Tamil Sports Emotional Drama: పరుగెత్తడమే అతని బలం. దేశం కోసం పతకం సాధించడమే అతని కల. కానీ ప్రతిభ కంటే డబ్బు, పరిచయాలు, కుల రాజకీయాలకే విలువ ఉన్న వ్యవస్థలో ఒక పేద కుర్రాడు ఛాంపియన్ కావాలంటే… తనపై చేయని తప్పును మోపి రెండేళ్ల పాటు ఆటకు దూరం చేస్తారు. అంతా అయిపోయిందనుకున్న సమయంలో కోచ్ ఇచ్చిన ధైర్యంతో మళ్లీ అతను ట్రాక్ పైకి వస్తే ? తన కల కోసం సిస్టమ్ తోనే పోరాడే ఓ అథ్లెట్ ప్రయాణమే ‘అంగీకారం’ (Angikaaram). మరి ఈ తమిళ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? కథ ఏంటి ? అనేది తెలుసుకుందాం.
మురికివాడలో పేదరికం మధ్య పెరిగిన శివకు చిన్నతనం నుంచే పరుగెత్తడంపై ఆసక్తి ఉంటుంది. ఇతర పిల్లలు ఆటను సరదాగా తీసుకుంటే… శివ మాత్రం దాన్నే తన భవిష్యత్తుగా చూస్తాడు. ఒకరోజు జాతీయ స్థాయిలో పతకం సాధించి తన కుటుంబ పరిస్థితిని మార్చాలనేది అతని కల. కానీ స్పోర్ట్స్ ప్రపంచంలోకి అడుగు పెట్టిన తర్వాత అతనికి మరో నిజం తెలుస్తుంది. ప్రతిభ ఒక్కటే సరిపోదు. స్పోర్ట్స్ అసోసియేషన్ లోని రాజకీయాలు, ఒత్తిళ్లు, ధనవంతుల పిల్లలకు దక్కే ప్రత్యేక అవకాశాలు అతని ముందున్న దారిని మరింత కష్టంగా మారుస్తాయి.
అయినా శివ వెనక్కి తగ్గడు. శిక్షణలో కష్టపడుతూ పెద్ద పోటీలకు సిద్ధమవుతుంటాడు. అదే సమయంలో అతని ఎదుగుదల కొందరికి నచ్చదు. కీలకమైన సమయంలో శివపై డోపింగ్ చేసినట్టు ఆరోపణ వస్తుంది. తాను చేయని తప్పుకు అతనే బాధ్యుడిగా నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. విచారణ పూర్తయ్యేలోపే అతని కెరీర్ కు భారీ దెబ్బ తగులుతుంది. రెండేళ్ల పాటు రన్నింగ్ పోటీల నుంచి నిషేధం విధించడంతో శివ ప్రపంచమే ఒక్కసారిగా కూలిపోయినట్టవుతుంది. ఒక అథ్లెట్‌కు రెండు సంవత్సరాలు ఎంత పెద్ద గ్యాప్ అనేది అతనికి తెలుసు.
శరీరం మాత్రమే కాదు… మనసు కూడా క్రమంగా ఓడిపోతుంది. శివలో నిరాశ పెరుగుతుంది. తాను తిరిగి ట్రాక్‌పైకి రాగలనా? తనపై పడిన మచ్చ ఎప్పుడైనా పోతుందా? అనే ఆలోచనలు అతన్ని వెంటాడుతుంటాయి. అలాంటి సమయంలో అతని కోచ్ మాత్రం శివను వదిలిపెట్టడు. మళ్లీ శిక్షణ మొదలుపెట్టేలా ప్రోత్సహిస్తాడు. తనపై జరిగిన అన్యాయాన్ని కేవలం బాధగా మిగల్చకుండా చట్టపరంగా కూడా పోరాడాలని శివ నిర్ణయించుకుంటాడు. కోర్టు పోరాటం ఒకవైపు కొనసాగుతుంటే… మరోవైపు అతని ముందుకు అనుకోని అవకాశం వస్తుంది.
వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అంతర్జాతీయ ఒలింపిక్స్ ట్రయల్స్ లో పాల్గొనే ఛాన్స్ అతని జీవితంలో మరో ఆశను తీసుకొస్తుంది. కానీ అక్కడ కూడా అతనికి ఎదురయ్యే సవాళ్లు చిన్నవి కావు. గతంలో తనను అడ్డుకున్న వాళ్లతో పాటు తనపై నమ్మకం కోల్పోయిన ప్రపంచానికి కూడా శివ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మరి శివ తనపై వచ్చిన ఆరోపణను ఎలా ఎదుర్కొంటాడు ? ట్రాక్ పై మళ్లీ తన స్థానాన్ని సంపాదించగలడా ? అతని కల నిజమవుతుందా ? చివరి రేసులో అతని పట్టుదల గెలుస్తుందా ? ఇవన్నీ తెలుసుకోవాలంటే ‘అంగీకారం’ చూడాల్సిందే.
‘అంగీకారం’లో విక్రమ్ ప్రభు (Vikram Prabhu), ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) ప్రధాన పాత్రల్లో నటించారు. ఎస్.యు. అరుణ్ కుమార్ (S. U. Arun Kumar) దర్శకత్వం వహించిన ఈ స్పోర్ట్స్ ఎమోషనల్ డ్రామా సన్ నెక్స్ట్ (Sun NXT)లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం తమిళ ఆడియోలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు డబ్బింగ్ లేదు. క్రీడల వెనుక ఉండే రాజకీయాలు, ఆటగాడి పోరాటం, ఎమోషన్ తెలుసుకోవాలి అనుకుంటే ఈ సినిమాను డోంట్ మిస్.
Read Also: పచ్చని సంసారంలో నిప్పులు పోసే కేర్‌టేకర్.. డార్క్ సీక్రెట్స్ తో దడ పుట్టించే థ్రిల్లర్