ఆయన భూస్వామి కుటుంబంలోనే పుట్టి ఉండొచ్చు. వందల ఎకరాలు ఆయన తండ్రికి ఉండి ఉండవచ్చు. కానీ కేసీఆర్ మాత్రం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటు చేసిన తొలినాళ్లలో విపరీతమైన పేదరికాన్ని చవి చూశారు. ఇది ఆయన్ను దగ్గరగా చూసినవాళ్లు.. తనతో సన్నిహితంగా మెలిగిన వాళ్లు చెప్పిన మాటలు. పెట్రోల్ ఖర్చులకు కూడా ఉండకపోయేదనే విషయాన్ని ఇప్పటికీ చెప్పుకుంటారు అప్పుడు దోస్తానా చేసిన కొందరు. అప్పుడు కేసీఆర్‌తో కలిసి తిరిగిన వాళ్లు చాలా మంది ఆయనకు దూరమయ్యారు.
అందుకే ఆయన గురించి, ప్రత్యేకించి అప్పటి సంగతుల గురించి తెలిసినవాళ్లు పెద్దగా లేరనే చెప్పాలి. కానీ కేసీఆర్ కడు పేదరికాన్ని చవిచూసిన వైనాన్ని ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు కొందరు. పార్టీ పెట్టిన తొలినాళ్లోలో కరీంనగర్‌లో భారీ బహిరంగ సభ పెట్టాలని ఆలోచన చేసినా.. చేతిలో చిల్లిగవ్వ లేదు కేసీఆర్ దగ్గర. మిగిలిన తన ఆస్తుల్లో మెయినాబాద్ వద్ద ఉన్న తోటను అమ్మేశారని చెబుతారు.
ఇది అమ్మడం వల్ల వచ్చిన రూ. 70 లక్షలను అప్పుడు సభకు ఖర్చు చేశారనే విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు పైసలు జమ చేసుకుని, పార్టీ కార్యక్రమాలు, సభలు, సమావేశాలు నిర్వహించే పరిస్థితే అప్పుడు ఉండేదంటున్నారు. ఎక్కడా పైసా పుట్టకపోతే ప్రైవేటు వ్యక్తుల వద్ద వడ్డీకి… అదీ నూటికి పది రూపాయల మిత్తీకి తీసుకున్న సందర్బాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు.
నమస్తే తెలంగాణ ఎండీ, రాజ్యసభ సభ్యుడు దీవకొండ దామోదర్ రావు కూడా అప్పుడు మిత్తీలకు అప్పులు ఇచ్చేవాడట. ఆయన కూడా కేసీఆర్‌కు పది రూపాయల మిత్తీకి పైసలు ఇచ్చారని చెబుతున్నారు. పలు సందర్బాలలో సమయానికి కేసీఆర్ పైసలు కట్టకపోతే.. గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చాడట దీవకొండ. అప్పిచ్చిన మరో ప్రైవేటు వ్యక్తి .. తన అప్పు తీర్చని కేసీఆర్ ఇంటి ముందు టెంట్ వేసేందుకు కూడా రెడీ అయ్యాడట.
నందినగర్‌లో ఆయన అప్పుడే ఇల్లును స్టార్ట్ చేశారని చెబుతున్నారు. ఇంకా అది సంపూర్ణం కాకముందే టీడీపీని వీడటం.. కొత్తగా టీఆర్‌ఎస్ పార్టీని పెట్టడం ఆ సమయంలో తీవ్ర పేదరికాన్ని అనుభవించడాన్ని దగ్గరగా ఉన్న నేతలు ఇప్పటికీ చెప్పుకుంటారు. అప్పటికప్పుడు కేసీఆర్‌కు పైసలు సమకూర్చడం.. మధ్యవర్తిగా హరీశ్ రావు.. మాట్లాడి వాటిని కేసీఆర్‌కు అందించడం.. ఇది అప్పుడు నిత్య కృత్యమంటున్నారు.
సారు.. దగ్గర పైసలు లేవే.. కొన్ని పైసలు సమకూర్చరాదే.. అని మొదట హరీశ్ ఫోన్ చేస్తాడు. అక్కడి నుంచి సానుకూలంగా రిప్లై రాగానే .. తనే వెళ్లి ఆ పైకాన్ని తీసుకురావడం కేసీఆర్‌కు, పార్టీ కార్యకలాపాలకు ఆ మొత్తాన్ని వాడేవాడట. వందల ఎకరాల ఆసామి కుటుంబంలో పుట్టిన కేసీఆర్‌కు ఈ తీవ్ర పేదరికం ఎందుకుండెనో.. ఆ భూములు లేకనా? అమ్మేసుకున్నారా? అసలు కేసీఆర్ పేరు మీద ఆస్తులు పెద్దగా లేకుండెనా? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఒక్క కేసీఆర్‌కే తెలుసు.