Mana Village Uttarakhand: ఒక ఆచారం.. 2 వేల మందిని బతికించింది! ఒక సంప్రదాయం.. 400 కుటుంబాలను మహా విపత్తు నుంచి రక్షించింది! ఈ ఆధునిక ప్రపంచంలో.. ఇలాంటివి వినడానికి వింతగానే ఉన్నా.. నిజం ఎప్పటికీ మారదు. ఉత్తరాఖండ్‌లో సంభవించిన భారీ హిమపాతం నుంచి.. ఈ దేశపు మొట్టమొదటి గ్రామం ఎలా బయటపడిందో తెలిస్తే కచ్చితంగా ఆశ్చర్యపోతారు. పూర్వీకులు చెప్పిన కొన్ని ఆచార సంప్రదాయాల్ని ఎందుకు పాటించాలని చెప్పడానికి.. ఇదే ఎవరెస్ట్ అంత ఎగ్జాంపుల్.
బద్రీనాథ్ క్షేత్రానికి సమీపంలో విరిగిపడిన మంచు చరియలు
ఉత్తరాఖండ్‌లో కొన్నిరోజులుగా భారీగా మంచు కురుస్తోంది. ఈ క్రమంలో బద్రీనాథ్ క్షేత్రానికి సమీపంలో భారీగా మంచు చరియలు విరిగిపడ్డాయి. వాటిని తొలగించే క్రమంలోనే 55 మంది కార్మికులు మంచులో చిక్కుకుపోయారు. వారిలో 50 మందిని ఇండియన్ ఆర్మీ రక్షించింది. కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో.. జోషిమఠ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురిని కాపాడేందుకు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. భారత్-టిబెట్ సరిహద్దుల్లో.. మన దేశానికి చెందిన మొట్టమొదటి గ్రామం మనా దగ్గరే ఈ దుర్ఘటన జరిగింది.
ఇదే ఘటన వెనుక మనకు కనిపించి మరో కోణం
నేషనల్ హైవేపై భారీగా పేరుకుపోయిన మంచు మేటల్ని.. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ సిబ్బంది తొలగిస్తుండగా మంచు చరియలు విరిగిపడ్డాయి. దాంతో.. కార్మికులు మంచులో కూరుకుపోయారు. ఇదంతా.. ఇప్పుడు జరిగిన దుర్ఘటనలో మనకు కనిపిస్తున్న వాస్తవం. కానీ ఇదే ఘటన వెనుక మనకు కనిపించని కోణం మరొకటుంది. ఈ భారీ హిమపాతం నుంచి 2 వేల మంది జనాభా కలిగిన ఓ గ్రామం సేఫ్‌గా బయటపడింది. ఆ ఊరిని, అక్కడి జనాన్ని కాపాడింది.. కేవలం పురాతన ఆచారమే! వారు ప్రతి ఏటా పాటించే సంప్రదాయమే! ఎవరు నమ్మినా, నమ్మకపోయినా ఇదే వాస్తవం!
2 వేల మంది జనాభా కలిగిన మనా గ్రామం
హిమాలయ శిఖరాల్లో 2 వేల మంది జనాభా కలిగి ఉంది మనా గ్రామం. ఈ భారీ హిమపాతం సంభవించే సమయానికే.. అక్కడి ప్రజలు ఊరు ఖాళీ చేసేశారు. శుక్రవారం మనా గ్రామానికి సమీపంలో మంచు చరియలు విరిగిపడి, ఆ మార్గంలో ఉన్న ప్రతిదానిని తుడిచిపెట్టే సమయానికి.. ఊళ్లో ఎవరూ లేరు. ఈ దుర్ఘటన గురించి తెలిశాక.. మనా గ్రామ ప్రజలు తామెంతో అదృష్టవంతులమని.. తమకు ఆ దేవుడి ఆశీస్సులు ఉన్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా.. శతాబ్దాలుగా ఆచరిస్తున్న వలస సంప్రదాయమే.. తమని కాపాడిందని బలంగా నమ్ముతున్నారు.
5 సెకన్లలేనే గంటకు 80 మైళ్ల వేగంతో మంచు చరియలు
ప్రతి ఏటా శీతాకాలంలో.. హిమాలయ పర్వత ప్రాంతాల్లో మంచు చరియలు విరిగిపడటం సాధారణమే. ఈ చరియలు 5 సెకన్లలోనే గంటకు 80 మైళ్ల వేగంతో కిందకు జారుకుంటాయి. ఇలాంటి ఘటనల్లో భారీగా మంచు విడుదలై.. మొత్తం తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది. ఈ విధమైన పరిస్థితుల్లో మనా ప్రజలకు ఎప్పుడు ఊరిని ఖాళీ చేయాలో.. చాలా కాలంగా తెలుసు. వాళ్లు గనక ముందే దిగువ ప్రాంతాలకు మారకపోయినా.. తమ ఆచార, సంప్రదాయాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా.. ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉండేది. వందలాది మంది మంచులోనే చిక్కుకుపోయేవారు.
ప్రతి నవంబర్‌లో బద్రీనాథ్ ఆలయం తలుపులు మూసివేత
ప్రతి నవంబర్‌లో బద్రీనాథ్ ఆలయం తలుపులు మూసిన తర్వాత.. మనా గ్రామ ప్రజలంతా వలస వెళ్లడం మొదలుపెడతారు. కఠినమైన శీతాకాలం నుంచి తప్పించుకునేందుకు.. వారంతా తమ ఇళ్లు, జీవనోపాధిని వదిలేసి.. చమోలి జిల్లాలోని గోపేశ్వర్, జ్యోతిర్మఠ్, జింక్వాన్ లాంటి దిగువ ప్రాంతాలకు తరలి వెళ్తారు. మళ్లీ.. బద్రీనాథ్ ఆలయం తలుపులు తెరిచినప్పుడు మాత్రమే.. వారంతా తిరిగి మనా గ్రామానికి చేరుకుంటారు.
మనా గ్రామానికి 500 మీటర్ల దూరంలోనే భారీ హిమపాతం
ఇప్పుడు సంభవించిన భారీ హిమపాతం కూడా మనా గ్రామానికి కేవలం 500 మీటర్ల దూరంలోనే జరిగింది. అదృష్టవశాత్తూ మనా ప్రజలంతా తమ ఆచారాన్ని పాటించడం వల్ల.. అంతా ప్రాణాలతో బయటపడ్డారు. గతంలో ఫిబ్రవరి, మార్చి నెలల్లోనే ఇక్కడ హిమపాతాలు సంభవించాయి. ఈ గ్రామానికి సమీపంలోనే ఓ ఆర్మీ క్యాంప్ కూడా ఉంది. ముందే.. ఊరిని ఖాళీ చేయడం వల్ల.. 400 కుటుంబాలు విపత్తు నుంచి తప్పించుకున్నాయి.
పూర్వీకుల ఆచారం వెనుక ఖచ్చితంగా ఏదో ఒక మంచి!
మన పూర్వీకులు, పెద్దలు ఏదైనా ఒక ఆచారాన్ని పాటిస్తూ వచ్చారంటే.. కచ్చితంగా దాని వెనుక ఏదో ఒక మంచి ఉండే ఉంటుంది. అది మనందరికీ మేలు చేసేదో.. అప్పుడప్పుడు ఇలాంటి విపత్తుల నుంచి సేవ్ చేసేదో అయి ఉంటుంది. కానీ.. ఇప్పుడంతా మన ఆచారాల్ని, సంప్రదాయాల్ని సింపుల్‌గా కొట్టిపారేస్తున్నారు. ఇంకా.. మూఢ నమ్మకాలేంటని అంటున్నారు. అయినప్పటికీ.. కొన్ని కొన్ని ఆచార, సంప్రదాయాలు ఎందుకు పాటించాలి? అవి మనకు ఎలా సహాయపడతాయని చెప్పడానికి.. ఇదే ఎవరెస్ట్ అంత ఎగ్జాంపుల్.
ఘనమైన చరిత్ర పురాణాలతో ముడిపడి ఉన్న మనా విలేజ్
హిమాలయ పర్వతశ్రేణుల్లో నెలవైన ఈ మనా విలేజ్.. ఘనమైన చరిత్ర, పురాణాలతో ముడ ముడిపడి ఉన్న ప్రాంతం. మహాభారతంలో ద్రౌపది.. సరస్వతి నదిని దాటేందుకు భీముడు పడగొట్టిన భీమ శిల ఇక్కడే ఉంది. ఇక్కడే వ్యాస గుహ ఉంది. ఈ మనా గ్రామంలోనే వేద వ్యాసుడు మహాభారతాన్ని పఠించాడని, దానిని గణపతి లిఖించాడని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడి నుంచే.. పాండవులు స్వర్గరోహిణి అనే మార్గం ద్వారా స్వర్గానికి చేరుకున్నారని చెబుతారు. 1962 వరకు ఇండో-టిబెటన్ మధ్య మనా గ్రామం వాణిజ్య మార్గంగా ఉండేది. భారత్ నుంచి ధాన్యాలు, చక్కెర, వస్త్రాలను సప్లై చేసేవారు. టిబెట్ నుంచి రాక్ సాల్ట్, బోరాక్స్, ఉన్ని వచ్చేది. అయితే.. చైనాతో యుద్ధం తర్వాత ఈ సరిహద్దుని మూసేశారు. దాంతో.. వాణిజ్యం ఆగిపోయింది.