ఇప్పుడో చర్చ వాడివేడీగా సాగుతోంది. కేసీఆర్ ఫామ్‌హౌజ్ భూముల లెక్క గురించి. అందరి దృష్టి రేవంత్‌పైనే నిలిచాయి. ఓ అనుమానంతో కూడిన ఆ చూపులో ఓ వాదన ఉంది. ఓ డిమాండ్ కూడా ఉంది.
అదేంటంటే.. కొండంత రాగం తీసి.. అన్నట్టుగా దీన్ని రేవంత్ తుస్సుమనిపించడు కదా అని. అవును. ఇది ఆ పార్టీలోనూ జరుగుతున్న చర్చే. కేటీఆర్ మీద ఈ-కార్ రేసు కేసుతో పాటు ఫోన్ ట్యాపింగు కేసులను కోల్ట్ స్టోరేజీలో భద్రంగా ఉంచాడు రేవంత్. కాళేశ్వరం కహానీ కూడా కంచికి చేరింది.
దీనిపై అసెంబ్లీలో అర్థరాత్రి వరకు చర్చలు జరిపి.. సీబీఐ కి అప్పగిస్తున్నట్టు ప్రకటన చేసి బీజేపీ కోర్టులో బంతిని వేసేశాడు. ఇంత గొంతు చించుకున్నా జనం దీన్ని కూడా లైట్‌గానే తీసుకున్నారు. అలా వారు లైట్‌గా తీసుకోవడంలో కూడా తప్పులేదు. తప్పలేదు. సర్కార్ చేష్టలే అలా ఉన్నాయి.
ఇవాళ కేటీఆర్ మాట్లాడుతూ.. జన్వాడా ఫామ్‌హౌజ్ నాదే నాదే అంటున్నారు.. మరి మూడేండ్లు ఏం పీకారు? అని. ఇదే ప్రశ్న ఇప్పుడు జనం నుంచి కూడా వస్తోంది. చర్యలు తీసుకునేది లేదు. ఆరోపించి దొంగ అని ముద్రేసి వదలడమే సర్కార్ తీరు అని జనం గట్టిగా నమ్మేశారు. కేటీఆర్‌ను జైలుకు పంపే సీన్ లేదు. పంపాలని కూడా రేవంత్ అనుకోవడం లేదు. అనసవరంగా కేటీఆర్‌కు సానుభూతి పెంచడమే తప్ప… ఏం లాభం లేదని ఆయనకు తెలుసు.
అందుకే ఆ ఆరోపణ కేసులను తన అమ్ముల పొదిలో భద్రంగా దాచుకుని అవసరమొచ్చినప్పుడు వాటిని సంధిస్తాడన్నమాట. కానీ అవి మొండి బాణాలేనని జనం అనుకుంటున్నారు. ఫిక్స్ అయిపోయారు కూడా. కాళేశ్వరం కేసుతో సహా. మరి తాజాగా కేసీఆర్ ఫామ్‌హౌజ్ భూముల లెక్కలను నెత్తికెత్తుకున్నది రేవంత్ సర్కార్. పైగా ఈ భూములను దలితులకు పంచేస్తానని సీఎం అనడంతో దీనికి అంత్యంత ప్రయార్టీ దొరుకుతోంది.
నిజంగా అక్కడ అన్ని వందల ఎకరాల భూములు అన్యాక్రాంతమయ్యాయా? కేసీఆర్ అప్పనంగా ఆ భూముల్లో ఫామ్ హౌజ్ నిర్మించుకుని సేద తీరుతున్నారా? సీఎం ఇంతలా వార్నింగు ఇస్తున్నాడంటే.. అదీ ముప్పై రోజుల్లో విచారించి నిజనిజాలు నిగ్గు తేల్చాలని ఆఫీసర్లనే ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నాడంటే.. ఇదిగో ఇలా దీనిపై ఆసక్తి పెరిగింది. అదే సమయంలో సీఎం చర్యలపై పెదవి విరుపు మాటలు కూడా పెరిగాయి.
ఇదీ ఓ ఉత్త ఆరోపణగానే మిగిలిపోతుంది చూడు. అక్కడ భూముల లెక్కలు తేలవు. ఈయన దళితులకు పంచడు.. మధ్యలో మనమే పిచ్చోళ్లం .. మూడేళ్లుగా జరుగుతున్న తంతు ఇదే కదా! అని జనం కూడా ఉసూరుమంటున్నారు.
అయితే ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇప్పుడు కేసీఆర్ ఫామ్‌హౌజ్‌భూముల లెక్కలు ఓ లెక్క అంటున్నారు జనం. మొన్నటి దాకా వెయ్యి ఎకరాల్లో కేసీఆర్ ఫామ్‌హౌజ్ కట్టుకుని ఉన్నాడని రేవంత్ ఆరోపించిన మాటలను బీఆర్‌ఎస్ ఇప్పుడు గుర్తు చేస్తున్నది. మొన్నటి దాకా వెయ్యి ఎకరాలన్న రేవంత్.. ఇప్పుడు 67 ఎకరాలని అంటున్నాడనే కామెంట్స్‌ను జనాల్లోకి బలంగా తీసుకుపోవడం వల్ల … ఇవి ఉత్త ఆరోపణలేనని తేల్చిపారేస్తున్నారు.
ఇప్పటి వరకు కేసీఆర్, కేటీఆర్ లపై పెట్టిన కేసులు కూడా ఇలాంటివేనని జనం లైట్‌గా తీసుకుని కొట్టిపారేసే వ్యూహానికి పావులు కదుపుతున్నది బీఆర్ఎస్. మరి నెల తరువాత ఈ లెక్కలు తేలాల్సిందే. లేకపోతే ఎవరేంటో జనమే లెక్క చూసి సరి చేస్తారు ఖుల్లం ఖుల్లాగా..అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.