Duggondi Police: స్వేచ్ఛ బ్యూరో: మా రూటే సెపరేటు అన్నట్టుగా ఉంది వరంగల్ కమిషనరేట్ లోని దుగ్గొండి పోలీసుల తీరు. చేతికొచ్చిన పంటను నాశనం చేశారు.. బాధ్యులపై చర్యలు తీసుకోండి అంటూ ఓ రైతు ఇచ్చిన ఫిర్యాదుపై కేసులు నమోదు చేయాల్సిందిపోయి అదేమన్నా పెద్ద నేరమా? అని దబాయించారు. పైగా, అసలు పొలం నీదేనా? అంటూ ఎదురు ప్రశ్నించారు. కేసుతో సంబంధం లేకున్నా రెవెన్యూ సర్వే జరిపిస్తాం.. రిపోర్ట్ వచ్చాక చూద్దాం అంటూ దబాయించి బాధితున్ని వెనక్కి పంపించి వేశారు. దీనిపై ప్రశ్నిస్తే కాగ్నిజబుల్ అఫెన్స్ కాదు కాబట్టి కేసు నమోదు చేయలేదని సమాధానమిస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే బాధితునికి దుగ్గొండి పోలీస్ స్టేషన్ లో ఇలాంటి అనుభవం ఎదురవటం రెండోసారి కావటం. బాధితుడు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
ఆదేశాలు గాలికి..
నిష్పాక్షిక విచారణ జరిపి పోలీస్ స్టేషన్లకు వచ్చే వారికి న్యాయం చేయాలంటూ డీజీపీ మొదలుకుని అన్ని యూనిట్ల పోలీస్ ఉన్నతాధికారులు కిందిస్థాయి సిబ్బందికి తరచూ సూచిస్తున్నారు. అయితే, క్షేత్రస్థాయిలో కొంతమంది సిబ్బంది దీనికి పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. బాధితులకు న్యాయం చేయాల్సింది పోయి వారిపైనే దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి ఉదంతమే వరంగల్ కమిషనరేట్ పరిధిలోని దుగ్గొండి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక్కసారి కాదు రెండుసార్లు వెలుగు చూసింది.
వేలం ద్వారా..
దుగ్గొండి స్టేషన్ పరిధిలోని దేశాయిపల్లి గ్రామానికి చెందిన తొగరు కట్టమల్లు, తొగరు జోరయ్య అన్నదమ్ములు. కాగా, కొన్నేళ్ల క్రితం జోరయ్య ఆర్థికావసరాల నేపథ్యంలో 22గంటల పొలాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టాడు. బాకీ చెల్లించక పోవటంతో ఆ భూమి వేలానికి వచ్చింది. బ్యాంక్ వేలంలో పాల్గొన్న కట్టమల్లు 1998, డిసెంబర్ 23న 61వేల రూపాయలకు పాట పాడి ఆ భూమిని దక్కించుకున్నాడు. ఈ మేరకు నర్సంపేట జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ప్రస్తుతం ఆ భూమిలో కట్టమల్లు కుమారుడు రాజు వ్యవసాయం చేస్తున్నాడు.
దాయాదుల కన్ను..
కాగా, అతని దాయాదులు, జోరయ్య కుమారులైన అశోక్, మాణిక్యాల రాజు కొంతకాలంగా ఆ భూమి తమదే అంటూ గొడవలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే జూలైలో రాజు సాగు చేసిన మొక్కజొన్న, కంది పంటలపై గడ్డిమందును స్ప్రే చేసి పూర్తిగా నాశనం చేశారు. దీనిపై రాజు డయల్ 100కు ఫోన్ చేయగా స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని హెల్ప్ లైన్ సిబ్బంది సూచించారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్ కు వెళ్లిన రాజుకు ఊహించని అనుభవం ఎదురయ్యింది. అసలు సమస్య ఏందని తెలుసుకోకుండానే ఎస్ఐ రణధీర్ రెడ్డి అతనిపై చేయి చేసుకున్నాడు. డయల్ 100కు డైరెక్ట్ గా ఎలా ఫోన్ చేస్తావంటూ దూషించాడు.
డీజీపీకి ఫిర్యాదు చేసినా..
దాంతో దిక్కుతోచని స్థితిలో స్టేషన్ నుంచి బయటకు వచ్చిన రాజు జరిగిన విషయాన్ని వివరిస్తూ తన న్కాయవాది ద్వారా డీజీపీ కార్యాలయానికి ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశాడు. తనపట్ల దురుసుగా ప్రవర్తించి చేయి చేసుకున్న ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని కోరాడు. దీనిపై నర్సంపేట ఏసీపీతో విచారణ కూడా చేయించారు. ఆయన స్వయంగా బాధితుని నుంచి వివరాలు సేకరించారు. అయితే, ఫిర్యాదీపట్ల దురుసుగా ప్రవర్తించిన ఎస్ఐపై మాత్రం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
రెండోసారి..
కాగా, ఈనెల 4న తొగరు అశోక్ తన భార్య నాగలక్ష్మి, తల్లి తారాలక్ష్మి, మాణిక్యాల సునీత, ముత్యాల ఉమాదేవి, ముత్యాల శ్రీను తదితరులతో కలిసి రాజు పొలంలోకి చొరబడ్డాడు. దాదాపు 12గుంటల భూమిలో పండించిన మొక్కజొన్న కంకులను తెంపివేసి ఆటో ట్రాలీ (నెంబర్ టీజీ 24టీ 1627)లో తరలించాడు. వెంటనే రాజు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన బ్లూ కోల్ట్స్ పోలీసులు ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ఇంత జరిగినా కేసులు మాత్రం నమోదు చేయకపోవటం గమనార్హం. దీని గురించి బాధితుడు ఎస్ఐని కలవగా అసలు ఆ పొలం నీదే అని నమ్మకమేంది? రెవెన్యూ ఎంక్వయిరీ జరిపిస్తాం.. రిపోర్టు వచ్చినపుడు చూద్దాం అని సమాధానం ఇచ్చి పంపించాడు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే వేలంలో ఈ భూమిని రాజు తండ్రి కొన్నట్టు నర్సంపేట జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఉత్తర్వులు ఉండటం. వాటిని చూపించినా సదరు ఎస్ఐ పట్టించుకోకపోవటం.
అది పోలీస్ బాధ్యత కాదు..
దీనిపై ఓ పోలీస్ అధికారితో మాట్లాడగా భూమి ఎవరిదన్నది తేల్చాల్సింది పోలీసులు కాదు,. రెవెన్యూ అధికారులని చెప్పారు. జరిగిన సంఘటనపై కేసులు నమోదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మాత్రమే పోలీసులకు ఉంటుందన్నారు. అయితే, ఆశ్చర్యకరంగా జరిగింది నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్…అందుకే కేసులు నమోదు చేయలేదు.. కోర్టుకు రిపోర్టు పంపించామని ఎస్ఐ చెప్పటం. దీనిపై మాట్లాడితే ఒకరి పొలంలోకి చొరబడి పంటను కోసుకుని తరలించటం చోరీ కిందకు వస్తుందని పోలీసు వర్గాలే చెబుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో అది కాగ్నిజబుల్ నేరమవుతుందని పేర్కొంటున్నాయి. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.
Also Read: KBR పార్కు చుట్టూ శాశ్వతంగా వన్ వే.. హెచ్ సిటీ పనుల్లో సవరణలు!