటే?
ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో తనకు కనీస ప్రోటోకాల్ దక్కడం లేదని ఎంపీ వంశీకృష్ణ వర్గం తీవ్ర అసహనంతో ఉంది. ఇటీవల ఒక ప్రభుత్వ కార్యక్రమానికి ఎంపీ హాజరై రెండు గంటల పాటు వేచి చూసినా, స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే గానీ, జిల్లా కలెక్టర్ గానీ హాజరుకాకపోవడం వివాదాన్ని మరింత పెంచింది. జిల్లా యంత్రాంగం సైతం మంత్రి కనుసన్నల్లోనే పనిచేస్తోందని, ఎంపీ సూచనలను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఫలితంగా ఎంపీ నిధులతో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు, ప్రోటోకాల్ వ్యవహారాలకు అడుగడుగునా బ్రేకులు పడుతున్నాయని ఆయన అనుచరులు మండిపడుతున్నారు.
ఈ విభేదాలు కాస్తా ఇప్పుడు సామాజిక వర్గాల మధ్య అగాధంగా మారుతుండటం ఆందోళన కలిగిస్తోంది.దళిత సామాజిక వర్గానికి చెందిన ఒక యువ ఎంపీ క్షేత్రస్థాయిలో బలపడుతుండటాన్ని, ఆయన ఎదుగుదలను ఓర్వలేకనే అగ్రవర్ణ నాయకత్వం అణచివేసే ప్రయత్నం చేస్తోందని వంశీ వర్గీయులు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు, మంత్రి శ్రీధర్ బాబు వర్గీయులు ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నారు. నిబంధనల ప్రకారమే ప్రోటోకాల్ పాటిస్తున్నామని, పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి, స్థానిక ఎమ్మెల్యేలను కాదని సొంత గ్రూపులను ప్రోత్సహిస్తున్నందుకే చర్యలు తప్పడం లేదని కౌంటర్ ఇస్తున్నారు.
ఇద్దరు అగ్రనేతల మధ్య సాగుతున్న ఈ ‘కోల్డ్ వార్’స్థానిక నాయకులు, కార్యకర్తలను తీవ్ర గందరగోళంలో పడేసింది.మంత్రి కార్యక్రమాలకు వెళితే ఎంపీ వర్గం గుర్రుమంటోందని, ఎంపీ వెంట నడిస్తే సస్పెన్షన్ వేటు పడుతోందని క్షేత్రస్థాయి కేడర్ వాపోతోంది.ఇప్పటికే మంచిర్యాల, దండేపల్లి వంటి ప్రాంతాల్లో ఎంపీ ఫ్లెక్సీలు చింపివేయడం, ఇరువర్గాల అనుచరులు బాహాబాహీకి దిగడం వంటి ఘటనలు శాంతిభద్రతల సమస్యకు దారితీశాయి.మరోవైపు ఎంపీ తండ్రి,రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి సైతం తన కుమారుడికి మద్దతుగా నిలవడం,సస్పెండ్ అయిన నేతలు నేరుగా టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌ను కలిసి ఫిర్యాదు చేయడంతో ఈ పంచాయితీ గాంధీభవన్ గడప తొక్కింది.మంత్రి శ్రీధర్ బాబు సైతం ఎంపీ వ్యవహారశైలిపై పీసీసీ చీఫ్‌కు వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.