తాము చేస్తే తెలంగాణ కోసం.. రాజకీయ పునరేకీకరణ కోసం.. అదే అవతలి పార్టీ చేస్తే ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు.. అన్యాయం. తెలంగాణ ఏర్పడిన తరువాత ఎమ్మెల్యేలను ఎడాపెడా కొనుగోలు చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది కేసీఆరే. అప్పుడు కేసీఆర్ ఏది చెబితే అదే. ఆయన ఏం చేసినా తెలంగాణ కోసమేననే నినాదాన్ని బలంగా జనంలోకి తీసుకెళ్లగలిగింది ఆ పార్టీ. తెలంగాణ సాధించిన ఉద్యమ నాయకుడిగా జనం కూడా కేసీఆర్ నిర్ణయాలను పెద్దగా వ్యతిరేకించలేదు.
రెండోసారి సీఎంగా అయిన తరువాత.. ప్రతిపక్షమే లేకుండా చేసేశారు కేసీఆర్. దీనికి ఆయన పెట్టిన పేరు రాజకీయ పునరేకీకరణ. రెండోసారి ఆ పార్టీకి వచ్చిన మొత్తం సీట్లు.. 88. ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ సీట్లు 60. కానీ కేసీఆర్ మాత్రం కాంగ్రెస్ ఎమ్మెల్యేల పై కన్నేశారు. మొత్తం 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలుంటే.. అందులో 2/3 మంది ఎమ్మెల్యేలు.. అంటే 12 మందిని లాగేశారు కేసీఆర్. ఇక్కడే లాజికల్‌గా ఆలోచించారు కేసీఆర్.
ఒకరిద్దరిని లాగితే అనర్హత అంశం తెరపైకి వస్తుంది. అందుకే.. ప్రతిపక్షాన్నే లేకుండా చేయాలనే వ్యూహం పన్నారు. సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కాలంటే కనీసం 10% అంటే.. 12 సీట్లు ఉండాలి. కాంగ్రెస్ నుంచి 12 మందిని లాగేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదాను కోల్పోయింది. సభలో ప్రశ్నించే బలమైన గొంతుక లేకుండా చేయడం దీని ప్రధాన ఉద్దేశం. ఫిరాయింపు నిరోధక చట్టం నుండి మినహాయింపు పొందేలా 2/3వ వంతు వ్యూహాన్ని ప్రయోగించి సక్సెసయ్యారు కేసీఆర్.
వాస్తవానికి అప్పుడు కేసీఆర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేల అవసరం ఏమాత్రం లేదు. కేసీఆర్ కు సభలో అడ్డు చెప్పేవారుండొద్దు. ఆయన నైజం తెలిసిన నేతలెవరైనా చెబుతారు ఈ విషయాన్ని. ఆయనను ఎదిరించి మాట్లాడేవారంటే ఇష్టం ఉండదు. బహిరంగ సభల్లోనే జనం నుంచి పిన్ డ్రాప్ సైలెన్స్‌ను కోరుకునే తత్వం ఆయనది. తను ప్రసంగిస్తుంటే ఏ కొంచెం శబ్దం వచ్చినా.. చికాకు పడతారు. మరి అసెంబ్లీలో తను మాట్లాడుతున్నప్పుడు అంతా చేతులు కట్టుకుని వినాలి. బల్లలు చరిచి బలపరచాలి. మరి ప్రతిపక్షం బలంగా ఉంటే అది సాధ్యం అవుతుందా?
ఇప్పుడు కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి రాకపోవడానికి కూడా ఆయనలో ఉన్న ఈ మనస్తత్వమేనని చెబుతారు. ఇక రేవంత్ సర్కార్ పరిస్థితి దీనికి కొంచెం భిన్నం. కాంగ్రెస్ 64 సీట్లతో అధికారాన్ని చేజిక్కించుకుంది. బీఆర్‌ఎస్ 39 మంది ఎమ్మెల్యేలతో ప్రతిపక్షంలోకి పడిపోయింది. ఎంఐఎం 7, మిత్రపక్షం సీపీఐ 1తో కలిపి 72 కు చేరుతుంది బలం. కానీ ఎక్కడో రేవంత్ సర్కార్‌కు భయం. దీనికి తోడు అధికారం ఎటుంటే.. అటు జంప్ అయ్యే బ్యాచ్ ఉండనే ఉంది.
అందుకే బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌కు వరుస కట్టారు. ఓ పది మందిని రేవంత్ ఆహ్వానించారు. కానీ ఇక్కడ 2/3 వ్యూహం రేవంత్‌కు కుదరని పని. అది కనిపెట్టిన బీఆర్‌ఎస్.. పార్టీ ఫిరాయింపు కింద ఆ పది మందిపై అనర్హత వేటు వేయాలని కోర్టు మెట్లెక్కింది. స్పీకర్ కు ఉన్న విచక్షణాధికారం వినియోగించి.. ఆ పదిమంది పార్టీ మారినట్టు ఎలాంటి ఆధారాలు లేవని తేలిగ్గా తీర్పునిచ్చేశారు. దీనిపై మళ్లీ మళ్లీ కోర్టుకెక్కింది బీఆరెస్. కోర్టు స్పీకర్ తీర్పుకే కట్టుబడి ఉంది. కానీ దానం నాగేందర్ విషయంలో ఇరుక్కుపోయింది సర్కార్. సికింద్రాబాద్ ఎంపీగా అవకాశం ఇవ్వడమే రేవంత్ చేసిన పొరపాటు. అదే టెక్నికల్‌గా పక్కాగా దొరికేలా చేసింది.
ఇంత బాజాప్తాగా కనిపిస్తున్నా.. ఎందుకు వేటు వేయొద్దనే కోణంలో తన పరిధిలో ఉన్న విచక్షణాధికారాన్ని వినియోగించి దానంపై వేటు వేసింది హైకోర్టు. స్పీకర్ ఇచ్చిన తీర్పు కరెక్టు కాదని తెలిసినా.. జనం సర్దుకుపోయారు. ఎందుకంటే..అప్పుడు కేసీఆర్ కూడా చేసింది ఇదే కదా అని. కానీ దానం విషయంలోనైనా సర్కార్ ఉప ఎన్నికకు పోవాల్సింది అని మెజారిటీ జనం అభిప్రాయపడ్డారు. చివరకు కోర్టు కూడా అదే అభిప్రాయపడింది.
ఉప ఎన్నికకు పోవడం పట్ల రేవంత్ సర్కార్ ఒకవేళ విముఖంగా ఉంటే.. సుప్రీం మెట్లెక్కే అవకాశమూ ఉంది. కానీ దీనికి జనం నుంచి మద్దతు లభించే అవకాశాలు బాగా తక్కువ. పైగా బద్నామయ్యే చాన్స్ ఉందంటున్నారు. అందుకే ఉప ఎన్నికకు పోవడం.. జూబ్లీహిల్స్ తరహా గెలుపు వ్యూహం అమలు చేయడమే ప్రస్తుతం ప్రభుత్వం ముందున్న కర్తవ్యంగా కనిపిస్తోంది.