Ashok Gajapathi Raju: సుదీర్ఘ రాజకీయ అనుభవం ఆయన సొంతం.. సొంత పార్టీలో తిరుగులేని నేతగా ఎదిగిన ఆయన అనుభవించని పదవులు లేవు. రాష్ట్రంలో, కేంద్రస్థాయిలో చక్రం తిప్పిన చరిత్ర ఆయనది. నాలుగు దశాబ్దాల పొలిటికల్ కేరీర్‌లో ఒక అవినీతి మరక కూడా అంటని లీడర్. అలాంటాయన గత ఎన్నికల్లో పోటీకి దూరమయ్యారు. తనకి తానుగా ప్రత్యక్షరాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఆ నాయకుడి పేరు ఇప్పుడు మళ్లీ ప్రత్యేకంగా ఫోకస్ అవుతుంది. ఒక ప్రత్యేక పదవి రేసులో వినిపిస్తుంది. ఇంతకీ ఎవరా పెద్దాయన? ఆయనకు దక్కనున్న పదవి ఏది?
గవర్నర్ గిరీ కట్టబెడతారా?
పూసపాటి అశోక్ గజపతిరాజు.. రాష్ట్ర మాజీ మంత్రిగా , కేంద్ర మాజీ మంత్రిగా పనిచేసిన ఆయన పేరు రాష్ట్ర రాజకీయాల్లో తెలియని వారుండరు. రాజకీయాల్లో అవినీతి ఆరోపణలు లేని నాయకుడు.. టీడీపీ లాంటి 40 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీలో గత ఎన్నికల వరకు ఆయనే నంబర్ 2 గా కొనసాగారు. ఎన్టీఆర్ హయాంలోనూ.. తర్వాత చంద్రబాబు దగ్గర ఆయన మాట అంతలా చలామణి అయ్యేది. రాజకీయాల్లో అవినీతి మచ్చలేని నాయకులలో ముందు వరుసలో ఉండే పేరు అశోక్ గజపతిది.
ప్రజల సొమ్మును ప్రజల కోసమే ఖర్చు చేయాలన్నదే ఆయన ప్రాధమిక సూత్రం. మొన్నటి ఎన్నికల నుండి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ అశోక్ గజపతి గురించి చర్చ జరగని రోజు లేదంటే అతిశయోక్తి కాదు . రాజు గారికి రాజ్యసభ ఇస్తారంట కదా.. రాజుగారిని రాజ్యసభకి పంపించి కేంద్ర మంత్రిని చేస్తారంట కదా అనే చర్చ జరుగుతూనే ఉంది. రాజ్యసభ , కేంద్ర మంత్రి చర్చ నుండి ఇపుడు మరో చర్చ తెరమీదకి వచ్చింది.
రాజు గారి నిజాయితీకి , ఆయన మేధస్సుకి గవర్నర్ గిరే సరైందనే అభిప్రాయం వ్యక్తమవుతోందట . ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఉన్న సాన్నిహిత్యంతో రాజుని అందలం ఎక్కించాలనే ఆలోచనలో ఉన్నారట . ప్రత్యక్ష రాజకీయాలనుండి తప్పుకున్నారు కాబట్టి గవర్నర్ అయితేనే ఆయనకి సరైన గౌరవం అని భావిస్తున్నారట . దానికి రాజ్యాంగంపై అశోక్ గజపతికి ఉండే గౌరవం కూడా ఒక కారణం అయిఉండవచ్చని అంటున్నారు. అలాంటి వ్యక్తే ఆపదవికి అర్హుడు అన్న చర్చ కూడా జరుగుతోందట.
Also Read: పవన్ దెబ్బ.. కాకినాడ కి ద్వారంపూడి గుడ్ బై..?
మరో పక్క ఈ పదవికి మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు పేరు కూడా వినిపిస్తున్నప్పటికీ చంద్రబాబు, ఇతర సీనియర్లు, బీజేపీ నాయకులు సైతం అశోక్ వైపే మొగ్గు చూపుతున్నారట . మొదటి నుండి చంద్రబాబుకి రాజకీయాల్లో అశోక్ గజపతి అత్యంత సన్నిహితుడు .. వైశ్రాయ్ ఘటన నుండి చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడం వరకు అశోక్‌గజపతి కూడా కీలక సూత్రధారే. అయినప్పటికీ ఏనాడూ నాకీ పదవి కావాలని , ఫలానా వాడికి ఫలానా పదవి ఇవ్వండి అని ఆయన అడగలేదన్న గౌరవం చంద్రబాబుకి ఉందంట.
ముచ్చటగా మూడో సారీ మోడీ ప్రభుత్వం కేంద్రంలో కొలువుదీరడంలో టీడీపీ కీలక పాత్ర పోషించింది . అందుకు కృతజ్ఞతగా టీడీపీకి ఒక గవర్నర్ పోస్టు కేటాయించాలని యోచిస్తోందట మోడీ సర్కార్ .. కేంద్ర మంత్రిగా పనిచేసిన అశోక్‌గజపతి రాజంటే మోడీకి కూడా ఎంతో గౌరవం. అందుకే అశోక్ గజపతి పేరు ప్రతిపాదిస్తే కేంద్ర పెద్దల నుంచి ఎలాంటి అభ్యంతరం ఉండదని చంద్రబాబు భావిస్తున్నారంట. గత ఎన్నికల్లో విజయనగరం ఎంపిగా పోటీ చేయాలని పార్టీ ఒత్తిడి తెచ్చినా .. కొత్తవారికి అవకాశం ఇవ్వాలని , తమ వయసుకి ఇక రాజకీయాలు సరైనవి కావని నిర్మొహమాటంగా చెప్పేశారు అశోక్ గజపతి . ఇప్పటికీ ఆయన కోరుకుంటే కేంద్రమంత్రి పదవి పెద్ద విషయం కాదంటారు.
కానీ ఆయన ఏనాడూ పదవులకోసం వెంపర్లాడలేధు . పార్టీ లైన్ కూడా దాటలేధు . పార్టీ నిర్ణయం ఆయనకి శిరోధార్యం . ఆయన కుమార్తె అదితి ఎమ్మెల్యే అయినప్పటికీ ఆమె వ్యవహారాలలో ఇప్పటికీ తలదూర్చరు. అడిగితే సలహాలు ఇవ్వడం మాత్రమే ఆయనకి తెలుసు . తన కుమార్తె రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయన చెప్పిన మాటలు ఆయన మనస్తత్వానికి అద్దం పడతాయి. రాజకీయాలు అంటే చెత్త బుట్ట లాంటివని, అందులో కోతి గెంతులు వేస్తే ఆ చెత్త ఊరంతా పాకుతుందని వ్యాఖ్యానించారాయన. ఇలాంటి నేచర్ ఉండబట్టే ఇప్పటికీ గెలుపోటములతో సంబంధం లేకుండా అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారనడంలో సందేహం లేదు.
అదలా ఉంటే మరో చర్చ కూడా ఉంది . అశోక్ కి ఇప్పటికే టీటీడీ ఛైర్మన్ ఆఫర్ వచ్చిందని ఆయనే వద్దనుకున్నారనే ప్రచారం ఉంది . మానసాస్ ట్రస్ట్ కి ఛైర్మన్ గా ఉండడం , అందులో 108 దేవాలయాలకు అనువంశిక ధర్మకర్తగా ఉండడంతో ఆయన టీటీడీ పదవిని వద్దన్నారట . మరి ఇపుడు అదే రీజన్ తో ఒకవేళ నిజంగా గవర్నర్ పదవి ఆఫర్ వస్తే నో అంటారో లేక ఎస్ అంటారో అన్న చర్చ జరుగుతుంది. రాజుగారు రాజ్ భవన్ కి వెళ్తే మాత్రం ఆ పదవికి వన్నె తీసుకురావడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది