కేసీఆర్‌కు ఆస్తులు ఇవాళ కొత్తా..? ఆయన పుట్టిందే రెండెకరాలున్న ఇంటిలో. తండ్రి పెద్ద భూస్వామి. వందల ఎకరాల ఆసామి. ఆఫ్ట్రాల్ ఫామ్‌హౌజ్ భూములకే ఇంత రాద్దాంతమా? నీ లెక్క దిక్కులేని కుటుంబంలో పుట్టినడునుకుంటున్నవా? నువ్వెంత..? నీ లెక్కెంత.. ?
గోడలకు పెయింటింగులేసుకునేటోడివి నువ్వు. పుట్టుకతోనే శ్రీమంతుడు మా బాపు. బాపెక్కడ.. బాపు కాలిగోటికి కూడా కొరగాని నువ్వెక్కడ? నీ గురించి.. బాపు గురించి ఎవరినడిగినా కతలు కతలుగా.. బుర్ర కథలుగా చెప్పుకుంటారు. ఎవరి కతలు ఏంటివో అందరికీ తెలుసు. నీ చదువేందీ? మా చదువేందీ? నీ కులమేందీ? మా కులమేందీ…? మా వంశమేందీ…? మా స్టామినా ఏందీ? నీ స్థాయేందీ…? రా చూసుకుందాం. తేల్చుకుందాం రా..మా లెక్కలెందో.. నీ బొక్కలేందో..?
తెలంగాణ కోసం పాణాలిచ్చేంత పోరాడితే.. భూముల లెక్కల బొక్కలు తీస్తవా..? అయితే తియ్.. బాపు పుట్టిన కాడ్నుంచి.. నువ్వు పుట్టిన కాడ్నుంచి.. ఎవరికెన్ని ఆస్తులున్నయో.. తేల్చుకుందాం రా.!
బాపు పుట్టిన రెండెకరాలు ఇంటిని కూడా దానం చేసేసిండు. నువ్వేం దానం చేసినవో చెబుతావా? బాపుకు, బాపు బాపుకు, తాతకు, తాత తాతలకు ఎన్నో వందల ఎకరాలు.. లెక్కలేనన్ని. లెక్కకు దొరకనన్ని. రా లెక్కలు తీద్దువు గానీ.
కానీ ఇప్పుడు సొంతంగా ఇల్లు లేదు. అంతటి పేదోడు. జనం కోసం అన్ని అర్పించిన త్యాగశీలి. జాతిపిత. బాపు. ఆ బాపు ఎక్కడ? నీ బలుపెక్కడ..? సొంతిల్లు కూడా సరిగ్గా లేదని.. అలా ఊరికి అవతల ఓ ఫామ్‌హౌజుల సేద తీరుతుంటే నీ కళ్లు మండినయా? నువ్వేమో జూబ్లీహిల్స్ ప్యాలెస్‌ల కులుకుతవా? మా బాపు ఊరవతల కూడా ప్రశాంతంగా కునుకు తీయొద్దా…?
మేమంతా ఒక్కదగ్గర కలిసి ఉంటందుకు కూడా సక్కగ ఓ ఇల్లు లేదు. అందుకే నేనీడ.. ఆయనాడ.. గుట్టకొకళ్లం.. పుట్టకొక్కళ్లం లెక్క మేం దూరమై.. బతుకు భారమై.. జనం బాగు కోసం.. ప్రజా సేవ కోసం భారంగా బతుకీడుస్తుంటే.. మా బంగారు పుట్టల వేలు పెడతవా?
అసలు నువ్వు ఎప్పుడు పుట్టినవో తెలుసా? ఏం చదివినవో తెలుసా..? నీ తమ్ముండ్లు సంపాదించిన సొమ్మెంతో చెప్తావా..? అసలు నువ్వేం మాట్లాడుతున్నవో నీకైనా తెలుస్తుందా? నువ్వో అపరిచితుడివి. నువ్వో సన్నాసిగానివి. హౌలాగానివి.
శ్రీమంతుడైన బాపు.. పేదరికంలో ఉండి.. బాధలు పడి మళ్లీ శ్రీమంతుడైతే నీకు కడుపు మంట. నువ్వు కడు పేదరికంలో ఉండి.. శ్రీమంతుడెట్లైనవు? శ్రీమంతుడు మా బాపు. నడిమంతరపు సిరి నీది. ఎప్పటికైనా సిరి సంపదలు మావి. మా జాతే సిరి సంపదలతో తలతూగే జాతి. అయినా ఇప్పుడు పేదరికంలో ఉన్నాం. ఉంటందుకు ఇల్లు లేదు… అయినా నీ కళ్లు చల్లబడలేదా? మాబాపు శ్రీమంతుడే. కానీ పేదోడు. ఇల్లు లేకనే ఊరవతల ఉంటుండు. ఆడనే పంటుండు. ఆ భూములు ఇప్పుడు సంపాదించినవి కాదు.. ఎప్పుడ్నుంచో ఉన్నవి. నా కొడుకుకే వందల ఎకరాలుంటే.. మా బాపుకెన్ని ఎకరాలుండాలె..?
అయినా పదేండ్లు అధికారంలో ఉంటే సంపాదనే ఉండదా? భూములు పెరగయా? ఆస్తులు పదింతలు కావా? అవును అప్పుడు పది రూపాయల మిత్తీకి తీసుకున్నడు. ఇప్పుడు పదింతలు సంపాదించిండు. శ్రీమంతుడు పేదోడై.. పేదోడు శ్రీమంతుడై.. జాతికి సిరిసంపదలై.. జాతిపితగా కీర్తి కిరీటాలు సాధించాడనే కదా.. నీకంత కుళ్లు..? బాపెప్పుడూ శ్రీమంతుడే. కానీ ఇప్పుడు పేద శ్రీమంతుడు.